CM KCR | ఇబ్రహీంపట్నం : తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
బావుల కాడ మీటర్లు పెట్టాలని మోదీ బెదిరించాడు. చచ్చినా పెట్టను అని చెప్పాను. మీటర్లు పెట్టాలి.. బిల్లులు వసూళ్లు చేయాలన్నాడు. పెట్టను అని చెప్పాను. సంవత్సరానికి రూ. 5 వేల కోట్లు బడ్జెట్ కట్ చేస్తా అని అంటే కట్ చేసుకో అని మోదీకి చెప్పాను. ఐదేండ్లకు రూ. 25 వేల కోట్లు మనకు వచ్చేవి కట్ చేసిండు మోదీ. అయినా కూడా నేను కాంప్రమైజ్ కాలేదు.. మీటర్లు పెట్టలేదు. 24 గంటల కరెంట్ ఆపలేదు. రేపు బీజేపోడు వచ్చి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగతడు. ఎందుకు వేయాలి మనం బీజేపీ ఓటు. దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీ మంజూరు చేసింది కేంద్రం. మనం దేశంలో భాగం కాదా..? ఒక కాలేజీ అన్న మనకు ఇవ్వొద్దా..? ఇవ్వలేదు. ప్రతి జిల్లాకో నవోదయ పాఠశాల పెట్టాలని చట్టం ఉంది. ఆ చట్టాన్ని కూడా ఉల్లంఘించాడు మోదీ. నవోదయ పాఠశాలల కోసం 100 ఉత్తరాలు రాశాను. మన ఎంపీలు పార్లమెంట్లో గడిబిడి చేసిండ్రు. మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి. మీరు వీటిపై చర్చ చేయాలి. ఆగమాగం ఓటు వేయొద్దు. విచక్షణతో ఓటేస్తే మనకు మేలు జరుగుతది అని కేసీఆర్ తెలిపారు.
పెద్ద ప్రమాదం పొంచి ఉంది. పొరపాటున కాంగ్రెస్ వస్తే అప్పుడు నేను కూడా చేసేది ఏమీ ఉండదు. కాంగ్రెస్ నేతలు ఓపెన్‌గా చెప్తున్నారు.. ఏం దాచి చెప్పట్లేదు. మేం ఓపెన్‌గా చెప్పంగ కూడా ప్రజలు మాకు ఓటేశారు. మా పాలసీ ఇదే.. ఇంప్లీమెంట్ చేస్తామని చెప్తారు. అప్పుడు ఎవడేం చేయాలి. ఎంత మొత్తుకున్నా లాభం లేదు. ప్రజాస్వామ్యంలో పరిణితి పెరిగి, ఆలోచనా శక్తితో ఏది మంచిది, ఏది చెడ్డది అని ఆలోచించాలి అని కేసీఆర్ సూచించారు.
మంచిరెడ్డి కిషన్ రెడ్డి సుమారు రూ. 700 కోట్లతో రోడ్లన్నీ అభివృద్ధి చేశారు. కొన్నింటిని డబుల్ చేశారు. మంచి ఎమ్మెల్యే ఉన్న వద్ద మరింత అభివృద్ధి జరగాలని కోరుకోవడంలో తప్పు లేదు. అద్భుతమైన రీజినల్ రింగ్ రోడ్డు వస్తుంది. దీంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ముఖచిత్రం మారిపోతది. కలెక్టరేట్ ఇక్కడే ఏర్పాటు చేసుకున్నాం. కోహెడలో పండ్ల మార్కెట్ మీ నియోజకవర్గంలో వస్తున్నది. లక్ష మందికి ఉద్యోగాలు కల్పించే ఫాక్స్ కాన్ పరిశ్రమ కూడా ఇక్కడే వస్తుంది. 600 ఎకరాల భూమి తీసిపెట్టాం.. పొల్యూషన్ లేని ఇండస్ట్రీ పెట్టాలని ఎమ్మెల్యే కోరారు. మీకు గ్యారెంటీగా వస్తాయి. ఎవడు ఆపిన ఆగవు. హైదరాబాద్ పక్కనే ఉంది కాబట్టి జాగ చూపిస్తే ఆ పరిశ్రమోడు కాలు మొక్కి ఇక్కడికి వస్తడు. అవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరగాలంటే కిషన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి. దళిత బంధు ఎక్కువ మోతాదులో ఇచ్చేందుకు కృషి చేస్తాను. ఇప్పటికే అన్ని ఆఫీసులు తెచ్చి పెట్టుకున్నాం. నియోజకవర్గానికి మంచి భవిష్యత్ ఉంది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.