హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక పవిత్రమైన యజ్ఞంలా పరిపాలన చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తామే తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, ప్రజలపై ప్రేమతో రాష్ర్టాన్ని ఇవ్వలేదని, పార్టీని బలోపేతం చేసుకొనేందుకు అనివార్య పరిస్థితుల్లో మాత్రమే ఇచ్చిందని తెలిపారు. అసెంబ్లీలో తెలంగాణ తొమ్మిదేండ్ల ప్రగతిపై జరిగిన చర్చకు సీఎం కేసీఆర్ ఆదివారం సమాధానమిచ్చారు. తన సుదీర్ఘ ప్రసంగంలో తెలంగాణ ఏర్పాటు కోసం సాగించిన పోరాటం నుంచి రాష్ట్రం ఏర్పడిన తరువాత సాధించిన ప్రగతి వరకు వివిధ ఘట్టాలని వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే…
కాంగ్రెస్ చేయని కుట్రలు లేవు..
కరీంనగర్ ఎంపీగా ఉన్న నన్ను ఓడగొట్టేందుకు నాడు చేయని ప్రయత్నం లేదు. వందలకోట్లు ఖర్చుపెట్టి, భయంకరమైన కథలు చేశారు. కానీ కరీంనగర్ జిల్లా ప్రజలు వీళ్ల చెంప చెళ్లుమనిపించి నన్ను రెండున్నర లక్షల మెజార్టీతో గెలిపించారు. మా తెలంగాణ మాకు కావాలని చెప్పారు. తెలంగాణ అంశాన్ని అలవోకగా తీసిపారేస్తే ఎన్నడూ ఎవరూ మాట్లాడలేదు. పౌరుషం లేదు.. ఇదే సభలో నేను ఒంటరిగా ఉద్యోగుల సమస్యలపై మాట్లాడుతుంటే మళ్లీ గోల్మాల్ చేసే ప్రయత్నం చేశారు. అంతటా విద్యార్థులు, ప్రజలు అడుగుతున్నరని, కేసీఆర్ సభలకు జనం వస్తున్నరని చంద్రబాబు గిర్గ్లానీ కమిటీ ఏర్పాటుచేశారు.
కమిటీల మీద కమిటీలు వేస్తూ మళ్లీ గిర్గ్లానీ కమిటీ ఎందుకు? మనమిద్దరం సెక్రటేరియట్ గేటుకాడ నిలబడదాం.. ఒక ఆనపకాయ చేతిలో పట్టుకుందాం, పోయేవాళ్లను అడుగుదాం..ఆనపకాయ అన్నోడు తెలంగాణోడు, సొరకాయ అన్నోడు ఆంధ్రోడు. దీనికి పెద్ద కమిటీ ఎందుకని ఇదే సభలో నేను చెప్పాను. ప్రతి సందర్భంలో తెలంగాణ అమాయక ప్రజలను వంచించి గోల్మాల్ చేయడంవల్ల సుమారు ఆరు దశాబ్ధాలు తెలంగాణ సర్వస్వం కోల్పోయింది. ఎంత భయంకరమైన పరిస్థితులు.. ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలు, కరెంటు కోతలు.. ఇలా అనేక బాధలు. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన 20-30 ఎకరాల భూములున్న రైతులు కూడా హైదరాబాద్‌లో ఆటోలు నడిపిన దుస్థితి. ఇంత దయనీయమైన పరిస్థితికి మనందరం సాక్షులమే. మధ్యలో రోశయ్య 14ఎఫ్ తీసుకొచ్చిండు.
ఓ వైపు ఉద్యమాలు జరుగుతుంటే 14 ఎఫ్ తీసుకొచ్చిండు. అప్పుడు సిద్దిపేటలో ఉద్యోగుల గర్జన పెట్టి, లక్షలమందిని సమీకరించి ఆ సభనుంచే.. కేసీఆర్ శవయాత్రనో, తెలంగాణ జైత్రయాత్రనో ఏదో ఒకటి జరగాలని ప్రకటించా. అప్పుడే నిరాహారదీక్షకు కూ ర్చుంటే నానా రకాల యాగి చేసి, నన్ను అరెస్టు చేసి ఖమ్మం జైల్లో పడేసి, అక్కడినుంచి ఇక్కడ నిమ్స్‌కు తెచ్చి చివరికి వీడు చస్తడా ఏంది.. మనం అప్రదిష్టపాలవుతామని, లోక్‌సభ అంతా అట్టుడికింది. తెలంగాణకు అనుకూలంగా లేకపోయినా పార్లమెంటులో ములాయంసింగ్ యాదవ్ ‘తెలంగాణ బనే నా బనే రావుసాబ్ నహీ మర్నా చాహియే అని మాట్లాడితే, 38 పార్టీలు గోలచేస్తే, ఆ దాడి తట్టుకోలేక చిదంబరంను పంపి స్టేట్మెంట్ ఇచ్చారు. వెంటనే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలుపెడుతున్నం అని చెప్పడం, మళ్లీ ఆంధ్రా లాబీ ఒత్తిడి చేయంగనే వెన క్కు తీసుకున్నారు. ప్రకటన చేసింది కాంగ్రెసే, దాన్ని వెనక్కు తీసుకున్నది కాంగ్రెసే. దీంతో మళ్ల వందలమంది విద్యార్థులు చనిపోయారు. ఇషాన్‌రెడ్డి, చేవెళ్ల యాదయ్య, శ్రీకాంతాచారి వంటి అనేకమంది ప్రాణాలు తీసుకొన్నారు. యువకులు చనిపోతున్నా వీళ్లు పట్టించుకోలేదు. కనీసం రిలీఫ్ ఇచ్చే ప్రయత్నం కానీ, సాంత్వన కల్పించే వచనాలు కానీ చెప్పలే.
గాడాంధకారం నుంచి కోటి వెలుగుల వైపు..
తెలంగాణ వచ్చిననాడు ఎటుచూసినా గాడాంధకారం. అన్ని రంగాలు విధ్వంసమై ఉన్నాయి. విద్యుత్తు సంక్షోభం, వ్యవసాయ సంక్షోభం. అగమ్యగోచరంగా ఆర్థిక పరిస్థితి. సుడిగుండంలో చిక్కుకొని ఉన్నాం. ఒక పవిత్రమైన యజ్ఞంలాగా ఈ పరిపాలనను స్వీకరించి, రాష్ర్టాన్ని ఎలాగైన గాడిలో పెట్టుకోవాలని, నవ్వెటోడి ముందు జారిపడొద్దని జీఆర్రెడ్డిలాంటి ఆర్థిక శాస్త్రవేత్తకి మన మాతృభూమి మనకు దక్కిందని నేను ఫోన్‌చేసి రమ్మంటే ఆయన వచ్చారు. అనేక మంది ఆర్థిక శాస్త్రవేత్తలతో, ఇరిగేషన్ రంగ నిపుణులతో, ఇతర రంగాల నిపుణులతో మాట్లాడి ఏ విధంగా చేయాలని ఆలోచించి ఒక అద్భుతమైన పంథాలో ప్రయాణం మొదలుపెట్టాం. ఈ రకంగా అద్భుత ప్రగతిని సాధించాం. రాష్ట్ర స్థూల ఉత్పత్తికి ప్రధానమైన సూచిక జీఎస్డీపీ కూడా కాదు.. తలసరి ఆదాయం. జీఎస్డీపీ కూడా పెరిగింది. అప్పుడు జీఎస్డీపీ రూ.5 లక్షల కోట్లు ఉంటే, ఇప్పుడు రూ.13 లక్షల కోట్లు దాటినం. ఆరోజు తలసరి ఆదాయం రూ.90-95 వేలు ఉంటే, ఇవాళ రూ.3.12 లక్షలు ఉన్నది. ఇది మేము చెప్తున్నది కాదు, ఈ నెల ఒకటిన భారత ప్రభుత్వ గణాంకాల శాఖ ప్రకటించింది. కరోనా, నోట్ల రద్దు జరగకపోతే ఇంకా ఎంతో అద్భుతమైన ప్రగతితో ముందుకుపోయేవాళ్లం.
