CM KCR | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే పాలుగారే జిల్లాగా పాలమూరు తయారవుతుందని, లక్ష్మీ అమ్మవారు తాండవం చేసినట్లుగా ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌కు సమీప ప్రాంతం జడ్చర్ల. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 40-45 నిమిషాల తొవ్వ. లక్ష్మారెడ్డి పోలేపల్లి సెజ్ తెచ్చాడు. చాలామందికి ఉద్యోగాలు దొరుకుతున్నయ్. రాబోయే రోజుల్లో మీ అందరికి హామీ ఇస్తున్నా. బ్రహ్మాండమైన పరిశ్రమల కేంద్రంగా, ఐటీహబ్‌గా జడ్చర్లను తీర్చిదిద్దే బాధ్యత నాది’ అన్నారు.
‘మొదట మంచినీళ్ల బాధ పోవాలి మిషన్ భగరీథ తెచ్చుకున్నాం. ప్రస్తుతం ప్రతి ఇంటికి నల్లా నీరు వస్తున్నయ్. అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులు ఉండేవి. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్‌ను కూడా పూర్తి చేసుకున్నాం. పాలమూరు ఎత్తిపోతల పథకం 90శాతం పూర్తయ్యింది. పది శాతం పూర్తి కావాలి. అనుమతులు వస్తున్నాయి. ప్రాజెక్టు పూర్తయితే పాలమూరు పాలుగారే జిల్లాగా.. బంగారు తునకగా మారుతుంది. ఒకసారి జడ్చర్ల ఎమ్మెల్యే తండ్రిగారు చనిపోయిన సందర్భంలో పరామర్శకు వెళ్లిన సమయంలో జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులతో రోడ్డుమార్గంలో మహబూబ్‌నగర్‌కు వెళ్లాను.
అప్పటికి ఇప్పటికి చూస్తే ఎక్కడ చూసినా పంటపొలాలు, వరిచేలతో అద్భుతమైన సీన్ కనిపిస్తుంది. దుందుబి నది ఒకప్పుడు దుమ్ముకొట్టుకొనిపోయింది. ఇవాళ నదిపై చెక్‌డ్యామ్‌లు కట్టుకున్నాం. బ్రహ్మాండంగా నీళ్లు ఆగి ఉన్నయ్. మొన్న కొల్లాపూర్ వెళ్తుండగా దుందుబి నది దాటుతుంటే.. నదిలోని నీళ్లు కండ్లకు ఆనందం కలిగించాయి. ఒకప్పుడు దుమ్ముకొట్టుకుపోయిన దుందుబి నది జీవనదిలా మారే పరిస్థితి వచ్చింది. రాబోయే రోజుల్లో పాలమూరు ఎత్తిపోతల పూర్తయితే.. చాలా అద్భుతంగా ఈ జిల్లా రూపురేఖలు మారుతాయి. లక్ష్మీ అమ్మవారు తాండవం చేసినట్లుగా ఉంటుంది’ అన్నారు.
‘ఏ రోజైనా పేదల గురించే ఆలోచించాం. మనకు మతాలు, కులాలు లేవు. అందరినీ కడుపులో పెట్టుకొని సమానంగా చూసుకుంటు పోయాం. మనం ఎవరినీ కించపరుచుకోలే. రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టుకున్నాం. మైనారిటీలు, దళితబిడ్డల, గిరిజనబిడ్డల, బీసీ బిడ్డల కోసం పెట్టుకున్నాం. అగ్రవర్ణాల పేదలు సైతం మాకు రెసిడెన్షియల్ పాఠశాలలు ఇవ్వాలని అడుగుతున్నారు. నియోజకవర్గానికి ఒకటి 119 చొప్పున ఇస్తామని చెప్పాం. తెలంగాణలో ఉన్న ప్రతిబిడ్డ మన బిడ్డనే.
రాష్ట్రంలో ముస్లిం నాయకులకు సెల్యూట్ చేస్తున్నా. మొన్న గణపతి నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ రెండు ఒకటే రోజు వచ్చాయి. హైదరాబాద్‌లో పండగ బ్రహ్మాండంగా జరుపుతారు. రెండుఒకే రోజు వస్తే ఇబ్బందులు తలెత్తుతయి ముస్లిం మత పెద్దలు నిర్ణయం చేసుకొని మిలాద్ ఉన్ నబీని ఒక రోజు వాయిదా వేసుకున్నారు. గంగా జమున తెహజీబ్ అంటే ఇదే. మొత్తం భారతదేశానికే ఆదర్శవంతమైన రాష్ట్రంగా నిలిచింది. అన్నిమతాలు, కులాల వారు అన్నదమ్ముల్లా ఎట్లా కలిసి ఉంటరు అనేదానికి నిదర్శనంగా తెలంగాణ రుజువు చేస్తున్నది’ అని తెలిపారు.