హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): సాగు విధానంలో సమూల మార్పులు రావాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కేవలం వరి పంటనే కాకుండా అన్ని రకాల పంటల సాగుపై రైతులు దృష్టిపెట్టాలని సూచించారు. పంటల కొనుగోలు, వానకాలం సాగు ఇతర అంశాలపై వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యాసంగి సీజన్లో వేరుశనగతోపాటు ఇతర నూనె గింజల పంటలు, పప్పు ధాన్యాలు సాగుచేయాలని సూచించారు. రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేందుకుగానూ రైతువేదికల్లో వారికి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. వేరుశనగ విత్తనాలను సబ్సిడీపై ఇచ్చే అవకాశాలను పరిశీలించి ప్రణాళిక సిద్ధంచేయాలని చెప్పారు. పంటల నమోదు ప్రక్రియను మరో పది రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు.