CM KCR | ప్రజాసంక్షేమాన్ని తప్పుపడుతూ, ప్రభుత్వాధినేతపై అమానవీయ వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ దుర్నీతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. గతం నుంచి వర్తమానం వరకు కాంగ్రెస్ నేతలు ఈ ప్రాంతంపట్ల కర్కశంగా ఎట్లా వ్యవహరించారో ఆదివారంనాడు అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ కండ్లకుకట్టారు. వందలమంది విద్యార్థుల ప్రాణాలను బలిగొన్నా ఇవ్వని తెలంగాణ రాష్ర్టాన్ని.. కేవలం పార్టీని బతికించుకోవాలన్న అనివార్యతతోనే ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ధరణి, దళితబంధు.. ఒక్కొక్క పథకం ప్రజల జీవితాల్లో మార్పు తెస్తుంటే, వాటినీ రద్దుచేస్తామనడంపైనా ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. కురచ బుద్ధితో, కుత్సిత స్వభావంతో కాంగ్రెస్ నేతలు తనపై చేస్తున్న వ్యాఖ్యల మీదా కేసీఆర్ తీవ్రంగా ప్రతిస్పందించారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి పిండం పెట్టాలో ప్రజలు నిర్ణయిస్తారని ఘాటుగా సమాధానమిచ్చారు. దేశం ఆశ్చర్యపోయేలా ఉద్యోగులకు పేస్కేల్ ఇస్తామని, సింగరేణి కార్మికులకు రూ.1000 కోట్లు బోనస్‌గా ఇస్తామని సభలో ప్రకటించిన కేసీఆర్.. తమది ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని మరోసారి చాటుకున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణను ముంచిందే కాంగ్రెస్ పార్టీ అని, 41 ఏండ్లపాటు ఆ పార్టీ తెలంగాణ ప్రజల మనసులను తీవ్రంగా గాయపరిచిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఆ పార్టీ నాయకులు చేసిన అవమానాలు, అవహేళనలు జీవితంలో మర్చిపోలేమని అన్నారు. తెలంగాణ అనే పదంపైనే నిషేధం విధించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని మండిపడ్డారు. తెలంగాణకు, తె లంగాణ ప్రజలకు అడుగడుగునా అన్యాయం చే స్తూ.. వేల మంది పిల్లలను పొట్టనపెట్టుకున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం శాసనసభలో రాష్ట్ర ప్రగతిపై జరిగిన చర్చకు సీఎం సుదీర్ఘంగా స మాధానమిచ్చారు. తెలంగాణను సీమాంధ్రలో కలిపి ద్రోహం చేసిన ఘటన నుంచి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు తెలంగాణను దోచుకొన్న తీరును ఆవేదనతో వివరించారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణకు చేసిన ద్రోహాన్ని ప్రజల ముందు పెట్టారు. సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
పిల్లల చావుకు మీరే బాధ్యలు
ఉన్న తెలంగాణను ఊడగొట్టింది ఎవరు? ఆ రో జుల్లోనూ తెలంగాణ విద్యార్థులు, మేధావులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, నాటి నాయకులు కొండా వెంకటరంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు అభ్యంతరం చెప్పినా తెలంగాణను పోగొట్టిందే జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్సే మన కొంప ముంచింది. తెలంగాణను ముంచిందే కాంగ్రెస్. తెలంగాణను ఓడగొట్టిందే కాంగ్రెస్. ఇందులో డౌటే లేదు. ఇది చరిత్ర. ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్లేటప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో రామకృష్ణారావు మాట్లాడుతూ.. సచ్చినాసరే తెలంగాణ విలీనాన్ని ఒప్పుకునేదే లేదు అని చెప్పా రు. అక్కడ తెలంగాణను బలిపెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత అదే ఎయిర్‌పోర్ట్‌లో విలేకరులతో మాట్లాడుతూ… నెహ్రూ సార్ చెప్పారయ్యా.. ఆ పెద్దమనిషి చెప్పినంక ఇంకేం మాట్లాడుతాం. ఒప్పుకొని వచ్చినం అన్నారు. ఆ విధంగా ఉన్న తెలంగాణను ఊడగొట్టింది.. ఆ తర్వాత అనేక అగ్రిమెంట్స్ చేసి, ఇచ్చిన హామీలు ఒక్కొక్కటీ కాలరాస్తే, ప్రేక్షక పాత్ర వహించిందే కాంగ్రెస్. చివరికి 1969 ఉద్యమంలోనూ కాంగ్రెస్ పార్టీ ఎంతటి కర్కషంగా వ్యవహరించిందో అందరికీ తెలుసు. 1956లో ఓడగొట్టినప్పుడు అనేక మందిని జైళ్లలో పెట్టారు.
సిటీ కాలేజీ వద్ద కాల్పులు జరిపితే పట్టపగలు ఏడుగురు విద్యార్థులు చనిపోయారు. దీన్ని కూడా ఖాతరు చేయకుండా తెలంగాణను కలిపేశారు. ఆ తర్వాత 1969 ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. టీఎన్జీవో నాయకుడు ఆమోస్‌పై ఎస్మాతోపాటు అనేక కేసులు పెట్టి జైళ్లలో బంధించినా అనేక పోరాటాలు చేశారు. 1969లో చెన్నారెడ్డి, విద్యార్థుల నాయకత్వంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. 14 ఎంపీ సీట్లకుగాను 11 మంది ఎంపీలను గెలిపించి యావత్ తెలంగాణ గుండెలు చీల్చి మా తెలంగాణ మాకు కావాలంటే, నాటి ప్రధాని ఇందిరాగాంధీ ‘నో తెలంగాణ’ అం టూ నిరాకరించారు. తెలంగాణ ఎంత యాతను అనుభవించిందో, ఎంత బాధను అనుభవించిందో, ఎన్ని వేలమంది విద్యార్థులను, యువకులను కోల్పోయిందో, 1969లో అన్ని కాలేజీలు, హాస్టళ్లు జైైళ్లెపోయాయో.. ఇలా 41 ఏండ్లపాటు పరిపాలించిన కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ ప్రజల మనుసును తీవ్రంగా గాయపరిచింది.
మంత్రి పదవి ఇయ్యంగనే ఉద్యమం బంద్.
ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులే తాపకొకరు బయల్దేరాలే.. జై తెలంగాణ అనగానే పిలిచి మంత్రి పదవి ఇవ్వగానే బంద్ చెయ్యాలే. ఇలా తెలంగాణ ఉద్యమం అంటేనే ఎవరూ నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. వీళ్లెక్కడ ఉద్యమం చేస్తారనే పేరొచ్చింది. అనేక దఫాలుగా తెలంగాణ ఉద్యమాలు చేసి విరమించుకున్నది కూడా ఈ కాంగ్రెస్ నాయకులే.
ఆ విధంగా తెలంగాణ ప్రస్థానం మొదలు
నిరసన తెలిపితే కాల్చేస్తున్నారని, ఇక ఈ సమైక్య రాష్ట్రంలో న్యాయం జరగదని భావించి.. నేను, కొం తమంది మిత్రులం కలిసి ఐదారు నెలలు చర్చించి, మేధోమథనం చేసి ఉద్యమపంథాను నిర్ణయించుకొ ని 2001 ఏప్రిల్ 27న దివంగత కొండా లక్ష్మణ్ బా పూజీ ఆశ్రయం ఇస్తే ఆయన ఇంట్లోనే జెండా ఎగరేసి ‘జై తెలంగాణ’ ప్రస్థానం ప్రారంభించినం. చా లా నిరాశ నిస్ఫృహలు ఉండేవి.. ‘ఇంకెక్కడి తెలంగాణ.. ఎక్కడికి వస్తది.. ఎవరిస్తరు. జరిగే పనేనా’ అనే నిరాశలోనే చాలా మంది మాట్లాడేవారు. నమ్మకం కలిగించేందుకు, ప్రజల్ని నిరాశ నుంచి బయటపడేసేందుకు నేనే ఓ పాట రాశాను.
‘సిపాయిల తిరుగుబాటు
విఫలమైయిందని అనుకుంటే
దేశానికి స్వాతంత్య్రం వచ్చేదా
రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది
ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది’
అంటూ పాట రాశాను.
అదే పద్ధతిలో ఎక్కడా వెనక్కి పోకుండా రాజీలేని పోరాటం చేశాం. అనేక ప్రలోభాలు పెట్టారు, పార్టీని చీల్చే ప్రయత్నాలు చేశారు. అనేక రకాల హింసకు గురిచేశారు. అయినప్పటికీ ఎక్కడా మేము వెనుదిరగకుండా పోరాటం చేశాం కాబట్టి.. తెలంగాణ రాష్ర్టాన్ని ఇవ్వాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. విధిలేని పరిస్థితుల్లోనే వాళ్లు తెలంగాణ ఇచ్చారు.

Cmkcr
కాంగ్రెస్ అవమానాలు జీవితంలో మర్చిపోలేం
తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పరిచిన కొన్ని గాయాలు, బాధలు మర్చిపోలేం. తెలంగాణ అంటే నూకలు చెల్లుతాయనే ఉద్దేశంతో ‘తెలంగాణ ఇస్తం. మాతో పొత్తు కలుస్తారా’ అని అడిగితే కలిశాం. ఎందుకంటే మన ఉద్యమం ఢిల్లీకి పోవాలే… ఇక్కడే గల్లీలో ఉండొద్దు. ఢిల్లీకి పోవాలంటే ఇదొక మంచి మార్గమని ఒకే అన్నాం. ఆ తర్వాత ఢిల్లీలో కామన్ మినిమమ్ ప్రొగ్రాంలో తెలంగాణ అంశాన్ని చేర్పించినం. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగంలోనూ చేర్పించినం. ఆ తర్వాత మళ్లీ కుక్క తోక వంకర అన్నట్టుగా పాత కథే మొదలైంది. కాంగ్రెస్ వాళ్లు ఎన్ని రకాలుగా రాసి రంపాన పెట్టారంటే.. నాటి సీఎంలు మాట్లాడిన మాటలు, చేసిన అవహేళనలు మా జీవితంలో మర్చిపోం. నం ద్యాల సభలో రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ..‘తెలంగాణకు పోవాలంటే మనం వీసాలు తీసుకోవాలే. కాబట్టి తెలంగాణ ఇచ్చే ప్రసక్తే లేదు’ అని చెప్పారు. అప్పుడు ఇక్కడి కాంగ్రెస్ నాయకులు మౌనంగా ఉన్నారు. ఇక నాడు కేంద్ర మంత్రిగా ఉన్న రేణుకాచౌదరి చేసిన అవమానం అంతా ఇంత కాదు. ‘తెలంగాణ ఇచ్చేందుకు ఇదేమైనా ఇన్స్టంట్ కాఫీనా, దోశనా, అంత ఈజీనా’ అంటూ అవమానించారు. సమైక్యరాష్ర్టానికి చివరి సీఎం అయిన కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన అవమానాలు అన్నీఇన్నీ కావు. ‘తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అంటే ఒక్క కాంగ్రెస్ నాయకుడైనా, ఎమ్మెల్యే అయినా లేచి.. అలా ఎలా అం టారని ప్రశ్నించలేదు.
అందర్నీ తలదన్నేలా ఎదిగినం
తెలంగాణ రాష్ట్ర సాధన 58 ఏండ్ల సుదీర్ఘ పోరా టం. ఒక రోజుతోనో, ఒక నాయకుడితోనో వచ్చింది కాదు. ఈ సుదీర్ఘ పోరాటానికి అసలు ఆద్యులెవరు? ఉన్న తెలంగాణను ఊడగొట్టిందెవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ, మాజీ ప్రధాని నెహ్రూ. దీన్ని ఎవరూ కాదనలేరు. గతంలో ఉన్న తెలంగాణ ఉన్నదున్నట్టు ఉంటే ఇప్పుడు ఎక్కడుందుము! ఏ దిశలో ఉం దుము! కేవలం తొమ్మిదేండ్లలోనే ఇంత ఎత్తుకు ఎ దిగినం. ఎవరు ఏం మాట్లాడినా ప్రపంచవ్యాప్తంగా ఒక రాష్ట్రంలోగానీ, దేశంలోగానీ ఎదుగుదల ఉన్న దా? తరుగుదల ఉన్నదా? అనే అంశాన్ని లెక్కించేందుకు కొన్ని గీటురాళ్లుంటాయి. ఇప్పుడు దేశంలోని పెద్ద రాష్ర్టాల్లో మనం నంబర్ వన్‌గా ఉన్నాం. తెలంగాణ తలసరి ఆదాయం ప్రస్తుతం రూ.3.12 లక్షలు ఉంటే… ఏ రాష్ట్రం నుంచైతే మనం విడిపోయామో, ఎవరైతే మనల్ని ఎకసెక్కాలాడారో, మీకు పరిపాలన చేతగాదని అన్నారో.. వాళ్ల తలసరి ఆదాయం 2.19 లక్షలు మాత్రమే. అంటే దాదాపు లక్ష రూపాయాల తేడా ఉన్నది. దీన్ని మించి చాలా బలపడి.. ఫైనాన్సియల్ ఆఫ్ ఇండియగా పేరుగాంచిన మహారాష్ట్ర, గుజరాత్ మాడల్ అంటూ దేశాన్ని గోల్మాల్ చేసి ప్రధాన మంత్రి పదవి సంపాదించిన గుజరాత్ రాష్ట్రం కావచ్చు, 70 ఏండ్లుగా ఉన్న తమిళనాడు కావొచ్చు, కర్ణాటక, హర్యానా రాష్ట్రం కావచ్చు.. వీళ్లందర్నీ తలదన్ని, వీళ్లకన్నా ఎక్కువ తలసరి ఆదాయంగల రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తలసరి ఆదాయం పెరగడమనేది అన్ని రకాల అభివృద్ధికి నిదర్శనం. అన్ని రంగాలు సమ్మిళితంగా అభివృద్ధి జరిగితేనే ఇది సాధ్యమవుతుంది. అలాంటి అభివృద్ధి తెలంగాణలో జరిగిందనడానికి సూచికనే తలసరి ఆదాయం పెరగడమే’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
మీకెందుకు తెలంగాణ అన్నరు
బీజేపీది ఇంకో కథ.. బడే మియాతో బడే మియా.. చోటే మియా సుబానల్లా అనేలా ఉన్నది. ‘ఒక్క ఓటు.. రెండు రాష్ర్టాలు’ అంటూ కాకినాడలో తీర్మానం చేసింది. ఆ తర్వాత చంద్రబాబు ఎన్డీయే కన్వీనర్ అయిండు, వాజపేయి ప్రధాని అయిండు.. ఉప ప్రధానిగా ఉన్న ఎల్కే అద్వానీ వచ్చి ‘హైదరాబాదే తెలంగాణలో ఉన్నది. ఇంకా తెలంగాణ ఎందుకండి’ అని మాట్లాడిపోయారు. అదే ఎన్డీయే ప్రభుత్వం మూడు కొత్త రాష్ర్టాలను ఏర్పాటు చేసింది. కానీ, అదే పార్టీ తెలంగాణ కోసం చేసిన కాకినాడ తీర్మానాన్ని మాత్రం కాకెత్తుకుపోయింది. తెలంగాణను ఏర్పా టు చేయలేదు. చేయకపోగా మీకెందుకు తెలంగాణ అంటూ కించపరిచింది.
