నేను దుబ్బాకలో చదువుతున్నప్పుడు పక్కనే పద్మశాలీల కుటుంబం ఉండేది. వాళ్లు చేనేత పనితోపాటు బీడీలు చుట్టేవాళ్లు. అయినా పొట్టకూటికి సరిపోయేది కాదు. వాళ్ల పరిస్థితి తెలుసుకాబట్టే మానవీయ దృక్పథంతో రాష్ట్రంలో ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి పెన్షన్ ఇస్తున్నాం. 16 రాష్ర్టాల్లో బీడీ కార్మికులు ఉన్నరు. కానీ ఇక్కడ తప్ప ఎక్కడా పెన్షన్ ఇవ్వడం లేదు. కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకపోతే ఆ పథకానికి అర్థమే లేదు. 2014 తర్వాత కొత్తగా చేరిన కార్మికులు లక్ష మంది దాకా ఉంటరు. వారందరికీ పెన్షన్ మంజూరు చేస్తాం.
తెలంగాణ తెచ్చిన నేను ఒకవైపు.. వచ్చిన తెలంగాణను విచ్ఛినం చేసేందుకు వస్తున్న రేవంత్ ఒకవైపు.. ఎవరిని ఏం చేయాలో మీకు తెలుసు.. వచ్చిన తెలంగాణను కూడా బతకనియ్యొద్దని, పచ్చగా ఉంటే ముందల పడనియ్యొద్దని, రాష్ట్రంలో రాజకీయ అస్థిరత తేవాలని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నం చేసిండ్రు. అప్పుడు ఎవడైతే ఎమ్మెల్యేలను కొనడానికి వచ్చి రూ.50 లక్షలతో పట్టుబడ్డడో.. ఇప్పుడు ఆ మహాత్ముడే కామారెడ్డిలో నాపై పోటీకి వస్తడట. మీరే ఆలోచించండి.. ఎవరికి ఏం బుద్ధి చెప్పాల్నో మీరే నిర్ణయించండి.
– ముఖ్యమంత్రి కేసీఆర్
CM KCR | హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అంటూ చావునోట్లో తలపెట్టి రాష్ర్టాన్ని సాధించిన తనపై.. తెలంగాణను విచ్ఛిన్నం చేసేందు కు ఎమ్మెల్యేలను కొనడానికి వచ్చి రూ.50 లక్షలతో పడ్డుబడ్డ వ్యక్తి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాడని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మరోవైపు మోటర్లకు మీటర్లు పెట్టనందుకు తెలంగాణపై పగబట్టిన బీజేపీ కూడా బరిలో ఉన్నదని చెప్పారు. ఎవరికి ఏం బుద్ధి చెప్పాలో ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. గురువారం కామారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణతి రాలేదని తెలిపారు. ఎన్నికల్లో ఓటు వేసే సమయంలో అభ్య ర్థి గుణగణాలు, మంచిచెడ్డలు చూడాలని, అంతకుమించి పార్టీల వైఖరిని పరిశీలించాలని సూచించారు. ‘నవంబర్ 30 నాడు ఓట్లు పడుతయి. 3 నాడు లెక్కిస్తరు. అంతటితో మన పని అయిపోతుంది అనుకోవద్దు. అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. ఆ వ్యక్తి గెలిస్తే ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది? వాళ్ల నడవడిక ఏంది? వాళ్లు అధికారం ఇస్తే ఏం చేశారు? వాళ్ల చరిత్ర ఏంది? అని చర్చించాలి. అప్పుడే ప్రజ లు గెలుస్తారు’ పేర్కొన్నారు. ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పి, అభాండాలు వేసి, పనికిమాలిన వాగ్దానాలిచ్చి, చెయ్యలేమని తెలిసి కూడా ఆశలు పెట్టి, చివరికి గెలిచిన తర్వాత మాటమార్చి గోల్మాల్ చేసే పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమని, ప్రజల హక్కులు కాపాడటం కోసమని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లు ఈ దేశాన్ని, రా ష్ర్టాన్ని పాలించి ఏం చేసిందో గుర్తు తెచ్చుకోవాలని ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు. ‘1956 దాకా మనది మనకే ఉన్న తెలంగాణను ఊడగొట్టినోడు ఎవడు? ఆంధ్రాతో కలపవద్దని నెత్తినోరు మొత్తుకుంటున్నా వినకుండా, సిటీ కాలే జీ దగ్గర ఉద్యమం చేస్తుంటే ఏడుగురు విద్యార్థులను కర్కషంగా కాల్చి చంపి, తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపింది ఎవడు? గుర్తుకు తెచ్చుకోవాలి. ఆ ఒక్క దెబ్బతో తెలంగాణ ప్రజలు 58 ఏండ్లు గొడగొడ ఏడ్చారు. మళ్లీ తెలంగాణ వచ్చిననాడు మంచినీళ్లు లేవు, సాగునీళ్లు లేవు, వలసలు, చేనేతల ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు.. ఇట్లా అన్నీ సమస్యలే. ఇవన్నీ మన నెత్తిన పెట్టిన పార్టీ కాంగ్రెస్ కాదా?’ అని ప్రశ్నించారు. దళితులు తరతరాల నుంచి అణచివేతకు గురయ్యారని, వాళ్లు మనుషులు కాదా? వాళ్ల ఓట్లు కావాలి తప్ప వాళ్లు బాగుపడొద్దా? అని నిలదీశారు. 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ తెలంగాణకు ఏ ఒక్కటైనా సరిగా చేసిందా? ప్రాజెక్టులు కట్టారా? నీళ్లు ఇచ్చారా? కరెంటు ఇచ్చారా? ఉద్యోగాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. అందుకే నిజాయితీతో ఆలోచించి, స్థిరంగా నిర్ణయం తీసుకొని ఓటేయాలని సూచించారు.
తెలంగాణ దశాబ్దాల అవస్థకు కాంగ్రెస్ పార్టీ నే కారణమని సీఎం కేసీఆర్ విమర్శించారు. ‘తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లనే నన్ను అర్వ తిప్పలు పెట్టినరు. చివరికి నాకు తిక్కరేగి కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని బయలుదెరిన. అప్పుడు ఊర్లన్నీ ఉద్యమాలై సకల జనుల సమ్మె జరిపినరు. ఇగ తట్టుకోలేక దిగొ చ్చి తెలంగాణ ప్రకటన చేసినరు. అప్పటికైనా ఇచ్చినరా! వెంటనే ఇవ్వలే? మళ్లో ఏడాదిన్నర దాకా ఎగబెట్టినరు. మళ్లీ యావన్మంది ఉద్యోగు లు, రైతులు, ప్రజలు రోడ్డు మీదకు వచ్చి కొట్లాడితే.. చివరికి నూకలు మిగలకుండా అయితమని భయపడి తెలంగాణ ఇచ్చినరు. అదీ కాం గ్రెస్ పరిస్థితి. వచ్చిన తెలంగాణను కూడా బతకనియ్యొద్దని, రాజకీయ అస్థిరత తేవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసినరు. అప్పుడు ఎవడైతే ఎమ్మెల్యేలను కొనడానికి వచ్చి రూ.50 లక్షలతో పట్టుబడ్డడో.. ఇప్పుడు ఆ మహాత్ముడే కామారెడ్డిలో నాపై పోటీకి వస్తడట. మరి.. ఎవరికి ఏం బుద్ధి చెప్పాల్నో మీరే నిర్ణయించండి’ అని కేసీఆర్ కోరారు.
ధరణితో దళారీ వ్యవస్థకు చెక్ పడిందని, ఆఫీసుల చుట్టూ తిరిగే గోస తీరిందని, లం చాలు ఇచ్చే పీడ వదిలిందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, అందుకే.. కాంగ్రెస్ పార్టీనే బంగాళాఖాతంలో వెయ్యాలని సూచించారు. రైతు చచ్చిపోతే బీమా డబ్బులు, ధాన్యం పైసలు కూడా నేరుగా అకౌంట్లో పడుతున్నాయని తెలిపారు. ఇప్పుడు ధరణిని తీసేస్తే.. రైతుబంధు ఎట్లొస్తది? రైతుబీమా ఎట్లొస్తది? ధాన్యం పైసలు ఎట్లొస్తయి? అని కేసీఆర్ ప్రశ్నించారు.
