CM KCR Press Meet | బీజేపీ ఎవరిని ఉద్దరించిందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఒక రైతుబీమా ఇచ్చే తెలివి ఉన్నదా మీ గవర్నమెంట్‌కు. కనీసం ఇవ్వాలన్న ఆలోచన వస్తదా? బీజేపీ ప్రభుత్వంలో ఎక్కడన్న. రైతు చనిపోతే పది రూపాయలు ఇస్తరా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే తిన్నది అరగక చస్తున్నరు అంటరు మీ ముఖ్యమంత్రులు. రైతులు ధర్నా చేస్తే జీబులు ఎక్కించి తొక్కి చంపుతున్నరు.. అహంకారమా? రైతులు 13 నెలల పాటు ఢిల్లీ రాజధాని బార్డర్లో ధర్నా చేస్తే ఖలిస్థాన్ ఉగ్రవాదులు అంటరు మీరు. మీది పరిపాలనా? మీది ప్రభుత్వమా? ఎన్నికలు రాగానే మళ్లీ తలవంచి మాఫీ చాతాహు అని క్షమాపణ వేడుకుంటరు. ఉగ్రవాదులైతే ఎందుకు క్షమించమని అడిగారు? ప్రజలకు సమాధానం చెప్పాలి’ అంటూ మండిపడ్డారు.
‘ఎవరు భయపడుతరు మీకు? మీతోటి ఏమైతది? మన్ను కూడా కాదు.. దొంగలకు భయం. తప్పులు చేసినోళ్లకు భయం. ఎవరిని భయపట్టిస్తరు? అధికారి ఎవరికి కావాలి? కేసీఆర్‌కా ఇసిరి పారేస్తాం. అంతులేని అహంకారం.. న్యాయ వ్యవస్థను సహించరు. ప్రజాస్వామికంగా గెలిచే వారిని సహించరు. ఎవరిని సహిస్తరు మీరు. ఏం చేద్దామనుకుంటున్నరు ఈ దేశాన్ని. అన్నింటా వైఫల్యమే కాదా? ఉద్యోగ కల్పన లేదు. నిరుద్యోగం పెరుగుతుంది. ధరలు పెరుగుతున్నయ్. గ్యాస్ 170శాతం పెరుగుతుంది. ఏ ప్రధాని సమయంలో లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగతయ్. ఉప్పులు పెరుగుతయ్.. పప్పులు పెరుగుతయ్. విదేశీ మారక నిల్వలు తరిగిపోతయ్. ఏది సక్కగనున్నది. జీడీపీ క్రాష్ అవుతది. ఏం ఉద్దరించారు ఈ దేశాన్ని. ఈ దేశానికి చేశామని ఏదో ఒకటి చెప్పండి’ అంటూ నిలదీశారు.
‘కేంద్రంలో ఓ మంత్రి ఉన్నడు పీయూష్ గోల్మాల్. గోయల్ కాదు.. గోల్మాల్.. ఆయనో నెత్తిలేని సన్యాసి. ఎంత దరిద్రంగా మాట్లాడుతడంటే.. తెలంగాణ చమత్కారం చేసిందా? ఎలా సాధ్యమైంది అంటడు? పంట దాచిపెడుతారా? ఎన్ని ఎకరాల్లో ఉన్నదో తెలియదా? నేను చెప్పిన హెలికాప్టర్లో తిప్పి అధికారులు చూపిస్తరు. రైతులను అవమానించి మాట్లాడుతున్నరు. యాసంగి పంటలో మా దగ్గర టెంపరేచర్ ఎక్కువైతది జర నూకలు ఎక్కువైతయ్ అంటే.. మీరు నూకలు తినుంన్రి అంటడు. మీరు నూకలు తినాల్న తెలంగాణలో.. ఇంత అహంకారమా? ఇది ప్రజాస్వామ్యమేనా? ఇది కేంద్రమంత్రి మాట్లాడే పద్ధతేనా? ప్రజలను అవమానిస్తారా? అంటూ మండిపడ్డారు. ‘మీరేమైనా పర్మినెంటా? ఎంత మంది రాలేదు.. ఎంత మంది పోలేదు. రావణాసురుడు పోయిండు.. దుర్యోధనుడు పోయిండు.. కంసుడు పోయిండు. నరకాసురుడు పోయిండు. అంతకన్న గొప్పొల్లా’ అంటూ ధ్వజమెత్తారు.