తెలంగాణ పదంపైనే నిషేధం
తెలుగుదేశం పార్టీ 17 ఏండ్ల పరిపాలనలో తెలంగాణలో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. ప్రణయ్ భాస్కర్ అనే ఎమ్మెల్యే అ సెంబ్లీలో ‘తెలంగాణ అని అనగానే..‘నో నో తెలంగాణ అనే పదం వాడకూడదు’ అని ఆ రో జు స్పీకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తి రూలింగ్ ఇచ్చే స్థాయికి తెలంగాణ దిగజారిపోయింది. ఆ రోజు కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు మౌన మునిలా కూర్చుండిపోయారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో సంస్కరణల ము సుగుతో విద్యుత్తు చార్జీలు పెంచితే అప్పటికప్పుడు నేను నిరసనగా లేఖ రాశాను. ఆ తర్వా త కమ్యునిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు నిరసన తెలిపేందుకు హైదరాబాద్‌కు వస్తే ముగ్గురిని దారుణంగా కాల్చి చంపారు.
భట్టిపై వ్యంగ్యాస్త్రం
కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క పాదయాత్రపై సీఎం కేసీఆర్ వ్యంగ్యాస్త్రం సంధించారు. ఆదివారం అసెంబ్లీలో మాట్లాడిన సీఎం.. ‘భట్టి విక్రమార్క తన పాదయాత్రను ఏ విధంగా చేశారనే అంశాన్ని రమ్యంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. మరోసారి కూడా ఆయన పాదయాత్ర చేయాలని కోరుకుంటున్న. ఎక్కడెక్కడ తిరిగారో అన్నీ చెప్పుకున్నారు. ఆయన చెప్పడం కూడా స్వామిజీ ప్రవచనంలా చెప్పారు. వినడానికి కూడా బాగుంది’ అని అన్నారు.
నన్ను ఓడించేందుకు విశ్వ ప్రయత్నం చేసిండ్రు
పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న ఎం సత్యనారాయణ ‘మీదెక్కడిదయ్యా.. మీరు మాతో గెలిచిండ్రు. మీదో బతుకా.. లెక్కనా.. పార్టీనా?’ అంటూ మాట్లాడితే నాకు పౌరుషం వచ్చి కరీంనగర్ ఎంపీగా రాజీనామా చేశాను. ఉప ఎన్నికల్లో నన్ను ఓడించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. వందల కోట్లు ఖర్చు పెట్టి వీళ్లు చేయని పన్నాగం లేదు. కానీ కరీంనగర్ జిల్లా ప్రజలు వాళ్ల చెంపపై కొట్టినట్టు 2.5 లక్షల మెజార్టీతో నన్ను గెలిపించారు. మా తెలంగాణ.. మాకు కావాలే అని తేల్చి చెప్పారు.
ఉన్న తెలంగాణను ఊడగొట్టిందెవరు?
తెలంగాణ ఎవరు తెచ్చిండ్రు అన్నది తర్వాత సంగతి. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది ఎవరు? ఇదే కాంగ్రెస్, వాళ్ల నాయకుడు నెహ్రూ కాదా? ప్రతి సందర్భంలో తెలంగాణ అమాయక ప్రజలను వంచించి గోల్మాల్ చేయడంవల్ల సుమారు ఆరు దశాబ్దాలపాటు తెలంగాణ సర్వస్వం కోల్పోయింది. ఎంత భయంకరమైన పరిస్థితులు! ఆకలి చావులు, ఆత్మహత్యలు. వలసలు, కరెంటు కోతలు, అనేకమైన బాధలు. తామే తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ.. ప్రజలపై ప్రేమతో రాష్ర్టాన్ని ఇవ్వలేదు. 2014లో అన్నిచోట్లా ఎదుగాలి ఎదుర్కొంటున్న పార్టీని బలోపేతం చేసుకునేందుకు అనివార్య పరిస్థితుల్లో మాత్రమే తెలంగాణ ఇచ్చింది.
తెలంగాణను తెచ్చినందుకా అభివృద్ధి చేసినందుకా?
