Minister KTR | జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఎన్డీయేలో చేరేందుకు కేసీఆర్ ప్రయత్నించారని ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఖండించారు. కేసీఆర్ ఒక ఫైటర్ అని చీటర్లతో ఎన్నటికీ చేతులు కలపరని స్పష్టం చేశారు. ఎన్డీయేతో చేరాల్సిన ఖర్మ తమకు లేదని తెలిపారు. ఎన్డీయేలో చేరేందుకు తమకు పిచ్చికుక్క కరిచిందా అని ప్రశ్నించారు. అది మునిగిపోయే నావ అని.. ఇప్పటికే అన్ని పార్టీలు వీడిపోతున్నాయని అన్నారు. శివసేన, జేడీయూ, తెలుగుదేశం, శిరోమణి అకాలీదళ్ పార్టీలు వెళ్లిపోయాయని అన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ తప్ప ఎన్డీయేలో ఎవరు ఉన్నారని ఎద్దేవా చేశారు.
ఇప్పట్నుంచి ప్రధాని మోదీని ఎవరైనా కలిస్తే.. ఒక వీడియో కెమెరా పెట్టుకుని ఆయనతో మాట్లాడే ప్రతి మాట రికార్డు చేసుకుంటే మంచిదేమో అని తనకు అనిపిస్తుందని విమర్శించారు. ఏ రాష్ట్రానికి వెళ్లినా ఒకేరకంగా మాట్లాడటం మోదీకి అలవాటు అయిపోయిందని అన్నారు. ‘బెంగాల్ పోతారు.. మమతా బెనర్జీ దేశంలోనే అత్యంత కరెప్టెడ్ చీఫ్ మినిస్టర్ అని మాట్లాడతారు. ఒడిశాకు వస్తారు. నవీన్ పట్నాయక్ దేశంలోనే అత్యంత అవినీతిమయమైన ముఖ్యమంత్రి అని అంటారు. మేఘాలయ వెళ్తారు.. అక్కడేమో.. మళ్లీ సాంగ్మా దేశంలోనే కరెప్టెడ్ సీఎం అని అంటారు. సరిగ్గా వారం రోజుల తర్వాత ఆయన ప్రమాణస్వీకారంలో ఈయన పార్టీ కూడా చేరుతుంది. ఇద్దరూ కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారు.’ అని అన్నారు. ప్రధాని మోదీ పచ్చి అబద్దాలకోరు అని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని నాలుగైదు ఏండ్ల చిన్న పిల్లలు కూడా నమ్మని పచ్చి అబద్దాలు చెప్పి ఆయన ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా బాధకరం.. శోశనీయమని అన్నారు.
ప్రధాని మోదీ సెలెక్టెవ్ అమ్నేషియాతో బాధపడుతున్నారని.. ఆయనతో ఉంటే మంచోళ్లని.. అన్ని కన్వినెంట్‌గా మరిచిపోతారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ‘ ప్రకాశ్‌సింగ్ బాదల్ సీఎంగా.. ఆయన కొడుకు సుఖ్బీర్ సింగ్ బాదల్ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఎన్డీఏలో ఉండొచ్చు. అప్పుడు రాజులు- యువరాజులు గుర్తుకురారు. ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ కూతురు మెహబూబా ముఫ్తీ పీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా రాజులు యువరాణులు గుర్తుకురారు. నిన్నకాక మొన్న ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సీఎంగా.. లోకేశ్ కేబినెట్ మంత్రిగా ఎన్డీఏలో ఉన్నప్పుడు రాజులు – యువరాజులు గుర్తుకురారు. బాల్ ఠాక్రే కొడుకు ఉద్ధవ్ ఠాక్రే శివసేనతో అంటగాగినప్పుడు కూడా రాజులు – యువరాజులు, వారసత్వం గుర్తుకు రారు. జనతాదళ్ సెక్యూలర్ (జేడీఎస్)కు చెందిన దేవెగౌడ కొడుకు కుమారస్వామి నిన్నగాక మొన్న ఎన్డీఏలో చేరారు. మరి అప్పుడు ప్రజాస్వామ్యం, రాజులు-యువరాజులు గుర్తుకురాలేదా?’ అని ప్రశ్నించారు. మీకు పనికొచ్చినప్పుడు ఒకలా.. పనికిరానప్పుడు మరొకలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమనేది ప్రధానమంత్రే ఆలోచించుకోవాలని సూచించారు.
ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలకోరు అని.. బీజేపీ ఈజ్ కాల్డ్ బిగ్గెస్ట్ ఝూట్ పార్టీ, బిగ్గెస్ట్ జుమ్లా పార్టీ ఇన్ ఇండియా అని విమర్శించారు. మోదీ గొప్ప స్టోరీ టెల్లర్, స్టోరీ రైటర్ అని.. ఆయన స్క్రిప్టులు రాసుకోవడం మంచిదని అన్నారు. మోదీ యాక్టింగ్, స్క్రిప్ట్ రైటింగ్‌కు ఆస్కార్ కూడా వస్తుందని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ నోటికొచ్చింది మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఒకసారేమో కర్ణాటకలో కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ డబ్బులు ఇచ్చిందని అంటారు. మరోసారేమో.. ఎన్డీఏలో చేరేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తే.. తాను అనుమతించలేదని మాట్లాడతారు. ఎన్డీఏలో చేరేందుకు మాకేమైనా పిచ్చి కుక్క కరిచిందా అని ప్రశ్నించారు. అన్ని పార్టీలు ఎన్డీయేను విడిచి వెళ్తున్నాయి. శివసేన మిమ్మల్ని విడిచివెళ్లిపోయింది. జేడీయూ, తెలుగుదేశం పార్టీలు వెళ్లిపోయాయి. శిరోమణి అకాలీదళ్ వెళ్లిపోయింది. మీతో ఎవరు ఉన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ తప్ప ఎన్డీఏలో ఎవరు ఉన్నారు. ప్రధాని మోదీ అనుకుంటారు.. తను చాలా పవిత్రమైన వ్యక్తి అని.. ప్రపచంలో మిగిలిన వాళ్లంతా అవినీతి పరులని అనుకుంటారు. ప్రధానికి ఒక్కటి గుర్తు చేయాలని అనుకుంటున్నా.. హేమంత్ బిశ్వాస్ శర్మపై ఉన్న కేసు ఏమైంది? మీ పార్టీలో చేరగానే కేసు మాయమైపోయిందా? సీఎం రమేశ్, సుజనా చౌదరిపై ఈడీ, సీబీఐ ఐటీ దాడులు జరిగాయి కదా.. ఆ కేసులు ఏమైపోయాయి? నారాయణ్ రాణే, జ్యోతిరాదిత్య సింథియాపై కేసులు ఏమయ్యాయి? మీతో కలిసిన తర్వాత వాళ్లపై పెట్టిన కేసులు ఏమైపోయాయి?
వారసత్వం, కుటుంబరాజకీయాలపై ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపైన కూడా మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ‘ అనురాగ్ ఠాకూర్ ఎవరు? దుమాల్ కొడుకు కాదా?.. జ్యోతిరాదిత్య సింథియా ఎవరు? మాదవరావు కొడుకు కాదా?.. జైషా ఎవరు? క్రికెటరా? కోచా? బీసీసీఐ జనరల్ సెక్రటరీ ఎలా చేశారు?’ అని ప్రశ్నించారు. మాట్లాడేముందు ఆలోచించుకోవాలని హితవు పలికారు. ‘కేసీఆర్ ఒక ఫైటర్.. చీటర్లతోఎన్నటికీ చేతులు కలపరు. ఎన్డీయేతో చేరాల్సిన ఖర్మ మాకులేదు. అది మునిగిపోయే నావ. కేసీఆర్ ఎప్పుడు కూడా మీలాంటి నాయకులు, మీలాంటి పార్టీతో చేతులు కలపరు. మేం ఢిల్లీకి గులాములం కాదు. మేం గుజరాత్ గులాములం కాదు.’ అని స్పష్టం చేశారు.
నన్ను ముఖ్యమంత్రిని చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లి పర్మిషన్ అడిగారని అన్నారు. మా పార్టీలో నిర్ణయాలు తీసుకోవాలంటే మేమే తీసుకుంటాం.. మీ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిపించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఎన్ని అబద్ధాలు.. మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో బీజేపీకి 105 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయని.. ఈసారి 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయమని తెలిపారు. ఒక్క ఎంపీ స్థానంలో కూడా గెలవలేరని సవాలు విసిరారు. బీజేపీ, నడ్డా, మోదీ, అమిత్ షా ఇంకా ఎంతమందైనా నాయకులు తెలంగాణకు వచ్చి ప్రచారం చేసుకోవచ్చని.. టూరిస్టులకు వెల్కమ్ అని చెప్పారు. ఈ తొమ్మిదేండ్లలో తెలంగాణకు ఏం చేశారో ప్రజలకు తెలుసు. మీరు ఇచ్చింది గుండు సున్నా.. మీకొచ్చేది గుండు సున్నానే అని అన్నారు. ‘ రాహుల్ గాంధీ వచ్చి మేం బీజేపీకి బీ టీమ్ అని అంటారు.. మోదీ వచ్చి కర్ణాకటలో కాంగ్రెస్‌కు పైసల్ పంపినం అని అంటారు. మేం కాంగ్రెస్‌కు పైసల్ పంపుతుంటే మీ ఐటీ టీమ్ ఏం చేస్తుంది?’ అని ప్రశ్నించారు. ఈ పిచ్చి మాటలు, ఊకదంపుడు ఉపన్యాసాలతో బెదిరిపోతామని అనుకుంటున్నారేమో. ఆత్మాభిమానం ఉన్న తెలంగాణ బిడ్డలం.. ఢిల్లీ గులాములు.. గుజరాతీ బానిసలం కాదు.. కచ్చితంగా కొట్లాడతాం. చివరిదాకా నిలబడి తలబడతాం. ప్రజాక్షేత్రంలోనే మీతో పోరాడతాం. అని స్పష్టం చేశారు.