CM KCR | నారాయణపేట : స్వాతంత్ర్యం ఏర్పడిన తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీ మంచి కార్యక్రమాలు చేసి ఉంటే.. దళితుల దౌర్భాగ్యం ఇలా ఉండేది కాదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ దళితులను ఓటు బ్యాంకుగా వాడుకుందని సీఎం మండిపడ్డారు. నారాయణపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
నారాయణపేటకు ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణలో హైదరాబాద్ మున్సిపాలిటీ తర్వాత రెండో మున్సిపాలిటీగా ఏర్పడింది నారాయణపేట. ఆ తర్వాత రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. నారాయణపేటను జిల్లా చేస్తే చాలు.. ఏం అడగనని రాజేందర్ రెడ్డి చెప్పి చేయించుకున్నారు. ఆ తర్వాత మెడికల్, నర్సింగ్, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ తెచ్చుకున్నాడు. ఇప్పుడు మందిలా నిలబెట్టి.. చేస్తవ.. చస్తవా ప్రజల ముందు చెప్పాలని డిమాండ్ పెట్టిండు. అంటే దొడ్లకు వచ్చిన గోధ పెండ పెట్టకుండా యాడికి పోతదది. ఉపాయం, హుషారు ఉన్న వ్యక్తి రాజేందర్ రెడ్డి. ఆయన కోరిన కోరికలన్నింటిని ఎన్నికలు అయిపోగానే అమలు చేస్తాం. ప్రజలు బాగుండాలని కోరుకునే వ్యక్తి. మీరందరిని కోరుకునేంది ఒక్కటే. ఉద్యమంలో చాలాసార్లు వచ్చి సభలు పెట్టాం. అప్పుడు చైతన్యం తక్కువ ఉండే. భూమలన్నీ ఎడారి. పంటలు పండవు. వానపడితే పంట పండినట్టు. ఇక్కడ్నుంచి బొంబాయి బస్సులు ఎక్కి వలసపోయారు. కరువు అనుభవించాం అని కేసీఆర్ తెలిపారు.
ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఇడ్లీ సాంబర్ గో బ్యాక్ అని తిరగబడితే కాంగ్రెస్ పార్టీ ఏడుగురిని చంపించింది. అక్కడ్నుంచి మొదలయ్యాయి కష్టాలు. మంచి నీళ్లు లేవు.. సాగునీరు జాడ లేకుండే. కరెంట్ లేదు.. చాలా భయంకరమైన పేదరికం. కొత్త సంపారం మాదిరిగా ఒక మూడు నాలుగు నెలలు ఆర్థిక నిపుణులతో ఆలోచించి, ఎలా ముందుకుపోవాలని ఎజెండా నిర్ణయించి, అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామని కేసీఆర్ తెలిపారు.
దళితబిడ్డలు యుగయుగాలుగా అణిచివేతకు, వివక్షకు గురయ్యారు. వారు అలానే ఉండాలా..? దళితుల బతుకు మారాలని కాంగ్రెస్ ఆలోచన చేయలేదు. దళితుల గురించి మంచి కార్యక్రమాలు పెట్టి ఉంటే ఇవాళ దళితుల దౌర్భాగ్యం ఇలా ఉండేది కాదు. ఈ దేశంలో దళితుల గురించి ఎవరూ ఆలోచించలేదు. దళితబందు పుట్టించిందే కేసీఆర్. ఆ జాతి కూడాపైకి రావాలి. కాబట్టి వాళ్లు అలా ఉండటం మనకు సిగ్గు చేటు. ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు వచ్చేదాకా కృషి చేస్తాం. ఎవరు మంచి పనులు చేస్తున్నారో దళిత బిడ్డలందరూ ఆలోచించి ఓటు వేయాలి. నారాయణపేట జిల్లాలో మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. జిల్లాకు హంగులు వస్తున్నాయి. సిటిజెన్ పార్కు ఏర్పాటు చేశారు. డివైడర్లు వచ్చాయి. చాలా సంతోషం కలుగుతోంది అని కేసీఆర్ తెలిపారు.