ఇంత సుస్థిరమైన ఆర్థికప్రగతి సాధించి, పర్ క్యాపిటా ఆదాయాన్ని పెంచి, పవర్ పెంచి, ప్రతి ఇంటికి శుద్ధమైన నల్లా నీళ్లు ఇచ్చి, అష్టకష్టాలుపడి తెలంగాణ సాధించుకొచ్చి, గత 25ఏళ్లుగా ఒక యజ్ఞంగా ఇవన్నీ చేసుకుంటూ పోతా ఉంటే.. కేసీఆర్‌కు పిండం పెడతం అని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నరు. ఇవన్నీ చేసినందుకు నాకు పిండం పెట్టాల్నా? ఈ తిప్పలు పడ్డందుకు నాకు పిండం పెట్టాల్నా? మీవల్ల కాని పని, మీ నాయకులు వెన్నుచూపి పారిపోయిన తెలంగాణ ఉద్యమాన్ని నేను భుజాన వేసుకొని, అనేక కష్టాలుపడి, దీక్షలు చేసి చివరికి నా చావుమీదకు తెచ్చుకొని తెలంగాణ తెచ్చిపెడితే నీకు పిండం పెడతం అంటే ఎవరు హర్షిస్తరు? ఇదేనా సంస్కారం? ఇది పద్ధ్దతా? ఇది పార్టీయా? చాలా బాధ కలుగుతది. దేశమంతా ‘వీ వాంట్ తెలంగాణ మోడల్’ అంటుంటే ఇక్కడున్నవాళ్లు కనీసం హర్షించకపోగా ఉల్టా తూలనాడడం, దూషించడం, పిండం పెడతం, గండం పెడతం అని మాట్లాడటం! తెలంగాణ ప్రజలు నా మాటలు వింటున్నరు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి పిండం పెట్టాలనో ప్రజలే నిర్ణయించాలె.
మీరు మాకు ఓటేస్తరా? గొడ్డలి భుజం మీదనే ఉన్నది. జాగ్రత్త. పథకాలు నరికి పారేస్తం..అని కాంగ్రెసోళ్లు వాళ్లకు వాళ్లే చెప్పుకుంటున్నరు. వాళ్లు గెలిచేది లేదు. సచ్చేది లేదు. కానీ వస్తే ఏం చేస్తరో మాత్రం చెప్తున్నరు.
కాంగ్రెసోళ్లు వస్తే కరెంటు గోల్మాల్.. రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జై భీమ్
ఉద్యోగులకు పీఆర్సీ త్వరలో మంచి ఐఆర్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఇస్తామని ఉద్యమ సమయంలోనే చెప్పిన. అట్లనే ఇచ్చి చూపించినం. అన్నమాట నిలబెట్టుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ ఇస్తే… అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కూడా 30 శాతం జీతాలు పెంచినం. ఇంత భారీగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచడం దేశ చరిత్రలోనే తొలిసారి. మా ఉద్యోగులు చెమటోడుస్తున్నరు. వాళ్లు పెంచుతున్న రాష్ట్ర ఆదాయం నుంచే కొంత వాటా వారికిచ్చి కడుపునిండా అన్నం పెట్టుకుంటున్నం. ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడినం. త్వరలోనే ఐఆర్ ఇచ్చేసి, పీఆర్సీని వేస్తం. మళ్లీ దేశం ఆశ్చర్యపడేలా పేస్కేల్ ఇస్తం.
సింగరేణి కార్మికులకు బోనస్‌గా 1000 కోట్లు
సింగరేణి 100 శాతం తెలంగాణ కంపెనీ. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వీళ్లకు పాలన చేతకాక కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చిండ్రు. ఆ అప్పులను తిరిగి చెల్లించలేక 49 శాతం వాటాను కేంద్రానికి కట్టబెట్టిండ్రు. బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని కాపాడింది. కాంగ్రెస్ హయాంలో సింగరేణి టర్నోవర్ కేవలం 12 వేలకోట్లు ఉంటే ఇప్పుడది 33 వేలకోట్లకు పెంచినం. రూ.419 కోట్లు ఉండే సింగరేణి లాభాలను రూ.2,222 కోట్లకు పెంచినం. గతంలో దసరా, దీపావళి బోనస్ రెండూ కలిపి రూ.83 కోట్లు ఇచ్చేవాళ్లు. కార్మికులకు ఈ సారి రూ.1000 కోట్లు బోనస్‌గా ఇవ్వబోతున్నం.
