CM KCR | ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య అని.. మన బతుకుదెరువు ముచ్చట.. అందుకే ఆలోచించి ఓటేయాలని చెబుతున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. నాగర్ కర్నూల్లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలి. అఘాదంగా.. చిన్నాన్న చెప్పిండు.. బామ్మర్ది చెప్పిండని ఓటు వేస్తే ధరణి పోతదని.. కరెంటు కాటగలుస్తది.. రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీమ్. కాంగ్రెస్ పాలనలో మన ప్రాజెక్టులకు ఏం పేరు పెట్టారు. పాత మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టుల పేర్లు పెండింగ్ ప్రాజెక్టులు’ అని పేరుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘జిల్లా పేరే పెండింగ్ జిల్లా. మరి ఇవాళ ఎలా నీళ్లు వస్తున్నయ్. 30 ఏళ్లు పండవెట్టిన కల్వకుర్తి స్కీమ్ ఎలా తయారై నీళ్లు వస్తున్నయ్? ఇవాళ ఏ డాంబర్ రోడ్డు మీద చూసినా వడ్ల కుప్పలే ఎండపోసి ఉన్నయ్. ఎక్కడ చూసినా ధాన్యపు రాశులే. తెలంగాణ 3కోట్ల ధాన్యం పండిస్తున్నది. కాంగ్రెస్ రాజ్యంలో మనకు ఏం పేరు పెట్టారు. మీది బ్యాక్వర్డ్ ఏరియా.. వడ్లు పండయ్.. పంటలు పండియ్యరాదు.. తెలివి లేదు.. వెనుకపడ్డరు అని మాట్లాడారు. వెనుకపడ్డరని ఆ సన్నాసులు మాట్లాడిన్రు. మరి మూడుకోట్ల టన్నుల వడ్లు ఎక్కడికెలి వచ్చినయ్. ఎట్ల పండినయ్. చేసేటోడు ఉండే అయితది. మళ్లీ కాంగ్రెస్‌ను నమ్ముకొనిపోతే వైకుఠం ఆటలో పెద్దపాము మింగినట్లయితది. ధరణి తీసివేస్తే నష్టపోయేది రైతులే. మళ్లీ పైరవీకారులు వస్తరు. కడుపులో సల్ల కదలకుండా, మీ ఇండ్లకేలి అడుగుబయటపెట్టకుండా మీకు నీళ్లు వస్తున్నయ్’ అన్నారు.
‘తెలంగాణ కోసం దీక్ష చేసి పాణంపోయేదాక.. పేగులు తెగేదాక కొట్లాడి తెలంగాణ ఎవడు తెచ్చిండు ? మీ ప్రతి ఇంటికి నల్లా నీరు తెచ్చింది ఎవరు? ‘ఎనకటికి ఏవడో అన్నడట.. మీరంతా వంటలు వండిపెట్టండి.. నేను యాళ్లకు వచ్చి వడ్డిస్త అని అన్నడట’. ఈ యేషం గట్లనే ఉన్నది. ఇన్నేళ్లు తిప్పలు పడి చేస్తే.. కిందమీదపడి తొవ్వకచ్చినం. మొఖాలు తెల్లపడుతున్నయ్. రైతుల అప్పులు తీరుతున్నయ్. సొంత పెట్టుబడి పెట్టుకునే స్థాయికి వస్తున్నరు. దీన్ని చెడగొట్టుకోవద్దు. 15-16 ఏళ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చినవాడిగా క్షేమం కోరుత తప్ప చెడు జరగాలని కోరను. ఆలోచించకుండా ఓటు వేస్తే కిందిమీదయ్యే పరిస్థితి ఉంటది’ అని హెచ్చరించారు.
‘ఇవాళ ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఇంత పెద్ద సంఖ్యలో మీటింగ్‌కు వచ్చారంటే మర్రి జనార్దన్‌రెడ్డి గెలుపు ఖాయమైంది. చాలా భారీ మెజారిటీ వస్తుంది. అందులో అనుమానం లేదు. జనార్దన్‌రెడ్డి లాస్ట్ టైమ్ అడిగితే మార్కండేయ లిఫ్ట్ చెప్పినాం. మూడురోజుల నుంచి దుంకుతున్నది. 8వేల ఎకరాలకు నీరుపారుతుంది. జనార్దన్‌రెడ్డి మంచినాయకుడు. సొంత డబ్బు ఖర్చుపెట్టి ప్రతి ఏడాది పేదసాదల పెళ్లిళ్లు చేస్తడు. ఆయన డబ్బు కోసం ఆశించి రాజకీయాల్లో లేడు. ఆయన మంచి వ్యాపారవేత్త. మీకో ఇంకో విషయం తెలియాలి. నాగర్‌కర్నూల్ నిజాం జమానాలో జిల్లాగా ఉండే. నడుమల కాంగ్రెసోళ్లు ఆగం చేశారు. తెలంగాణ వచ్చాకనే మళ్లీ జిల్లా అయ్యింది. జిల్లా అవడమే కాదు జీవకళ వచ్చింది’ అన్నారు.
‘పంటలు పండుతున్నయ్. మెడికల్ కాలేజీ వచ్చింది. చాలా ఇన్స్టిట్యూషన్ వచ్చినయ్. జనార్దన్‌రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ కావాలని అడిగాడు. జనార్దన్‌రెడ్డిని గెలిపిస్తే నెలరోజుల్లోనే జీవో ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేస్తాం. మొన్ననే పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం చేశాను. వట్టెం రిజర్వాయర్ నిండితే 40-50వేల ఎకరాలకు నాగర్ కర్నూల్లో నీరు వస్తుంది. ఆ నాడు పాలమూరు ఎత్తిపోత పథకం లేదు. ప్రాజెక్టులను ఎండవెట్టి మనను అరిగోసపుచ్చుకున్నరు. ఇవాళ మంచిగ నడిచే తెలంగాణను కాపాడుడనేది మీ చేతుల్లోనే ఉంది. మీరే కాపాడుకోవాలి. జనార్దన్‌రెడ్డి ప్రజల కోసం కోరిన కోర్కెలను నెరవేర్చే బాధ్యత నాది. భారీ మెజారిటీతో గెలిపించండి.. నాగర్ కర్నూల్ అభివృద్ధి బాధ్యత నాది అని మనవి చేస్తున్న’నన్నారు.