హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదం మహారాష్ట్ర రాజకీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నది. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో బీఆర్ఎస్ గ్రామస్థాయి నుంచి నియోజకవర్గస్థాయి దాకా పార్టీ, అనుబంధ కమిటీల నియామకం చేపట్టడం, తెలంగాణ మాడల్‌పై విస్తృత ప్రచారం కొనసాగిస్తుండటంతో అధికారంలో ఉన్న శివసేన-2, శివసేన, ఎన్సీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేత ల్లో గుబులు మొదలైంది. గత నెల 22 నుంచి మొదలైన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం మహారాష్ట్రను గులాబీమయం చేస్తున్నది. అధికార, ప్రతిపక్షం అనే తేడాలేకుండా బీఆర్ఎస్పై ఆరోపణలు చేయటం మొదలుపెట్టారు. వాటిని అంతే ధీటుగా బీఆర్ఎస్ తిప్పికొడుతున్నది. ఇలాంటి రాజకీయ వాతావర ణం గతంలో లేదని మహారాష్ట్రలోని సామాజిక విశ్లేషకులు, సామాజిక కార్యకర్తలు తెలిపారు.
బీఆర్ఎస్ అడుగుతోనే
బీఆర్ఎస్ దెబ్బకు మహారాష్ట్ర సర్కార్ దిగొచ్చిందనే అభిప్రాయం రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్నది. తెలంగాణలో రైతుబంధు తరహాలో మహారాష్ట్ర రైతుల కోసం ‘నమో షేతరీ మహా సమ్మాన్ నిధి యోజన’ పథకాన్ని అమలు చేస్తామని మహారాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకున్నది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్నిధికి అదనంగా మరో రూ.6000 ఇస్తామని మహారాష్ట్ర సర్కార్ ప్రకటించింది. తాము తెలంగాణ మాడల్‌ను ఊరూరా వివరించి చెప్పటం, ప్రజలూ తమకు తెలంగాణ తరహా పథకాలు కావాలని డిమాండ్ చేయటంతోనే మహారాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నదని బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నాయి. ఇంతకాలం రైతులను పట్టించుకోని మహారాష్ట్ర సర్కార్ ఉన్నపళంగా రైతుల మీద ప్రేమను కురిపించటానికి కారణం బీఆర్ఎస్ పార్టీయేనని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో గులాబీ శ్రేణులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ మూడునెలల క్రితం నాందేడ్, కంధార్-లోహా, ఔరంగాబాద్ బహిరంగ సభల్లో మహారాష్ట్ర సర్కార్‌ను డిమాండ్ చేయటంతోనే షిండే సర్కార్‌లో కదలిక వచ్చిందని గాంధేయవాది, సామాజిక కార్యకర్త వినాయక్‌రావ్ పాటిల్ పేర్కొన్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ అతిత్వరలోనే ప్రభావశీల, నిర్ణయాత్మక పార్టీగా అవతరిస్తుందని వెల్లడించారు. ఇంత స్వల్ప వ్యవధిలోనే మహారాష్ట్ర రాజకీయాలను బీఆర్ఎస్ ఇరకాటంలో పెడుతుందని తాము భావించలేదని ఆయన విశ్లేషించారు.
మహారాష్ట్ర రైతుల్లో బీఆర్ఎస్ పట్ల, సీఎం కేసీఆర్ విధానాలపట్ల మరింత ధీమా పెరిగింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ‘కేసీఆర్ మీకు ఇక్కడేం పని. మీరు తెలంగాణలో రాజకీయాలు చేయండి’ అన్న వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ అంతకన్నా ధీటుగా.. వేగంగా సమాధానం ఇవ్వటాన్ని మహారాష్ట్ర ప్రజలు స్వాగతించారు. ‘మహారాష్ట్రలో సజీవ జలధారలు పారే నదులున్నా… రైతులకు నీళ్లేందుకు ఇవ్వరు? దేశంలో అత్యధిక రైతు ఆత్మహత్యలు మహారాష్ట్రలోనే ఎందు కు జరుగుతున్నాయి? మహారాష్ట్ర రైతుల డిమాండ్లు తీర్చేదాకా నేను మహారాష్ట్ర వస్తూనే ఉంటా’ అని సీఎం కేసీఆర్ ఫడ్నవీస్‌కు ధీటుగా బదులిచ్చారు. ఈ వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపాయి. మరోవైపు రైతులు, సామాన్య ప్రజల్లో కేసీఆర్ పట్ల ఆదరణ పెరిగింది. రైతుల నుంచి అన్ని వర్గాలకు ఆ ఆదరణ విస్తరిస్తున్నది. బీఆర్ఎస్కు మహారాష్ట్ర ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఎంపీ సంజయ్ రౌత్ బీఆర్ఎస్ను బీజేపీకి బీ టీమ్ అంటూ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందించింది.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ శాశ్వత కార్యాలయాన్ని మొదట నాగ్‌పూర్‌లో ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. నాగ్‌పూర్, పూణే, ఔరంగాబాద్, ముంబై ప్రాంతాల్లో శాశ్వ త కార్యాలయాలను ప్రారంభించేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తున్నది. త్వరలోనే నాగ్‌పూర్ కా ర్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో పార్టీ జాతీయ, గుం టూరు ఏపీ కార్యాలయాన్ని ప్రారంభించారు.