CM KCR | తెలంగాణ కాంగ్రెస్ వైఖరిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లా హుజూర్నగర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కండ్ల ముందు జరిగిన చరిత్రను నాయకులు వక్రీకరిస్తారు. అబద్ధాలు చెబుతారు. మొన్న కోదాడకు వచ్చిన సమయంలో చెప్పాను. నాగార్జున సాగర్ పేరు నాగార్జున సాగరే కాదు.. కట్టవాల్సిన జాగలో కట్టలేదు. మొదట ప్రతిపాదించింది ఇప్పుడున్న నాగార్జున సాగర్ 20కిలోమీటర్లపైన ఏలేశ్వరం ఊరిలో కట్టాలి. టక్కుటమారం చేసి దాన్ని కిందికి తెచ్చి మారిస్తే.. ఆ నాడు నోరుమూసుకొని కూర్చున్నది ఎవడ్రా అంటే ఇదే తెలంగాణ కాంగ్రెస్ నేతలు’ అంటూ మండిపడ్డారు.
‘తెలంగాణ కాంగ్రెస్ చరిత్ర చెబుతాను మీకు. 1956లో తెలంగాణను ఆంధ్రాలో కలపాలని ప్రతిపాదన తెచ్చారు. విద్యార్థులు, ఉద్యోగులు వ్యతిరేకించారు. ఆ నాడు పోలీస్ ఫైరింగ్ జరిగింది. సిటీ కాలేజీ దగ్గర హైదరాబాద్‌లో ఆంధ్రాలో కలుపొద్దని ఇడ్లీ సాంబర్ గో బ్యాక్ ఉద్యమం జరిగితే ఒక్కటే రోజు ఫైరింగ్‌లో ఏడుగురు విద్యార్థులు చనిపోయారు. కానీ నోరు మూసుకున్నది ఎవరు తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం. ఢిల్లీకి పోయి ఉన్న తెలంగాణను ఊడగొట్టిన పాపాత్ములే ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. ఆ తర్వాత ఎన్నో ఘోరాలు జరిగాయి. మాట్లాడేందుకు మస్త్ మాట్లాడారు. ఎలాంటి ఘోరాలు జరిగాయో చెబుతాను. నాగార్జున సాగర్ కట్టాల్సిన చోట కడితే చాలాదూరం మూసీనది దాటేదాక నల్లగొండ జిల్లాకు నీరు వచ్చేంది. కానీ, రాకుండా దూరం చేశారు. మనకు రావాల్సిన నీళ్లు వేరేదిక్కు వెళ్లాయి. నిన్నగాక మొన్న జరిగిన చరిత్రను కూడా అబద్ధాలు చెప్పే పరిస్థితి ఉంటది. నిజం మాట్లాడితే కొందరికి అర్థం కాదు. మనసునపట్టదు’ అన్నారు.
‘ఈ హుజూర్‌నగర్‌లో టేయిలెండ్ మండలాల గతి ఏముండే ? నాన్ ఆయకట్టు రైతుల గతి ఏముండే ? ఆలోచన చేయాలి. తెలంగాణ వచ్చాక భగవంతుడి దయతో వర్షాలు మంచిగపడుతున్నయ్. పంచిపాదమంటే వర్షాలు పడుతాయని పెద్దలు అంటరు. అలాగే పడుతున్నయ్. ఈ తొమ్మిదేళ్లలో 18సార్లు నాగార్జునసాగర్ నుంచి నీళ్లు వదిలాం. రెండోపంట కూడా పండించుకుంటున్నాం. అంతకు ముందు పాలకీడు, మఠంపల్లి, మేళ్లచెరువు మండలాల్లో టేయిలెండ్కు నీళ్లు రాక, కరెంటు మోటర్లు పెట్టి.. ఆ కరెంటు సక్కగరాక కాలువల మీద రైతులు పండుకున్నది నిజం కాదా? టేయిటెండ్కు రాలే.. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్నడూ కొట్లాడలేదు. ఇట్లా ఎన్నో ఉన్నయ్. మా కరెంటు ఎందుకివ్వరు అని అడగలే. కొట్లాడలేదు. వారికి పదవులు, మంత్రి పదవి అస్తే చాలు. అదే లోకం, అదే స్వర్గం, కైలాసం. ప్రజలు ఎటైనా పోని. తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో మీరంతా కళ్లారా చూశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేగులు తెగేదాక కొట్లాడారు. ఆంధ్రా ముఖ్యమంత్రిని నిలదీశారు. చాలా సందర్భాల్లో అసెంబ్లీలో గందరగోళం సృష్టించారు’ అని గుర్తు చేశారు.