Minister Harish Rao | సిద్దిపేట కీర్తిని ప్రపంచపటంలో నిలబెట్టిన గొప్ప నేత సీఎం కేసీఆర్ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సిద్దిపేటలో లక్ష మందితో సిద్దిపేట ప్రగతి ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నామని, సీఎం కేసీఆర్ సభకు హాజరవుతారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అన్నిట్లో ముందుంది. అభ్యర్థుల ప్రకటనలో, మేనిఫెస్టో ప్రకటనలో గెలుపులో ముందుంటుందన్నారు. సిద్దిపేట మట్టి బిడ్డ కేసీఆర్ సిద్దిపేట జిల్లాను సాధించారన్నారు. స్వచ్ఛందంగా తరలివచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఘనస్వాగతం పలకాలన్నారు. సాయంత్రం 4.45 గంటలు సిద్దిపేటకు హెలికాప్టర్లో సిరిసిల్ల నుంచి సిద్దిపేట సభకు వస్తారన్నారు. 5.30 గంటలకు సభ ప్రారంభమవుతుందన్నారు. 20వేల మంది విద్యార్థులు బైక్ ర్యాలీ ద్వారా స్వచ్ఛందంగా సభకు రానున్నారని, రైతులు, మహిళలు, విద్యార్థులు, యువకులు, లాయర్లు, డాక్టర్లు అందరూ ఈ సభకు విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు.
బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల ఫ్యూజులు ఎగిరిపోయాయని.. ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఉన్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రజల హృదయాలు ఆనందంతో పొంగుతుంటే ప్రతిపక్షాల గుండెలు జారిపోయాయన్నారు. ముఖ్యమంత్రి కుటుంబ పెద్దలా ఆలోచించి ఆచితూచి మేనిఫెస్టోని తయారు చేశారని.. ఆసరా పెన్షన్ అయినా, దళిత బంధువైన, రైతుబంధు, రైతుబీమా అయినా కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు నగదు పెంచి పేరు మార్చి ప్రవేశపెడతామని అంటున్నారని.. కాంగ్రెస్ పార్టీ తమ పథకాలను కాపీ కొట్టిందన్నారు. నమ్మకానికి మారుపేరు కేసీఆర్ అని.. నయవంచనకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ అంటూ విమర్శించారు. రానే రాదు కనే కాదు అన్న తెలంగాణను తెచ్చి చూపించిన నాయకుడు కేసీఆర్ అన్నారు. అంత బాధ్యతగా తెలంగాణ పట్ల ఎవరు ఉండరని.. కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా.. సౌభాగ్యలక్ష్మి వంటి పథకాలను మహిళ కోసం తెచ్చిన మహిళా పక్షపాతి కేసీఆర్ అన్నారు. ప్రతి నెల మహిళకు రూ.3వేలు ఇవ్వాలని సౌభాగ్యలక్ష్మి తేనున్నారన్నారు. గ్యాస్పొయ్యితో, గ్యాస్‌బండతో బీజేపీ సెగ పెట్టిందని, సిలిండర్‌ను రూ.400కే పేదలకు అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు.
సీఎం కేసీఆర్ మరో అద్భుతమైన పథకం ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇవ్వాలని మేనిఫెస్టోలో పెట్టారని, గత పాలకులు ముక్కిపోయిన, కుళ్లిపోయిన బియ్యం ఇచ్చేవారని గుర్తు చేశారు. ఆసరా పెన్షన్లను రూ.5వేలకు పెంచడం దివ్యాంగులకు రూ.6వేలకు పెంచడం.. రైతుబంధుని రూ.16వేలకు పెంచుతూ మేనిఫెస్టోలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు. మహిళలందరూ కొంగులు నడుముకు కట్టి నడవవే రామక్క బీఆర్ఎస్కు ఓటేద్దామని పాట రూపంలో ఉత్సాహంగా బీఆర్ఎస్కి మద్దతు తెలుపుతున్నారన్నారు. టికెట్లు ఇవ్వడంతో కాంగ్రెస్ నాయకుల నిజరూపం బయటపడుతున్నదని.. రూ.10కోట్లకు టికెట్ అమ్ముకుంటున్నారని.. ఐదు ఎకరాలకు టికెట్ అమ్ముకున్నారని ఢిల్లీలో గల్లీలో కాంగ్రెస్ నాయకులు నిరసనలు తెలుపుతున్నారన్నారు. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు ఆ నాడు నోటుకు ఓటుకు అడ్డంగా దొరికితే.. ఈ రోజు నోట్లకి సీట్లు అమ్ముకుంటున్నారని గాంధీభవన్‌లో కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా చెబుతున్నారని విమర్శించారు.