CM KCR | మళ్లీ ఆఫీసుల చుట్టూ తిప్పుతూ రైతుల రక్తం తాగేందుకేనా? ధరణిని బంగాళాఖాతం వేసేదని ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. తెలంగాణ స్వరాష్ట్రంలో ఇవాళ పెరిగిన భూముల ధరలకు ధరణి లేకపోతే ఎన్ని పంచాయితీలు అయితుండే?.. ఎన్ని తలలు పగులుతుండే ? అంటూ ప్రశ్నించారు. జనగామ నియోజకవర్గంలోని చేర్యాలలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. సభకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ఇల్లు సూరునే సగవెట్టడు.. నేను సూర్యున్ని పట్టుకొస్త అంటరు. మనం నమ్మాలి. అన్నింటికన్నా ప్రమాకరమైన మాట. భట్టి విక్రమార్క టీవీ చానెల్లో చెప్పాడు. నేను కొద్దిసేపు చూశాను. ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తం. మళ్లీ పాత పద్ధతి తీసుకువస్తం అంటున్నడు’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
‘ధరణితో మీ భూములు సేఫ్‌గా ఉన్నది. ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారాన్ని తీసి మీ బొటనవేలికి ఇచ్చాం. మీ యాజమాన్యంలో మీ భూమిఉన్నది. ఇంకొకలమీద ఆధారపడేటట్టు లేదు. ఒకసారి ధరణిలో వచ్చిందంటే.. దాన్ని మార్చే అధికారం ముఖ్యమంత్రికి కూడా లేదు. సిస్టమ్ మొత్తం మార్చినం. మునుపు భూములు కొంటే ఎలాగుండే ? రిజిస్ట్రేషన్‌కు పోతే ఎంత బాధ ఉండే ? ఇవాళ ఎవరి మండల కేంద్రంలో వాళ్లకు రిజిస్ట్రేషన్ అవుతుంది. వెంటనే మ్యుటేషన్, వెంటనే పట్టా సైట్ల వస్తనే ఉంటది. మునుపు పట్టా కావాలంటే ఆరు నెలలు.. ఏడాది.. రెండేళ్లు పడుతుండే. రిజిస్ట్రేషన్ అయ్యాక మూడేళ్ల వరకు కూడా పట్టాకాకపోతుండే. ముట్టజెప్పేది ముట్టజెప్పినా కాకపోవు. ఇవాళ ఆ బాధ ఉన్నదా? కాంగ్రెస్ వచ్చి మళ్లీ పాత కథ మొదలుపెడుతుంది’ రైతులను సీఎం కేసీఆర్ హెచ్చరించారు.
‘ఇంకో మాట ఆలోచన చేయాలి. రైతుబంధును హైదరాబాద్‌లో రిలీజ్ చేస్తే మీ సెల్ఫోన్లన్నీ టింగుటింగుమని మోగుతయ్. అకౌంట్లలో బాజాప్త డబ్బులుంటయ్. ధరణిని బంద్చేస్తే డబ్బులు ఎలా వస్తయ్. రైతుబంధు ఎలా వస్తుంది ? వడ్లు అమ్మిన డబ్బులు ఎట్ల వస్తయ్ ? మళ్లీ దరఖాస్తులు పెట్టాలే.. పహానీ నకళ్లు తేవాలి.. అగ్రికల్చర్ ఆఫీసర్ సంతకాలు పెట్టాలే. మనం గాషారం కొద్దిపోతే.. నీకు ఎన్నికరాలుంది. ఎంత రైతుబంధు వస్తది ? ఏడాదికి రూ.70వేలు వస్తదంటే రూ.30వేలు లావో.. లేకపోతే సంతకాలు పెట్ట అంటడు. ఏం చేస్తవ్ అప్పుడు? అప్పుడు నువ్వేం చేయలేవ్.. కేసీఆర్ ఏం చేయలేడు. ఇదీ వాళ్లు చేసే మోసం. మళ్లీ దళారీ, పైరవీకారుల రాజ్యం. ఒగలభూమి ఒగలకు రాసి జుట్లుముడేసి.. తాకట్లుపెట్టి.. పంచాయితీలు పెట్టి.. ఆఫీసుల చుట్టూ తిప్పి వాళ్ల రక్తం దాటడానికేనా? ఇవాళ పెరిగిన భూముల ధరలకు ధరణి లేకపోతే ఎన్ని పంచాయితీలు అయితుండే ? ఎన్ని తలలు పగులుతుండే ? అని సీఎం ప్రశ్నించారు.
‘ఇవాళ సమాజం శాంతిగా ఉన్నది. ధరణితో ఎవరికైనా సమస్య ఉంటే పరిష్కారం చేద్దాం? కానీ, ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తం.. మళ్లీ పాత సిస్టమ్ పెడతం అంటున్నరు. పాస్‌బుక్‌లో కాంగ్రెస్ రాజ్యంలో 37కాలమ్లుండే. ఇవన్నీ ఎందుకు, ఎవరిని ముంచేందుకు అని నేను అడిగిన. ఇవాళ పాస్‌బుక్‌లో రెండు, మూడు కాలమ్స్ ఉన్నయ్. నిన్న భట్టి విక్రమార్క చెబుతున్నడు. మళ్లీ అన్ని కాలమ్స్ పెడుతడ. రైతులు ఎవరికన్నా కౌలుకు ఇవ్వకుండా.. పడావు పెట్టేటట్టు.. మళ్లీ తెలంగాణ కిందికిపోయేటట్టు.. దళారీల రాజ్యం వచ్చేటట్టు చేస్తమని బాజాప్తా కాంగ్రెసోళ్లు చెబుతున్నరు. మేం ధరణిని తీసివేస్తం.. రైతుబంధు దండగా అంటున్నం. కాంగ్రెస్ మూడుగంటల కరెంటు చాలు అంటున్నరు. మూడు గంటల కరెంటు సరిపోతుదంటే పది హెచ్‌పీల మోటర్ పెట్టుకోవాల? రైతు పది హెచ్‌పీల మోటర్ పెడుతడా ? మరి టెన్ హెచ్‌పీ మోటర్ కొనాలంటే ఒకటా రెండా? తెలంగాణలో 30లక్షల పంపుసెట్లు ఉన్నయ్. రూ.30వేలకోట్లు కావాలి. మరి ఆ డబ్బు ఎవడు ఇస్తడు ? వీని అయ్య ఇస్తడా? ఎక్కడికి రావాలి? బాధ్యతారాహిత్యంగా మాట్లాడి.. మేం మీ నెత్తికొడుతం.. ఆగమ్ చేస్తమని మాట్లాడుతున్నరు’ అంటూ ప్రజలను సీఎం కేసీఆర్ అప్రమత్తం చేశారు.