CM KCR | బెల్లంపల్లి : కాంగ్రెస్ నాయకులు అమ్మ.. బొమ్మ పేరు చెప్పి దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని దుర్గం చిన్నయ్యకు మద్దతుగా ప్రసంగించారు.
బెల్లంపల్లి చైతన్యం ఉండే ప్రాంతం. ఇక్కడ ఉద్యమాలు జరిగన ప్రాంతం. 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో దళితుల బతుకులు బాగు పడలేదు. తరతరాలుగా, యుగయుగాలుగా అణిచివేతకు గురయ్యారు. తీవ్రమైన వివక్ష ఎదుర్కొన్నారు. ఆనాడే నెహ్రూ దళితుల గురించి అభ్యుదయమైన కార్యక్రమం చేసి ఉంటే ఇవాళ్టికి దళితుల బతుకులు ఇలా ఎందుకు ఉండేవి..? దయచేసి ఈ విషయాలు ఆలోచించాలి. ఇది నిజమా..? కాదా..? అమ్మ.. బొమ్మ పేరు చెప్పి దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. దళితుల గురించి ఒక స్పెషల్ గ్రోత్ ఇంజిన్ పెట్టలేదు. అది చేసి ఉంటే దళితుల దుస్థితి ఈ విధంగా ఉండేది కాదు అని కేసీఆర్ పేర్కొన్నారు.
1956 వరకు మన తెలంగాణ మనకు ఉండే. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందేవరు.? గోస పెట్టిందేవరు..? కరువుల పాలు చేసిందేవరు.? ఉన్న తెలంగాణను నాశనం పట్టించి సిటీ కాలేజీ వద్ద ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమం జరుగుతుంటే ఏడుగురు విద్యార్థులను పట్టపగలు కాల్చేసి, తెలంగాణ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో కలిపారు. ఆ తర్వాత 56 ఏండ్లు గోస పడ్డాం. ఆ తర్వాత 1969లో ఉద్యమం చేస్తే 400 మందిని కాల్చారు. మళ్లీ 2001లో గులాబీ జెండా ఎగురవేస్తే, 2004లో తెలంగాణ ఉద్యమాన్ని చూసి, ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు. వాళ్లకు లాభమైంది. 2005, 2006లో తెలంగాణ ఇవ్వలేదు. 15 ఏండ్లు ఏడిపించారు. చివరకు మొండిగా ముందుకు పోతే, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆమరణ దీక్షకు దిగితే దిగొచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత వెనక్కి తీసుకున్నారు. మళ్లా ఏడాదిన్నర కొట్లాడితే ఉప్పెన మీరు లేస్తే, సకల జనుల సమ్మెతో ఉద్యోగులు కొట్లాడితే అప్పుడు దిగొచ్చి, ఇక దిక్కు లేకుండా అయితామని చెప్పి భయానికి తెలంగాణ ఇచ్చారు. అంటే ఎంత నస్టపరిచారు. నాడు మన తెలంగాణ మనకు ఉంటే ఎక్కడ ఉందుము.. ఏ విధంగా ఉందుము.. ఇది కాంగ్రెస్ అవలంభించే పద్ధతి అని కేసీఆర్ మండిపడ్డారు.