హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): దేశంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిందేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తేల్చి చెప్పారు. అయితే.. మోదీ సర్కారు పోయి, నాన్ బీజేపీ రావాలని, ఇదే తమ నినాదమని వ్యాఖ్యానించారు. ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆ అంశాలు ఆయన మాటల్లోనే..
ఢిల్లీలో తెలంగాణ లాంటి సర్కారు రావాలి
ఒక్క విషయంలో నరేంద్రమోదీకి, బీజేపీకి థ్యాంక్స్ చెప్తున్నా. డబుల్ ఇంజిన్ సర్కారు అంటూ మంచి మాట చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తప్పక రావాలి. తెలంగాణ ప్రభుత్వం స్పీడ్ ఎక్కువ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం స్పీడ్ తక్కువ ఉన్నది. ఉరికెటోడు కావాలా? సన్నాసి కావాలా? కాబట్టి కచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి. కేంద్రంలో ఇప్పుడున్న సర్కారు పోయి.. తెలంగాణ లాంటి సర్కారు రావాలి.
ఇది రియల్ డబుల్ ఇంజిన్. ఉత్తరప్రదేశ్ నుంచి ఒకయాన లుంగీ కట్టుకొని వస్తడు. ఆయన కూడా ఉపన్యాసం చెప్తడు. ఉత్తరప్రదేశ్ పర్ క్యాపిటా 70 వేలు. అది తెలంగాణ విని తరించాలా? తెలంగాణ పర్ క్యాపిటాలో అది నాలుగో వంతు. మనదాంట్ల చారాన వంతు పనిచేసేటాయన వచ్చి మనకు చెప్తడా? కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఢిల్లీ ఇవన్నీ నాన్ బీజేపీ పాలిత రాష్ర్టాలు. వాటి పర్ క్యాపిటా ఎక్కువ. బీజేపీ పాలిత రాష్ర్టాలు మధ్యప్రదేశ్, యూపీ, బీహార్ ఏదయినా సరే పర్ క్యాపిటా తక్కువ. కాబట్టి మారాల్సింది బీజేపీ ఇంజిన్. తెలంగాణ 100 హెచ్‌పీ, బీజేపీ 50 హెచ్‌పీ. ఇక యూపీ అయితే 25 హెచ్‌పీనే. ఇవి కేంద్ర ఆర్థికశాఖ అధికారిక గణాంకాలు. కేంద్రం అసమర్థత వల్లే తెలంగాణ మరింత జీఎస్డీపీని నష్టపోతున్నది. మోదీ ప్రభుత్వం పోవాలి. నాన్ బీజేపీ ప్రభుత్వాలు రావాలి. ఇదే మా నినాదాం.
జడ్జీలనూ బెదిరిస్తారా?
బీజేపీ నాయకురాలు అడ్డదిడ్డంగా మాట్లాడితే విదేశాల్లో దేశం క్షమాపణ చెప్పాల్నా? దేశం పరువు ఎందుకు తీస్తారు? దీనిపై ఎవరో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ పార్థివాలా, సూర్యకాంత్ పిలిచి అలా మాట్లాడటం తప్పు కదా! అని ఆ నాయకురాలిని నిలదీశారు. అంతే రిటైర్డ్ జడ్జిలను పోగుచేసి సుప్రీం కోర్టు లక్ష్మణ రేఖ దాటిందని సీజేఐకి లేఖ రాయిస్తారు! అంత కండకావరమా? సుప్రీం కోర్టును ధిక్కరిస్తారా? దేశ గౌరవాన్ని కాపాడటం కోసం ఇది పద్ధతి కాదు అని చెప్పిన సుప్రీంను నిందిస్తారా? జడ్జిలను ట్రోలింగ్ చేస్తరా? జస్టిస్ పార్థివాలా సాబ్, సూర్యకాంత్ సాబ్ మీకు నా సెల్యూట్. ఇదే స్ఫూర్తిని కొనసాగించండి.
వారసత్వం ఉన్నంత మాత్రాన నేతలు కాలేరు
బీజేపీ నేతలు వారసత్వ రాజకీయాలపై మాట్లాడుతుంటరు. వారసత్వం ఉన్నంత మాత్రాన నేతలు కాలేరు. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కొడుకయితే ప్రజలకు పరిచయం కావడం కొంత సులువవుతుంది. ఒకసారి గెలుస్తరు. అంతే కానీ ఎల్లకాలం రాజకీయాలు చేయలేరు. ప్రజల మన్ననలు పొందితేనే అది సాధ్యం. నాయకుల పనితీరు చూసే ప్రజలు ఓట్లేస్తారు. లేకుంటే ఇంట్ల కూసుండ పెడ్తరు. ప్రజలే నిర్ణేతలు. నిబద్ధతకు చిరునామా టీఆర్ఎస్. మంత్రులు, గులాబీ నేతలు పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజల కోసం పనిచేశారు.
వ్యవసాయ వృద్ధి, స్థిరీకరణకే రైతుబంధు
ధరణితో రైతులు 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయించుకొని పోతున్నరు. ఈ విధానాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నరు. కానీ కొన్ని తలకుమాసిన పత్రికలు ధరణి తీసేస్తారని ప్రచారం చేస్తున్నాయి. రైతుబంధు 10 ఎకరాలకు చాలు అంటరు. నేను రైతు బంధు ఇచ్చేది ఎకరాలకు కాదు. రైతుల కోసం. తెలంగాణలో వ్యవస్థాయ వృద్ధికి, స్థిరీకరణకు అమలు చేస్తున్న పాలసీలే రైతుబంధు, ఉచిత విద్యుత్తు. తెలంగాణ రైతులు బిచ్చం పెట్టే స్థాయికి ఎదగాలన్నాదే మా ఆకాంక్ష. ఇప్పుడు అది నెరవేరతున్నది.

దమ్ముంటే డేట్ ఫిక్స్ చేయుమను
నేతలను గెలిపించేది, ఓడించేది ప్రజలే. ప్రజాస్వామ్యంలో ఉన్నవాళ్లే.. నేను ఓడిస్తా అంటూ మాట్లాడటం అహంకారానికి, అవివేకానికి నిదర్శనం. బీజేపీ వాళ్లకు దమ్ముంటే రమ్మను. డేట్ ఫిక్స్ చేయుమను. నేను అసెంబ్లీ రద్దు చేస్తా. కొట్లాడుదాం. అంతే కానీ చిల్లర రాజకీయాలు మాట్లాడకూడదు. కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నది. మంచిగ ఉంటే సహకరిస్తా. లేకుంటే ఇబ్బంది పెడతాననేది బీజేపీ బ్లాక్‌మెయిలింగ్ విధానం. ఇది పద్ధతి కాదు. ఇకనైనా మార్చుకోవాలి.
మోదీ.. దండం పెట్టి పోయిండు
కొమరవెల్లి మల్లన్న, కొండగట్టు అంజన్న, వేములవాడ రాజన్న, ఏడుపాయల దుర్గమ్మ, చెరువుగట్టు లింగన్న, సమ్మక్క సారలమ్మ, మన్యంకొండ కురుమూర్తి.. ఇదీ మన ప్రధాని గారి ైస్టెల్ అని కేసీఆర్ వ్యంగ్యాస్ర్తాలు విసిరారు. హైదరాబాద్ సభలో ఆయన ఏదో చెప్తారని అనుకుంటే.. భద్రాచలం, జోగులాంబ, ఈ పేరు ఆ పేరు చెప్పి దండం పెట్టి వెళ్లిపోయారని విమర్శించారు.