రైతుల బాయిలకాడ మోటర్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని మోదీ ఒత్తిడి తెచ్చినా ‘నేను సచ్చినా పెట్ట’ అని స్పష్టంగా చెప్పానని సీఎం కేసీఆర్ తెలిపారు. దీంతో ఏటా రూ.5 వేల కోట్ల చొప్పున రాష్ర్టానికి రావాల్సిన రూ.25 వేల కోట్లను ఆపేశారని చెప్పారు. ‘బీజేపోడు ఏ మొఖం పెట్టుకొని కామారెడ్డిలో ఓట్లు అడుగుతడు? బీజేపీ నాయకులు ఓట్ల కోసం వస్తే నిలదీసి అడగండి. వాళ్లకు సరైన పద్ధతిలో బుద్ధి చెప్పాలె’ అని ప్రజలను కోరారు. ‘దేశంలో ప్రతి జిల్లాకు ఒక నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాలని చట్టం ఉన్నది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఒక్కొక్కటి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి నేను అనేకసార్లు లేఖలు రాశాను. బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో డిమాండ్ చేశారు. అయినా ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటైనా ఎందుకు వేయాలె?’ అని నిలదీశారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన బీజేపీ ప్రభుత్వం, తెలంగాణపై పగబట్టి ఒక్కటి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
దశాబ్దాలుగా రైతున్నలు అరిగోస పడ్డరని, తెలంగాణ వచ్చినంక ఇప్పుడే కాస్త ముఖాలు తెల్లబడ్డాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు మళ్లీ.. రైతుబంధు వద్దు, కరెంట్ 24 గంటలు వద్దు, ధరణిని తీసేస్తామని అంటున్న కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆగమైతమని హెచ్చరించారు. గతంలో కరెంటోళ్లు పొలాల దగ్గరికి వచ్చి నానా యాగీ చేసేటోళ్లని, ఇవాళ ఆ పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడైనా ఉన్నదా? అని ఆలోచించాలని కోరారు. గతంలో ట్రాన్స్ఫార్మర్లు పటాకులు పేలినట్టు పేలేవని, కానీ.. ఇవాళ ట్రాన్స్ఫార్మర్ కాలుతున్నదా? మోటార్లు కాలుతున్నయా? అని ప్రశ్నించారు. రైతుల దగ్గర ధాన్యం కొంటే ప్రభుత్వానికి ఏటా రూ.500 నుంచి రూ.1000 కోట్ల నష్టం వస్తదని, అయినా మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటున్నదని చెప్పారు. రైతాంగాన్ని నిలబెట్టుకోవాలని, వ్యవసాయాన్ని స్థిరికీరించాలనే తపనతో బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. పదేండ్లుగా రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్నదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి కులం, మతం, జాతి అనే బేధాలు లేవని స్పష్టంచేశారు. ‘పదేండ్ల నుంచి వానలు మంచిగ పడుతున్నాయి. కరువు లేదు. సంక్షేమ పథకాలు అద్భుతంగా కొనసాగుతున్నాయి. దేశంలో ఎక్కడా లేనంత పింఛన్ ఇస్తున్నాం. గొర్రెలు, చేపపిల్లల పంపిణీ.. ఇలా అన్ని వృత్తులవారిని మంచిగ చూసుకుంటున్నాం. మిషన్ కాకతీయతో చెరువులు కళకళలాడుతున్నాయి. ఏటా రూ.33 వేలకోట్ల చేపలను తెలంగాణ ఎగుమతి చేస్తున్నది. కంటివెలుగు అనే పేరు ఎప్పుడైనా విన్నరా? చరిత్రలో ఏ ప్రభుత్వమన్నా చేసిందా?’ అని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ వెళ్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మొదట విద్యుత్తు సమస్యపై దృష్టిపెట్టి ఆరు నెలల్లోనే పరిష్కరించామని తెలిపారు. ఇప్పుడు దేశంలో అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. ఒకనాడు గోసపడ్డ చోటే ఇప్పుడు 24 గంటల కరెంటు వెలుగు జిలుగులు ఉంటున్నాయని పేర్కొన్నారు. ‘ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో, సొంత నియోజకవర్గంలో కూడా వ్యవసాయానికి 24 గంటల కరెంటు లేదు. మరి మన దగ్గర ఎట్లా ఇస్తున్నం? తెలంగాణ వ్యవసాయం బోర్ల మీద ఆధారపడ్డది కాబట్టి, ఆరునూరైనా సరే 24 గంటలు ఇవ్వాలని నిర్ణయించినం. పట్టుబట్టి సాధించినం. కానీ 24 గంటల కరెంటు వద్దని, 3 గంటలు ఇస్తే సరిపోతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రైతుబంధు దుబారా అని మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారు. రైతుబంధు, 24 గంటల కరెంటు ఉండాలంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ మరోసారి రావాలి. అప్పుడు రైతుబంధు రూ.10 వేల నుంచి రూ.16 వేలకు పెరుగుతుంది. నిజమైన రైతు రాజ్యం అవుతుంది’ అని సీఎం పేర్కొన్నారు.
రాష్ట్రంలో లక్షమంది బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘నేను దుబ్బాకలో చదువుతున్నప్పుడు పక్కనే పద్మశాలీల కుటుంబం ఉండేది. వాళ్లు చేనేత పనితోపాటు బీడీలు చుట్టేవాళ్లు. అయినా వారి పొట్టకూటికి సరిపోయేది కాదు. వాళ్ల పరిస్థితి తెలుసుకాబట్టే బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నాం. 16 రాష్ర్టాల్లో బీడీ కార్మికులున్నారు. తెలంగాణలో తప్ప ఎక్కడా పెన్షన్ ఇవ్వడం లేదు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి కూడా పెన్షన్ రూ.5 వేలకు పెరుగుతుంది. పెన్షన్‌కు 2014 కటాఫ్ పెట్టడం వల్ల ఆ తర్వాత ఈ పరిశ్రమలో చేరిన వారికి పెన్షన్ రావడం లేదని మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, కేటీఆర్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నా దృష్టికి తెచ్చారు. దీంతో మానవీయ కోణంలో ఆలోచించి ప్రతి బీడీ కార్మికురాలికి పెన్షన్ ఇస్తున్నాం. 2014 తర్వాత కొత్తగా చేరిన కార్మికులు లక్ష మంది దాకా ఉంటారు. ప్రభుత్వం ఏర్పడగానే వారందరికీ పెన్షన్ మంజూరు చేస్తాం’ అని ప్రకటించారు.
ప్రసంగంలో భాగంగా ముస్లింలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ హిందీలో ప్రసంగించారు. ‘కామారెడ్డిలోని ముస్లింలందరికీ సలాం చేస్తున్నా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కొట్లాడుతున్న సమయంలో అనేకసార్లు కామారెడ్డిలో సభలు నిర్వహించాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మనం చేస్తున్న పోరాటంలో నిజాయితీ ఉన్నది, ధర్మం ఉన్నది కాబట్టి ఈ పోరాటంలో తప్పక విజయం సాధిస్తాం అని ఆశీర్వదించారు’ అని గుర్తు చేసుకున్నారు. ‘అల్లా కే ఘర్ మే ధేర్ హో సక్తా, లేకిన్.. అంధేర్ నహీ’ అని పేర్కొన్నారు. ‘తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో మైనార్టీల అభివృద్ధి కోసం రూ.900 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, తాము ఈ పదేండ్లలోనే రూ.12 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. తాను బతికున్నంత వరకు తెలంగాణ సెక్యులర్‌గా ఉంటుందని స్పష్టంచేశారు. మైనార్టీలంతా బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని, కారు గుర్తుకే ఓటేయాలని కోరారు.