CM KCR | దేశంలో ఆదివాసీలు, దళితులు, బహుజనులు ఇప్పటికీ పీడితులుగానే ఉన్నారు. ఉత్తర భారతంలో వీరు కనీస జీవన వసతులు లేకుండా వివక్షకు గురవుతున్నారు. ఈ దుస్థితి ఇంకెన్నాళ్లు? ఈ దేశం మార్పు కోరుకొంటున్నది. ఆ దిశగా బుద్ధిజీవులు ఆలోచన చేయాలె. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేధావివర్గం కలిసిరావాలె. దిల్వాలే, దిమాక్‌వాలే ఏకంకావాలె.
– బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్
హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో దశ, దిశ లేని పాలన దేశ భవిష్యత్తుకు గొడ్డలిపెట్టులా మారుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో కేంద్రంలోని పాలన ఇంకా లక్ష్యాన్ని విస్మరించి నిర్లక్ష్యంగానే కొనసాగుతున్నదని విమర్శించారు. పార్టీలను కాకుండా ప్రజలు తమ ఆకాంక్షలను గెలిపించుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, దేశాన్ని బాగు చేసేందుకు ఏర్పడిన ఒక మిషన్ అని స్పష్టంచేశారు. తాతల తండ్రుల పేర్లు చెప్పుకొని రాజకీయాలు చేయటం ఇక చెల్లదని తేల్చి చెప్పారు. ఇప్పుడు దేశ ప్రజలకు ‘ పేర్లతో పనిలేదు.. పని చేయగలిగిన వాళ్లతోనే పని’ (నామ్‌దారీ నహీ.. కామ్దారీ హోనా చాహియే) అని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన పలువురు కీలక నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
మధ్యప్రదేశ్ బీఆర్ఎస్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుద్ధసేన్ పటేల్ ఆధ్వర్యంలో చాంద్వాడా జిల్లా, జున్నార్‌దేవ్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రామ్‌దాస్ యికే, సర్వజన్ కళ్యాణ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సంజయ్ యాదవ్, గోండ్వానా పార్టీ అధ్యక్షుడు శోభారామ్ బాలావీ, భువన్‌సింగ్ కోరం, లక్ష్మణ్ మసోలేతోపాటు దాదాపు 200 మంది సీనియర్ నేతలు, మేధావులు బీఆర్ఎస్లో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సకల వసతులున్న దేశంలో రైతన్నలు ఇంకా ఆత్మహత్యలు చేసుకోవటం శోచనీయమని అన్నారు.
Cm
కామ్ బదల్నా చాహియే
దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలంటే ముందుగా ప్రజల్లో చైతన్యం రావాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ దేశంలో ప్రకృతి ప్రసాదించిన నీరు, వ్యవసాయ యోగ్యమైన భూమి, విద్యుత్తుకు అవసరమైన బొగ్గు నిల్వలు, పంటలకు అవసరమైన సమతల శీతోష్ణస్థితి వంటి వనరులన్నీ ఉన్నా.. రైతులు ఆత్మహత్యలు చేసుకోవటానికి కేంద్ర పాలకుల లక్ష్యశుద్ధి లోపమే కారణమని విమర్శించారు. దళితులు బహుజనులు సహా అన్ని వర్గాలు ఇంకా అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ దుస్థితి పోవాలంటే కేంద్రంలో పార్టీలను మార్చడం కాకుండా తమ ఆకాంక్షలను గెలిపించుకొనే దిశగా ప్రజలు చైతన్యం కావాలని పిలుపునిచ్చారు. ‘ఒక పార్టీని ఓడించి ఇంకో పార్టీని గెలిపిస్తే పార్టీల పేర్లు, నాయకుల పేర్లే మారతాయి.. ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. పని విధానంలో మార్పు తీసుకొచ్చే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలదే (నామ్ బదల్నే సే కుచ్ నహీ హోతా.. కామ్ బదల్నా చాహియే)’ అని స్పష్టంచేశారు.
బీఆర్ఎస్ పార్టీ కాదు.. దేశాన్ని మార్చే మిషన్
బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే రెండేండ్లల్లోనే దేశంలోని రైతాంగానికి మొత్తం 24 గంటల విద్యుత్తును అందజేస్తామని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ కేవలం రాజకీయ పార్టీ కాదని, భారత దేశాన్ని మార్చడానికి ఏర్పాటు చేసిన మిషన్ అని స్పష్టం చేశారు. మన ఓటును పని చేయనివాళ్లకు కాకుండా మన కోసం పనిచేసేవాళ్లకు వేసుకొంటేనే మన ఆకాంక్షలు నెరవేరుతాయని తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న దళితబంధు, రైతుబంధు, రైతుబీమా, రైతులకు ఉచిత విద్యుత్తు, ఆసరా పెన్షన్ల వంటి పథకాలు మధ్యప్రదేశ్‌లో ఎందుకు అమలు కావని ప్రశ్నించారు. ఇదే ప్రశ్నను కేంద్రాన్ని కూడా అడగాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
పీడితులుగా ఉండే దుస్థితి ఇంకెన్నాళ్లు?
దేశంలో ఆదివాసీలు, దళితులు, బహుజనులు ఇప్పటికీ పీడితులుగానే ఉన్నారని.. ఈ దుస్థితి ఇంకెన్నాళ్లని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఉత్తరభారతంలో వీరు కనీస జీవన వసతులు లేకుండా వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దేశం మార్పు కోరుకొంటున్నదని, ఆ దిశగా బుద్ధిజీవులు ఆలోచన చేయాలని సూచించారు. మేధావి వర్గం ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా కలిసిరావాలని కోరారు. ‘దిల్ వాలే, దిమాఖ్ వాలే’ ఐక్యం కావాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు. తప్పుడు వాగ్దానాలతో విద్వేషాలు రెచ్చగొడుతూ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా కొనసాగుతున్న దుర్మార్గాలను నిలవరించడంలో ఎన్నికల సంఘం కూడా విఫలమైందని దుయ్యబట్టారు.
భోపాల్‌లో సొంత కార్యాలయం
ఎంపీ రాజధాని భోపాల్‌లో త్వరలోనే బీఆర్ఎస్ సొంత కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వాహనాలను ఏర్పా టు చేసుకొని పార్టీ భావజాలాన్ని వ్యాప్తి చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో రైతు, దళిత, మహిళ, యువ, బీసీ తదితర 9 కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు శంకరన్న దోంగ్డే, మాణిక్ కదమ్, హిమాన్షు తివారీ, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, దాసోజు శ్రవణ్, మెట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.