అతితక్కువ అప్పులు చేసిన తెలంగాణ
శాసనసభ ద్వారా నియోజకవర్గాల అభివృద్ధికి ఇచ్చే నిధులు (ఏసీడీపీ) ఆనాడు కాంగ్రెస్ హయాం లో ఎంత? నేడు ఏసీడీపీ ఎంత? ఆనాడు ఇచ్చింది రూ.50 లక్షలు దాటలేదు. ఇవాళ తెలంగాణ ధనిక రాష్ట్రం అయింది కాబట్టి రూ.5 కోట్లు ఇస్తున్నం. దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఏసీడీపీ ద్వారా సభ్యులకు రూ.ఐదు కోట్లు ఇచ్చే పరిస్థితిలేదు. ఎంపీలకు మాత్రమే ఆ అధికారం ఉంటది. ఇది కూడా అభివృద్ధికి ఒక సూచిక. ఇవన్నీ చేసేవాళ్లపై విష ప్రచారం మొదలుపెట్టారు. చెప్పిందే పదేపదే చెబితే అబద్ధం కూడా నిజమైతదనే సామెత ఉన్నది. కేసీఆర్ అప్పులు చేసిండు అంటున్నరు. అప్పుల్లో మన ది 23వ స్థానం. మనకంటే మించి అప్పులు చేసిన రాష్ర్టాలు 22 ఉన్నాయి. పరిమితికి లోబడి మనం క్రమశిక్షణతో ఉన్నాం. కేంద్రం 3,4 రోజుల క్రితమే పార్లమెంటుకు సమర్పించిన గణాంకాల్లో ఇది ఉన్న ది. అతితక్కువ అప్పులు చేసిన రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటని, చాలా పురోగతి సాధించిందని కేంద్రమే చెప్పింది. అతి తక్కువ అప్పులతోనే చక్కగా ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాం. ఇవన్నీ రిజర్వు బ్యాంకు, ఆర్థిక శాఖ నివేదికల్లో ఉన్నాయి. లోక్‌సభ సాక్షిగా కేంద్రం కూడా ఇదే చెప్పింది.
నాడు పారిపోయినోళ్లు నేడు పేలుతున్నారు
ఎక్కడ ఏమీ చేయనివాళ్లు, తెలంగాణ ఉద్యమంపై తుపాకులు పట్టుకొని పోయినోళ్లు మాట్లాడుతున్నారు. నేటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రైఫిల్ తీసుకొని కరీంనగర్‌కు పోయిండు. అందరూ రాజీనా మా చేస్తుంటే బీజేపీ అధ్యక్షుడేమో అమెరికాకు పారిపోయిండు. ఉన్న ఒక్క వ్యక్తి యెండల లక్ష్మినారాయణ మమ్మల్ని నమ్మి రాజీనామా చేసిండు. నాకు ఆరోగ్యం బాగలేకున్నా నేను స్వయంగ పోయి ఆనా టి పెద్ద నాయకుడు డీ శ్రీనివాస్‌ను ఓడగొట్టి మళ్లీ లక్ష్మీనారాయణను గెలిపించినం. దళితబంధు అం దరికీ, త్వరగా ఇవ్వాలని అంటున్నరు. మీరు జన్మ లో ఆలోచించారా దళితబంధు ఇవ్వాలని? మీ కాం గ్రెస్ గనక స్వాతంత్య్రం వచ్చిన తెల్లారే దళితుల అభివృద్ధి గురించి పనిచేసి ఉంటే దళితబంధు ఎం దుకు ఇవ్వాల్సివచ్చేది? నేడు మనం దేశానికి దిక్సూచిగా ఉన్నాం. నేను మహారాష్ట్రకు పోయి మాట్లాడుతుంటే వాళ్లు తెలంగాణ మాడల్ మాకూ కావాలని అంటున్నరు. దేశమంతా ‘వీ వాంట్ తెలంగాణ మాడల్’ అంటుంటే ఇక్కడున్నవాళ్లు కనీసం హర్షించకపోగా ఉల్టా తూలనాడుతున్నారు.

