CM KCR | నాటి పాలకుల కుట్రతో సమైక్య రాష్ట్రంలో ఉమ్మడిపాలమూరు సాగునీళ్లు లేక కరువుకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. మాజీ సీఎంలు చంద్రబాబు కుతంత్రం.. వైఎస్ ద్రోహంతో నడిగడ్డ బీడువారింది. పాలమూరును దత్తత తీసుకొన్న బాబు కనీసం కనికరం చూపకపోగా.. జలయజ్ఞం పేరుతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలమూరుకు తీరని అన్యాయం చేశారు. కేవలం 25 టీఎంసీలతో 50 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లిచ్చేలా కల్వకుర్తికి ప్లాన్ చేసి శిలాఫలకం వద్దే అది ఆగిపోయేలా బాబు కుట్ర చేస్తే.. జలయజ్ఞంలో పది ప్రాజెక్టులను ప్రకటించిన వైఎస్సార్ ఒక్కటీ పూర్తిచేయకుండా పాలమూరును వలసలగోస అనుభవించేలా చేశారు. ఉద్యమంనుంచీ పాలమూరు వెన్నంటే ఉన్న కేసీఆర్ స్వరాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పరుగులు పెట్టించి పాలమూరు సాగునీటి గోసను తీర్చారు. పడావుబడ్డ భూముల్లో పచ్చనిపంటలు పండి వలసలు వాపస్ వచ్చేలా చేశారు. ‘పాలమూరు-రంగారెడ్డి’తో నడిగడ్డలోని ప్రతి ఎకరాన్ని తడిపేలా ముందుకు కదులుతున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చూపిన వివక్ష ఒక ‘ఒడువని ముచ్చట’. 60 ఏండ్ల పాలనలో వారు చేసిన కుట్రలు.. తుంగలో తొక్కిన హామీలను మాటల్లో చెప్పలేం. ఇక నీళ్ల దోపిడీకి అంతేలేదు. తెలంగాణను ఎండబెడుతూ ఆంధ్రలో పచ్చని పంటలు పండించుకున్నారు. ఇక మాజీ సీఎంలు చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనైతే ఈ జలదోపిడీ తారాస్థాయికి చేరుకొన్నది. యావత్తు పాలమూరు జిల్లా ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అన్ని ప్రాజెక్టులను అడుగులో తొక్కిన తరహాలోనే ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం’ ఉసురుతీసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. నాటి ఉద్యమనేత, నేటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాటన్నింటినీ పటాపంచలు చేసి, కరువును తరిమి పాలమూరుకు మోక్షం కల్పించారు.
చంద్రబాబు కుట్రల్!
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడి పాలన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలకు తీరని శాపంగానే మిగిలింది. 1995లో సీఎంగా అధికారం చేపట్టిన చంద్రబాబు 2004 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఎన్టీఆర్ తరహాలోనే పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నారు. మరి చేసిందేమైనా ఉందా? అంటే అది శూన్యమే. పాలమూరు కరువు, వలస పేరు చెప్పుకొని ప్రపంచబ్యాంకు నుంచి రుణాలు పొందారు తప్ప అందులో ఒక్క పైసా కూడా పాలమూరు ప్రాజెక్టులకు ఖర్చు చేయలేదు. కానీ అంతకుమించి ద్రోహాన్ని తలపెట్టారు. అందుకు జూరాల, కల్వకుర్తి ప్రాజెక్టులే నిదర్శనం. ‘రాయలసీమకు తాగునీరు లేదు.. ఆల్మట్టి నుంచి నీటిని విడుదల చేయండి’ అంటూ కర్ణాటక సర్కారుకు లేఖలు రాసి విజ్ఞప్తులు చేసిన చంద్రబాబు.. అదే జూరాల ప్రాజెక్టు ముంపు అంశాన్ని పరిష్కరించేందుకు మాత్రం చొరవ చూపలేదు. జూరాలతో ముంపునకు గురైన కర్ణాటక రాష్ట్రంలోని బాధితులకు రూ.40 కోట్లను చెల్లించలేదు.
