జమ్మికుంట, అక్టోబర్ 4: దళితబంధు పథకం దళితుల దశ మార్చేస్తున్నది. నిన్నామొన్నటి దాకా వ్యవసాయ కూలీలుగా, చిన్నాచితక పనులు చేసుకొంటూ కుటుంబాలను పోషించుకున్న వారికి ఆర్థిక భరోసా ఇస్తున్నది. ఆగస్టు 16న సీఎం కేసీఆర్ హుజూరాబాద్ శాలపల్లిలో దళితబంధు పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. అదే రోజు తొలి దళితబంధు లబ్ధిదారుల్లో జమ్మికుంటకు చెందిన సంధ్య-గంగయ్య ఎంపికయ్యారు. అనంతరం జరిగిన సర్వేలో సూపర్‌మార్కెట్ పెట్టనున్నట్టు సంధ్య అధికారులకు తెలుపగా, వారు ఓకే చేశారు. సూపర్ మార్కెట్‌కు సరిపడా వస్తువులు అందించేందుకు హిందూస్తాన్ లివర్ లిమిటెడ్ ముందుకొచ్చింది. సోమవారం సీఎం కేసీఆర్ చిత్ర పటానికి మొక్కి, సూపర్ మార్కెట్‌ను ప్రారంభించుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కలలో కూడా ఊహించని స్థానంలో ఆ కుటుంబం కూర్చున్నది.
ఆత్మగౌరవంతో బతికేలా
దళిత బంధు పథకం బాజాల సంధ్య కుటుంబాన్ని ఆత్మ గౌరవంతో బతికేలా నిలబెట్టింది. సంధ్య వ్యవసాయ కూలీ కాగా గంగయ్య కాటన్ మిల్లులో కార్మికుడు. వీరికి ఇద్దరు కొడుకులు. కూలీనాలీ చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఉప్పు, పప్పో.. సబ్బో, షాంపో కొనాలన్నా.. ఏ రోజుకారోజు దుకాణానికి వెళ్లి కొనుక్కునే పరిస్థితి వీరిది. అలాంటి జీవితాల్లో సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళితబంధు పథకం వెలుగులు తెచ్చింది. అవసరం మేరకే ఒక్కొక్క సామాను కొని తెచ్చుకునే ఆ కుటుంబం.. ప్రస్తుతం సూపర్ మార్కెట్‌కే యజమాని అయ్యింది.
జమ్మికుంటలోని వీణవంక రోడ్డులో డిగ్రీ కళాశాల ఎదురుగా షాపు కిరాయికి తీసుకున్నారు. వారం రోజుల కింద నిత్యావసర సరుకులను హిందుస్తాన్ లివర్ కంపెనీ పంపించింది. సోమవారం సంధ్య సూపర్ మార్కెట్‌ను జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ సమ్మిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంధ్య-గంగయ్య దంపతులను సన్మానించారు.
కలలగూడ అనుకోలే..
అడగంది అమ్మయినా అన్నం పెట్టదు. అట్లాంటిది సీఎం కేసీఆర్ మా దళితులను గుర్తించిండ్రు. ఎవలూ పట్టించుకోని మమ్మల్ని దళితబంధుతో ఆదుకున్నరు. మాకు అందరికంటే ముందే దళితబంధు వచ్చింది. నేను సూపర్ మార్కెట్ పెట్టాలనుకున్నా. సర్వేల సార్లుగూడ సరేనన్నరు. రూము కిరాయికి తీసుకుని.. ఇయ్యాల షాపు ఓపినింగ్ జేసుకున్నం. కలలగూడ అనుకోలే. ఇట్లాంటి షాపుకు ఓనరును అయితనని. కూలీ జేసుకుని బతికే మాలాంటోళ్లకు మంచి రోజులు వచ్చినయ్. అది ఒక్క కేసీఆర్తోటే సాధ్యమైంది. ఇంతజేసిన సీఎం కేసీఆర్ బరాబర్ దేవుడే. దళిత కుటుంబాలన్నీ ఆయనకు రుణపడి ఉంటయ్. – బాజాల సంధ్య, సూపర్ మార్కెట్ యజమాని, జమ్మికుంట