హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): దివ్యాంగుల పింఛన్‌ను రూ.3016 నుంచి 4016కు, సంక్షేమ హాస్టల్ విద్యార్థుల డైట్ చార్జీలను 26% మేరకు పెంచడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దివ్యాంగులు, హాస్టల్ విద్యార్థులు ఆదివారం అన్ని జిల్లాల్లో సంబురాలు చేసుకున్నారు. వేడుకల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. మహబూబాబాద్‌లోని ఎంపీ కార్యాలయంలో దివ్యాంగులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎంపీ, జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులతో కలిసి సీఎం ఫ్లెక్సీకి ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. సూర్యాపేట పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద కేసీఆర్ ఫ్లెక్సీకి.. కోదాడ పట్టణంలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఫ్లెక్సీకి దివ్యాంగులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు పాలతో అభిషేకించారు.
నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులతో కలిసి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య క్షీరాభిషేకం చేసి, అనంతరం దివ్యాంగులతో కలిసి అల్పాహారం చేశారు. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ఎస్సీ ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ బాలికల వసతి గృహంలో బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్‌తో కలిసి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మానవీయతకు ప్రతిరూపమని కొనియాడారు. పింఛన్, డైట్ చార్జీల పెంచినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు డైట్ ఛార్జీల పెంపు హర్షనీయమని తెలంగాణా సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ బాలరాజు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి చిరునామా నిలుస్తున్నదని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం బడుగులకు అన్నివేళలా బాసటగా నిలుస్తున్నదని ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ చెప్పారు. కేసీఆర్‌కు సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు, దివ్యాంగులు, బీసీ సమాజం తరపున పలువురు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
టీఎస్వీసీ చైర్మన్ వాసుదేవరెడ్డి
దేశంలో ఎకడా లేని విధంగా దివ్యాంగులకు అత్యధిక పెన్షన్ ఇస్తున్నది సీఎం కేసీఆర్ ప్రభుత్వమని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే. వాసుదేవరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెరుగుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా దివ్యాంగులకు అందిస్తున్న రూ.3,016కు అదనంగా మరో వెయ్యి పెంచి రూ.4,016 ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవటమే కాకుండా అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేయడంతో దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపారని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ దివ్యాంగుల సంఘాల నాయకులు మున్నా, గుత్తికొండ కిరణ్, నల్గొండ శ్రీనివాస్, సుమన్, రాజ్యలక్ష్మి, కోమురెల్లి, వేణు,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.