వెరసి 11.84 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ప్రాజెక్టును ఏనాడూ 8 టీంఎసీలకు నింపుకోలేని దుస్థితి కల్పించారు. జూరాల కాలువల పనులనూ పూర్తి చేయలేదు. బాబు కుట్రలు అక్కడితో ఆగాయా? అంటే అదీ లేదు. కల్వకుర్తి ప్రాజెక్టు సర్వే కోసం 1997లో రూ.50 లక్షలు మంజూరు చేశారు. ఆ తర్వాత రెండేండ్లకు 1999లో పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. అప్పుడయినా సజావుగా సాగిందా? అంటే అదీ లేదు. తెలంగాణ ఉద్యమానికి జడిసి 2003లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. అది కూడా పేరుమార్చి.. ప్రాజెక్టును కుదించారు. కేవలం 25 టీఎంసీల నీటిని 22 జలాశయాల్లోకి ఎత్తిపోసి 50 వేల ఎకరాలకు మాత్రమే నీరందించేలా డిజైన్ చేసి.. 2003లో పనులకు శిలాఫలకం వేశారు. భీమాను కారణం లేకుండా తొక్కిపెట్టారు. కనీసం చిన్న చెరువుల కట్టలైనా బాగుచేయండి అని రైతాంగం, ఇక్కడి ప్రజాప్రతినిధులు మొరపెట్టుకున్నా ఆలకించలేదు. అక్కడితో ఆగకుండా చిన్న చిన్న లిఫ్ట్‌ల కరెంటు భారాన్ని కూడా రైతులపై మోపి ఆ ప్రాజెక్టులను పండబెట్టారు. నీళ్ల కోసం గొంతెత్తిన పాలమూరు బిడ్డలకు నక్సలైట్లతో సంబంధాలు అంటగట్టి జైలుపాలు చేసి, అణచివేత సాగించారు.
పాలమూరుకు వైఎస్ ధోకా
2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలమూరు జిల్లాకు చంద్రబాబును మించి ధోకా ఇచ్చారు. జలయజ్ఞంలో భాగంగా మొత్తంగా తెలంగాణకు సంబంధించి 21 ప్రాజెక్టులు ఉండగా, అందులో కృష్ణా బేసిన్‌కు సంబంధించినవి 5 ఉన్నాయి. కానీ వాటి కోసం నిధులను మాత్రం కేటాయించలేదు. ఆ ప్రాజెక్టులను కూడా సెకండ్ ప్రియారిటీ జాబితాలో చేర్చి కుట్రలకు పాల్పడ్డారు. ఏపీ ప్రాజెక్టులను మొదటి ప్రియారిటీగా తీసుకొని నిధుల వరద పారించారు. ప్రాజెక్టులను పరుగులు పెట్టించారు. కృష్ణాబేసిన్ నుంచి సుదూరంలో ఉన్న ప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు అప్పటికే అనేక అక్రమాలతో ఏర్పాటైన పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ సామర్థ్యాన్ని ఏకంగా రెండింతలు చేశారు. తెలంగాణ ప్రాజెక్టులకు నీటి లభ్యత 90 రోజులు ఉంటుందని నిర్ధారించి ఆ లెక్కన కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులను డిజైన్ చేసిన వైఎస్.. అదే ఆంధ్ర ప్రాజెక్టులకు వచ్చేసరికి నీటి లభ్యత 30 రోజులే ఉంటుందని నిర్ధారించారు. ఆ లెక్కలను చూపి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ విస్తరణను కుట్రపూరితంగా చేపట్టారు.
ఎస్ఆర్బీసీకి 19, తెలుగు గంగకు 44, హెచ్ఎల్ఎస్సీకి 10, తాగునీటి అవసరాలకు 3 టీఎంసీలను, ఇక హెడ్‌రెగ్యులేటరీ వద్ద ‘గాలేరునగరి సుజల స్రవంతి’ పేరిట కొత్తగా మరో కాలువను ఏర్పాటు చేసి దానికి 38 టీఎంసీలను కేటాయించారు. అందులో భాగంగానే 2006లో తొలుత జీవో 170, ఆ తర్వాత జీవో 195 జారీ చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ కెపాసిటీని మొత్తంగా 44వేల క్యూసెక్కులకు పెంచుతున్నట్టు నిర్ణయించారు. మళ్లీ అందులోనూ మరో అక్రమానికి తెగబడ్డారు. భవిష్యత్తులోనూ తిరిగి హెడ్‌రెగ్యులేటరీ కెపాసిటీని 88 వేల క్యూసెక్కులకు పెంచుకొనేందుకు అనువుగా కెనాల్ బెడ్ లెవల్ 32 మీటర్ల నుంచి ఏకంగా 78 మీటర్లకు పెంచడంతోపాటు లైనింగ్ లేని కెనాల్‌ను ప్రతిపాదించి అప్పుడే పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పరోక్షంగా 70 వేలకు పెంచారు. అదీగాక పోతిరెడ్డిపాడు వద్ద అప్పటికే ఉన్న నాలుగు గేట్లను తొలగిస్తామని చెప్పినా ఆ పనీచేయలేదు. అదనంగా 10 గేట్లను నిర్మించి తన కుట్రలను పక్కాగా అమలుచేసి, పాలమూరుకు ధోకా చేశారు.
