న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన సీఎం కేసీఆర్ యాదాద్రి పుణ్యక్షేత్రం ( Yadadri Temple ) ప్రారంభోత్సవానికి రావాలని ఆయనను ఆహ్వానించారు. అదే విధంగా ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రానికి అధికారికంగా భవనం ఏర్పాటు స్థలాన్ని కేటాయించాలని మోదీని కేసీఆర్ కోరారు. ఈ అభ్యర్థనలకు ప్రధాని సానుకూలంగా స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ కార్యక్రమం పూర్తికావస్తోంది. ఈ నేపథ్యంలో ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యఅతిథిగా హాజరు కావాలని సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. ఆలయ ప్రారంభోత్సవం కార్యక్రమం ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ మాసాల్లో నిర్వహించే అవకాశం ఉంది. సీఎం ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన ప్రధాని, యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభ మహోత్సవానికి తాను తప్పకుండా హాజరవుతానని స్పష్టమైన హామీ ఇచ్చారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన సందర్భంగా, అన్ని రాష్ట్రాలకు ఢిల్లీ కేంద్రంగా భవనాలు వున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రత్యేకంగా అధికారిక భవనం తెలంగాణ భవన్ నిర్మించుకునేందుకు, ఢిల్లీలో అనువైన చోట స్థలం కేటాయించాలని ప్రధానిని సీఎం కేసిఆర్ కోరారు. సానుకూలంగా స్పందించిన ప్రధాని, భవన్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయిస్తామని సీఎం కేసీఆర్కు హామీ ఇచ్చారు.