Cmkcr
కాంగ్రెస్ రాష్ర్టాన్ని ప్రేమతో ఇయ్యలే
రాజశేఖర్‌రెడ్డి గతించడం, జగన్మోహన్రెడ్డిని రాంగ్ హ్యాండిల్ చేయడం, జైలుకు పంపి వేధించడంతో ఆయన సొంత పార్టీ స్థాపించుకున్నారు. పులివెందుల ఉప ఎన్నిక వస్తే నాలుగైదు లక్షల బ్రహ్మాండమైన మెజార్టీతో ఆయన గెలవడం, అనంతరం వచ్చిన ఒకటి రెండు ఎన్నికలను కూడా ఆయన స్వీప్ చేయడంతో ఇక ఆంధ్రాలో మన పని అయిపోయిందని కాంగ్రెస్ ఆలోచనకు వచ్చింది. 2014 ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు ఎదురుగాలి వీచింది. ఆంధ్రాలో పోయింది.. కనీసం తెలంగాణలోనన్న పది సీట్లన్న రాకపోతయా అని ఒత్తిడిలో తెలంగాణ ఇచ్చారు తప్ప ప్రేమతో ఇయ్యలే. ఏ ఒక్కనాడు వీరికి తెలంగాణ మీద ప్రేమ ఉన్నా తెలంగాణకు ఇంత దౌర్భాగ్య పరిస్థితి వచ్చేది కాదు. ఎప్పుడో నదుల్లోకి నీళ్లొచ్చి, బ్రహ్మాండమైన పంటలు పండి, సకల అష్ట ఐశ్వర్యాలతో తులతూగేది
తెలంగాణ. ఇది చరిత్ర. ఇది నిజం. ఎవరెన్ని చెప్పినా ఇది చరిత్రలో ఉండే సత్యం.
నిరంతర విద్యుత్తు సాధించినం
తలసరి విద్యుత్తు వినియోగంలో దేశంలో తెలంగాణ నంబర్ వన్. జాతీయ సగటు మన సమీపంలో కూడా లేదు. అతి తక్కువ సమయంలో ఇంత విద్యుత్తు ఎక్కడిది? కాంగ్రెస్ హయాంలో విద్యుత్తు ఇస్తమన్నది తొమ్మిది గంటలు, ఇచ్చింది పొద్దాక మూడు గంటలు, రాత్రి నాలుగు గంటలు. ఆడికిపోయి షాకులు కొట్టి సావ, పాములు కరిసి సావ.. ఇట్లా వందలమంది రైతులు చనిపోయారు. ఇవాళ 24 గంటల విద్యుత్తు ఇస్తుంటే దానిమీద కూడా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఎంత క్రమశిక్షణతో, ఎంత పటుత్వంతో పనిచేస్తే ఇది సాధ్యమైంది! ఇండియా మొత్తంలో దేన్నైనా పరిశీలించడానికి కొన్ని సూచికలు ఉంటాయి. అన్నం ఉడికిందా లేదా చూసేందుకు మొత్తం కుండని పిసకం.. ఒక గింజని పిసికితె అర్థమైతది. ఏ రాష్ట్రం సంగతి ఏందో ఇండికేటర్స్ చూస్తే అర్థమైతది. ఇండియా మొత్తంలో ఏ ఒక్క రాష్ట్రంలో 24 గంటల విద్యుత్తు సరఫరా లేదు. కాంగ్రెస్ రాజ్యంలో పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, వందలకొద్ది కాలిపోయే మోటర్లు. ఊరోళ్లంత తలా రెండు వేలు, తలా మూడువేలు ఏసుకొని ట్రాక్టర్ మీద ట్రాన్స్ఫార్మర్లు తీసుకొని వెళ్లేవారు. ఎలక్ట్రిసిటీ ఆఫీసులకాడ ధర్నాలు. ఆనాడు భయంకరమైన పరిస్థితులు, వీళ్లు ఇవాళ మాకు పాఠాలు చెప్తామంటున్నారు అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
కేసీఆర్ పంచ్