తెలంగాణవాదులు పాలమూరు
రంగారెడ్డి పథకం ప్లాన్ రూపొందించి 2005లోనే వైఎస్‌కు అందజేస్తే అది బయట పడకుండా పూర్తిగా తొక్కిపెట్టి ప్రాజెక్టు ఉసురు తీశారు. 2009 ఎన్నికల ముందు సర్వేల గురించి జీవో ఇస్తామని చెప్పి అనేక సాకులతో అటకెక్కించారు. ఇప్పటికే చాలా ఎత్తిపోతల పథకాలు వచ్చాయి కనుక వాటి పనితీరు చూసిన తర్వాతే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని ఆదేశాలిచ్చి తీరని ద్రోహం తలపెట్టారు.
‘పాలమూరు’ వెన్నంటే కేసీఆర్
తెలంగాణ ఉద్యమనేతగా కేసీఆర్ పాలమూరు వెన్నంటే ఉన్నారు. కృష్ణా జలాల్లో నీటి కోసం పాలమూరు బిడ్డల తరఫున ఉద్యమించారు. జలసాధన ఉద్యమం చేపట్టి ఊరూరా ప్రజలను చైతన్యవంతులను చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఫైలును వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తొక్కిన సందర్భంలో.. ఆ ప్రాజెక్టును ముందుకు కదిలిచేందుకు అలుపెరగని పోరాటం చేశారు. ఉమ్మడి పాలకులను నిలదీశారు. కేసీఆర్ పోరాటం, విస్తృతమవుతున్న ఉద్యమం నేపథ్యంలో గతిలేని పరిస్థితుల్లో.. తుంగభద్రపై ఏపీలో గండ్రేవుల జలాశయం నిర్మాణం కోసం, పాలమూరు ప్రజలను ఏమార్చేందుకు 2013లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నాటి కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. అక్కడితో ఊరుకుందా? అంటే అదీ లేదు.. ఏ ప్రాజెక్టుకు లేనివిధంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన జీవోను కూడా సీజీజీ (సెంటర్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్)తో వెట్టింగ్ చేయించాలని కండిషన్ పెట్టింది. టెండర్ల ప్రక్రియ పూర్తికాకుండా అడ్డుకొన్నది.
ఈ కుట్రలన్నింటినీ ఉద్యమనేతగా కేసీఆర్ అడుగడుగునా నిలదీశారు. పాలమూరు ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే తప్ప ‘పాలమూరు’కు మోక్షం తప్పదని వివరించారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఇచ్చిన హామీ మేరకు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితోపాటు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టును పూర్తిగా రీడిజైన్ చేశారు. 10 లక్షల నుంచి 12.30 లక్షల ఆయకట్టును పెంచారు. అంతేకాదు ఉమ్మడి పాలకులు వరద జలాల ఆధారంగా ప్రాజెక్టును ప్రతిపాదిస్తే.. సీఎం కేసీఆర్ దీనిని నికర జలాల ఆధారంగా ప్రతిపాదించడమేకాదు.. అనేక సవాళ్లు, అంతర్రాష్ట్ర వివాదాలు, ఎన్జీటీ కేసులను అధిగమించి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సైతం సాధించారు. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టు పనులు పూర్తి చేయించి పాలమూరు బిడ్డల 70 ఏండ్ల కలను సాకారం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులతో ఇప్పటికే పాలమూరులో ఆయకట్టు పెంచిన సీఎం కేసీఆర్.. ‘పాలమూరు-రంగారెడ్డి’ని పూర్తిచేసి నడిగడ్డ సాగునీటిగోసకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ముందుకు కదులుతున్నారు.
కొన్ని ప్రాజెక్టులకు నాలుగైదు సార్లు శిలాఫలకాలు వేసి పనులను ప్రారంభించని ఘనచరిత్ర చంద్రబాబుది. సీఎం కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే ‘బాబు వేసిన శిలాఫలకాలతోనే ప్రాజెక్టు కట్టొచ్చు’. పాలమూరు జిల్లాల్లో రైతు ఆత్మహత్యలను కుటుంబ కలహాలు, అనారోగ్యానికి ముడిపెట్టమని అధికారయంత్రాగానికి ఆదేశాలిచ్చిన కుట్రజీవి చంద్రబాబు.
ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబు 9 ఏండ్ల పాలన పాలమూరుకు తీరని శాపం. రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ సర్కారు, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టిన సందర్భంలోనూ బాబు తన కుట్రలను మానుకోలేదు. ప్రాజెక్టుకు అనుమతులివ్వకూడదంటూ సీడబ్ల్యూసీకి (కేంద్ర జల సంఘం) స్వయంగా లేఖ రాశారు. స్థానిక రైతులను, అనుయాయులను ప్రోత్సహించి ఎన్జీటీలో కేసులు వేయించి ప్రాజెక్టును అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు.