CM KCR | మెదక్ : రైతులకు మేలు చేసే ధరణని తీసేయాలన్న కాంగ్రెస్ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భూమి యాజమాన్యం హక్కులు మీ బొటనవేలితోనే మారుతాయి తప్ప.. ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ కూడా మార్చలేరని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ అధికారం రైతుల వద్దనే ఉండాల్నా..? మళ్లీ అధికారులకు అప్పజెప్పాల్నా? అని కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు. మెదక్ జిల్లా కొత్త కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసు ప్రారంభోత్సవం అనంతరం కేసీఆర్ జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
50 ఏండ్ల పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మంచినీళ్ల కష్టాల గురించి ఆలోచించలేదని కేసీఆర్ మండిపడ్డారు. ఇదే మెదక్ పట్టణంలో మూడు, నాలుగు రోజులకు ఒకసారి మంచి నీళ్లు వచ్చేవి. కానీ మిషన్ భగీరథ వాళ్ల ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి ప్రతి రోజు నీళ్లు అందిస్తున్నాం. ఇండియా మొత్తంలో ఒక కోటి 3 లక్షల కుటుంబాలకు నల్లా కనెక్షన్ ద్వారా నీళ్లు ఇచ్చే ఒక్కటే రాష్ట్రం తెలంగాణ. రైతాంగానికి, పరిశ్రమలకు 24 గంటల కరెంట్ ఇస్తున్నది మనమే. ఈ సదుపాయాలు వదులుకోవాల్నా.. కాంగ్రెస్‌కు అధికారమిచ్చి అని కేసీఆర్ ప్రశ్నించారు.
ధరణి తీసేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది అని కేసీఆర్ గుర్తు చేశారు. ఎందుకు తీసేస్తారు.. ఏం తప్పు చేసింది అని కేసీఆర్ నిలదీశారు. గతంలో మీ భూముల మీద వీఆర్వో, గిర్దావర్, తహసీల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, కలెక్టర్, రెవెన్యూ సెక్రటరి, సీసీఎల్ఏ, రెవెన్యూ మినిస్టర్‌కు కూడా పెత్తనం చేసే అవకాశం ఉండే. ధరణి వచ్చిన తర్వాత ఈ రోజు గవర్నమెంట్లో ఆఫీసర్లు, మంత్రుల వద్ద ఉండే అధికారాన్ని తీసేసి మీకే అధికారం ఇవ్వడం జరిగింది. మీ భూమిని మార్చాలంటే.. ఎవడు కూడా మార్చలేడు.. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మార్చలేడు. స్టేట్ ఛీప్ సెక్రటరీ కూడా మార్చలేరు. మీ భూమి యాజమాన్యం.. మీ బొటనవేలితోనే మారుతది తప్ప ఇంకెవడు కూడా మార్చే పరిస్థితి లేదు. ఈ అధికారం రైతుల వద్దనే ఉండాల్నా.. మళ్లీ అధికారులకు అప్పజెప్పాల్నా ఆలోచించాలి. ధరణి పోతే.. పెద్ద పాము మింగినట్టే.. కైలాసం ఆటలో జరిగినట్టే అవుతుంది అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఆపద్భాందు పథకం కింద కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు చనిపోతే రూ. 50 వేల చొప్పున ఇచ్చేవారని కేసీఆర్ గుర్తు చేశారు. కానీ ఆ 50 వేలు ఏ ఒక్కరికి రాలేదు. నెలల పాటు తిరిగితే 20 వేలు, 30 వేలు చేతిలో పెట్టి పంపించేవారు. కానీ మన పాలనలో ఒక్క గుంట భూమి ఉన్న రైతు చనిపోతే రూ. 5 లక్షలు వచ్చి రైతు బ్యాంకు ఖాతాలో పడుతున్నాయి. ఈ సౌకర్యం అమెరికాలో లేదు. ఇంగ్లండ్‌లో లేదు. ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు. కేవలం తెలంగాణలోనే ఉంది. ధరణి మూలంగా వడ్లు అమ్మిన పైసలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఇప్పటి వరకు 37 వేల కోట్ల రుణమాఫీ చేశాం. ధరణి రికార్డుల ద్వారా ఈ రుణమాఫీ డబ్బులు మీ బ్యాంకుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. గత ప్రభుత్వాల పాలనలో లంచం లేకుండా ఒక్క రూపాయి కూడా రైతులకు చేరకపోయేది. ధరణిని తీసేస్తామన్న వాళ్లను బంగాళాఖాతంలో విసిరేయాలి. ఇవాళ రిజిస్ట్రేషన్లు 15 నిమిషాల్లో అయిపోతున్నాయి. మహారాష్ట్ర రైతులందరూ కూడా బీఆర్ఎస్ను గెలిపిస్తామని అంటున్నారు. బీఆర్ఎస్కు బ్రహ్మారథం పడుతున్నారని కేసీఆర్ స్పష్టం చేశారు.