7 వేల మంది మౌజం, ఇమామ్లకూ నెలకు 10 వేలు
మౌజంలు, ఇమామ్‌లకు ఇప్పటికే నెలకు రూ.10వేలు ఇస్తున్నం. అయితే ఇంకా 7వేల దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. వాటన్నింటినీ క్లియర్ చేస్తం. ఆ మేరకు రేపు సాయంత్రంలోగా ఉత్తర్వులు జారీ చేస్తం. ఖబరస్తాన్ కోసం మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో 150 ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 112 ఎకరాల భూమిని గుర్తించినం. అవసరమైనచోటా, అందుబాటులో ఉన్న భూమిని గుర్తించాం. వాటికి సంబంధించి రేపు సాయంత్రం వరకు ఉత్తర్వులు అందజేస్తాం.
అసైన్డ్ భూములపై రైతులకు విక్రయ హక్కులు
గ్రామాల్లో రైతులు అసైన్డ్ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నరు. పట్టణాల్లో మాత్రం వారి చేతుల్లోంచి అసైన్డ్ భూములు వెళ్లిపోతున్నాయి. కాబట్టి అర్బన్ ప్రాంతాల్లో రైతులకు మేలు చేసేందుకు అసైన్డ్ భూములపై రైతులకు విక్రయ హక్కులు కల్పిస్తాం. కనీసం పట్టణ ప్రాంతాల్లోని అసైన్డ్ భూములను వారు అమ్ముకొని కొంత ఆదాయం పొంది వేరే ప్రాంతాల్లో ఎక్కువ భూమి కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించి త్వరలోనే దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం నిర్వహిస్తాం.
వడ్ల ఉత్పత్తిని 4 కోట్ల టన్నులు చేస్తం
ధాన్యం దిగుబడిని 4 కోట్ల టన్నులకు పెంచబోతున్నం. ప్రస్తుతం పండుతున్న ధాన్యానికి రాష్ట్ర మిల్లింగ్ కెపాసిటీ సరిపోతలేదు. మేం గోదాములు కట్టి 30 లక్షల టన్నుల సామర్థ్యం పెంచినా స్టాక్ పెట్టేందుకు అవి సరిపోతలేవు. ఇసుక పండినట్టే పండుతున్నది. ఈ మధ్యనే రాష్ట్ర మంత్రి జపాన్ రైస్మిల్లర్స్ను పిలిచి మాట్లాడిన్రు. 2 కోట్ల టన్నుల ధాన్యం సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మిల్లింగ్ చేయాలని నిర్ణయించినం. ఏ రాష్ట్రం కూడా రైతులు పండించిన మొత్తం పంట కొనటం లేదు. కానీ తెలంగాణలో పండిన ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొంటున్నది. వడ్లు అమ్మిన ఐదారు రోజుల్లో రైతుల బ్యాంక్ ఖాతాలకు డబ్బులు పంపిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
రామకృష్ణారావు పాత్ర మరువలేనిది
కేంద్రం ఎన్ని ఆటంకాలు కల్పించినా, ఎఫ్ఆర్బీఎం కోతలు విధించినా, నిధుల్లో జాప్యం చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా తట్టుకుని తెలంగాణ ఆర్థిక సౌష్టవాన్ని, ఆర్థిక క్రమశిక్షణను నిలబెట్టిన వ్యక్తి రామకృష్ణారావు. ఆయన సేవలను సదా గుర్తుంచుకుంటాం.
-అసెంబ్లీలో సీఎం కేసీఆర్
కేసీఆర్ పంచ్