పాలకుర్తి రూరల్, మే 5: ప్రతిపక్షాలు కల్లాల వద్ద ధర్నాలు చేయడం సిగ్గుచేటని పంచాయతీరాజ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు మద్దతు ధర లేదని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మాటలను రైతులు నమ్మొద్దని కోరారు. శుక్రవారం జనగామ జిల్లా పాలకుర్తిలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వానికి భారమైనా సీఎం కేసీఆర్ ఓ వైపు ధాన్యం, మరోవైపు మక్కలను కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. మక్కల కొనుగోలు కేంద్రంతో రైతులకు మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. రైతులు దళారులకు మక్కలను విక్రయించొద్దని సూచించారు. అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేసిందని, ఆత్మైస్థెర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. నష్టపరిహారం కింద ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్నదని అన్నారు.