‘నిన్నగాక మొన్న రాయ్‌పూర్‌లో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా సమావేశం పెట్టింది. మా కేంద్ర ప్రభుత్వానికి తెలివి లేదు. రెండు మంత్రిత్వ శాఖలు వాణిజ్య శాఖ, వ్యవసాయశాఖకు అసలు సమన్వయమే లేదు. ఎప్పుడు ఎక్స్‌పోర్ట్స్ బ్యాన్ చేయాలో తెలియడం లేదు. ఎప్పుడు ఇంపోర్ట్ బంద్ చేయాలో తెలుస్త లేదు. తద్వారా రైతులను ముంచుతున్నరు. దేశాన్ని నాశనం చేస్తున్నరు అని చెప్పారు. ఇంకా తమాషా అంటే ఏమిటంటే.. హిందూ ఎన్. రామ్, ఎన్డీటీవీ ప్రణయ్‌రాయ్ ఎక్కడో ఊటిలో సమావేశం పెడితే వారిని నక్సలైట్లు అంటూ ఫొటోలు పెట్టారు.. ఇదెక్కడి అన్యాయం. మీరు ఎవరినీ వదలరా? జర్నలిస్టులు సైతం మీకు నక్సలైట్లు లాగా కనిపిస్తున్నారా? ఎక్కడి అన్యాయం ఇది.
మీకు కండ్లు ఎంత నెత్తికి వస్తున్నయ్ మీకు. బాహాటంగా చెప్పుకుంటడగా ఎవరైనా.. ఏక్నాథ్ షిండేలను సృష్టిస్తామని.. మీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఏక్నాథ్ షిండేలు వస్తారని మాట్లాడుతారా? ఇది ప్రజాస్వామ్యానికి అలంకారమా? భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ఇంత ఘోరంగా హత్య చేస్తారా? మీరు ప్రజాస్వామ్య హంతకులుకారా? ఇదేం అన్యాయం. మీ ఉన్మాదం, పిచ్చి ఎక్కడి వరకు వెళ్తది. దేనికైనా ఒక లిమిట్ ఉంటది కదా? ఇంత అన్‌లిమిటెడ్‌గా.. ఇంత దుర్మార్గంగా సుప్రీం కోర్టు అంటే లక్ష్మం లేదు. జర్నలిస్టులంటే లక్ష్యం లేదు.. హైకోర్టు అంటే లక్ష్యం లేదు.. మెజారిటీతో గెలిచే గవర్నమెంట్ అంటే గౌరవం లేదు. మీకు ఎవరంటే గౌరవం ఉంది. మీరు ఏమైనా గొప్ప పని చేశారా? అంటే అది లేదు’ అంటూ సీఎం కేసీఆర్ బీజేపీ తీరును దుయ్యబట్టారు.
‘ఇటు నీళ్లు ఇవ్వ చేత కాదు.. కరెంటివ్వ చేత కాదు.. పండించిన పంట కొనుమంటే చేత కాదు. మూడు నెలల కిందటనే కదా మేము పోయి ఢిల్లీలో ధర్నా చేశాం. ఎందుకు ధర్నా చేశాం? మా రైతులు వడ్లు పండించారు.. ఇది కొనుమంటే తప్పా? యాడ పెట్టుకోవాలే.. అంటడు ఈ పీయూష్ గోల్మాల్. ఇప్పుడేమంటడు వరిని ప్రోత్సహించండి, ధాన్యం తక్కువైంది అంటండు. మీకేమైనా తెలివుందా? మీకు గవర్నమెంట్‌కు పాలసీ ఉందా? ఓ మాటమీద ఉండే నిలకడ ఉందా? మీకో విజన్ ఉన్నదా? జాతీయ- అంతర్జాతీయ మార్కెట్‌పై అవగాహన ఉందా? ఏం జరుగుతున్నదో అంచనాలున్నాయా? ఏం లేదు అంతా
వట్టిదే డొల్ల. ఇవన్నీ కఠోరమైన సత్యాలు. చానా నీతి ఆయోగ్ మీటింగ్‌లలో స్పష్టం చెప్పాను. ఎవరైనా అద్భుతమైన ఫర్ఫామెన్స్ ఇచ్చే రాష్ట్రాలు ఉన్నయో.. వాటి ప్రగతిని ఆపకండి.. అది దేశ ప్రగతిని ఆపడమైతది’ అని చెప్పాను’ అంటూ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.