మెదక్ : జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. దివ్యాంగులకు పెంచిన రూ.4016 పింఛన్ సొమ్ము పంపిణీ, బీడీ టేకేదారులు, ప్యాకర్లకు రూ.2,016 చొప్పున ఆసరా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం సీఎం కేసీఆర్ మెదక్ IDOC వేదికగా ప్రారంభించి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అంతకు ముందు మెదక్ జిల్లాలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాన్ని (కలెక్టరేట్‌ను) ప్రారంభించారు.
సీఎం కలెక్టరేట్ ప్రాంగణంలోకి చేరుకోగానే పోలీసులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కార్యాలయం బయట ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. అలాగే జిల్లా పోలీస్ ఆఫీస్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. నూతన కలెక్టరేట్‌ను, ఎస్పీ కార్యాలయాన్ని నిర్మించుకున్నందుకు మెదక్ జిల్లా ప్రజలకు ఆయన అభినందనలు తెలియజేశారు. మెదక్ కలెక్టరేట్ ఆర్కిటిక్చర్ ఉషారెడ్డి మన తెలంగాణ బిడ్డేనని సీఎం కేసీఆర్ ఆమెను అభినందించారు.