Kaleshwaram | హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుతోనే తెలంగాణలో జలసిరులు కనిపిస్తున్నాయని, చెరువులు, చెక్‌డ్యామ్‌లు మండుటెండల్లోనూ అలుగులు పోస్తున్నాయని, టన్నుల కొద్దీ ధాన్యం దిగుబడులు వస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. ఒకనాడు కాంగ్రెస్ పాలనలో దుమ్మురేగిన గోదావరి, నేడు 250 కిలోమీటర్ల మేరకు సజీవధారగా మారిందని పేర్కొన్నారు. 30 లక్షల బోర్లు నిండుగా పోస్తున్నాయంటే మిషన్ కాకతీయ ఫలితమేనని గుర్తుచేశారు. చెరువుల పునరుద్ధరణతోనే తెలంగాణ పునర్నిర్మాణానికి నాంది పడిందని, తొమ్మిదేండ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికో తెలంగాణ ఎదిగిందని వివరించారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ అరిగోస పడ్డదని, రైతులు ఎరువులుసహా అనింటికీ ఇబ్బందులను పడ్డారని నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం.. సమగ్ర అభివృద్ధి అంశంపై అసెంబ్లీలో ఆదివారం కొనసాగిన చర్చలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఉద్యమ జ్ఞాపకాలను, స్వరాష్ట్రంలో స్వల్పకాలంలో అన్ని రంగాల్లో తెలంగాణ సాధిస్తున్న ప్రగతిని విశదీకరించారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌కు ఎందుకు అంత ఏడుపు? అసలు దాని గురించి అర్థమైతా వీళ్లకు? తుంగతుర్తిలో పాదయాత్ర చేస్తూ భట్టి విక్రమార్క చేసిన ఉపన్యాసం విన్న. తుంగతుర్తిలో కాళేశ్వరం నీళ్లు చూపిస్తారా అన్నరు. మరి కాళేశ్వరం లేకపోతే తుంగతుర్తికి, సూర్యాపేటకు, డోర్నకల్‌కు, మహబూబాబాద్‌కు నీళ్లు ఎక్కడివి? ఎస్సారెస్పీ నుంచి కోదాడ వరకు నీళ్లు పారేటియా? కాళేశ్వరం వాళ్లు కట్టలేదు కాబట్టి వాళ్లకు అర్థం కాదు. 2.75 లక్షల ఎకరాలున్న నిజాంసాగర్‌ను నీలుగ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మెదక్ జిల్లా ఘన్పూర్ది అదే దుస్థితి. నాడు మూగనోము పట్టిన కాంగ్రెస్ నేతల పుణ్యమా అని నిజాంసాగర్‌లో 1.10 లక్షల ఎకరాలే మిగిలింది. గులాబీ జెండా ఎగరేసినంకనే అలీసాగర్ గుత్ప మొదలు పెట్టి పూర్తి చేశారు. నిజాంసాగర్ కింద చెడిపోయిన ఆయకట్టును గుత్ప ద్వారా కొంత చేస్తున్నాం. ఎస్సారెస్పీ ద్వారా కొంత చేస్తున్నాం. ఎస్సారెస్పీ అంటే ఏంటి? నిజాంసాగర్ కోల్పోయిన 1. 75 లక్షల ఆయకట్టు స్థిరీకరణ కావాలె. మునుపటి ఎస్సారెస్పీ కాదు అది ఇప్పుడు. దాని నుంచి కొన్ని వేల గ్రామాలకు మిషన్ భగీరథ కనెక్షన్ పెట్టాం. వాళ్లకు మంచినీళ్లు రావాలె. దాని కోసమే ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం పెట్టాం. ఎప్పుడయితే మీది నుంచి నీళ్లు రావో అప్పుడు కాళేశ్వరం ప్రాణహిత నుంచి తీసుకుంటాం. అది మీకు తమాషాగా అనిపిస్తున్నది. రైతుల బతుకు, పంటల విలువ తెలుస్తేనా? మొన్న ఏమైంది.. ఒకటిన్నర నెల చుక్క వర్షం పడలేదు.
బాన్సువాడలో ఒక అలవాటున్నది.. బాన్సువాడ, బోధన్‌లో రోహిణిలోనే నార్లు పోస్తరు. నిజాంసాగర్‌లో 5 టీఎంసీలు ఉన్నయ్. నారు పోయిస్తున్నాం. నీళ్లు ఇస్తారా? అని అడిగారు. మల్లన్నసాగర్ నుంచి తీసుకుందామకున్నం. నీళ్లు వస్తలేవు ఏం చేయాలి? ఎస్సారెస్పీ పునరుజ్జీవం ఉందికాబట్టే నీళ్లు పైకి పోయడం మొదలు పెట్టాం. మనం అనేక కరువులు చూశాం. అవే అనుభవాల దృష్ట్యా ఎస్సారెస్సీ ఆయకట్టుకు ఎట్టిపరిస్థితుల్లో నీళ్లు అందాలె అని మిడ్‌మానేరు పైవరకే ఎస్సారెస్పీని పరిమితం చేసుకున్నం. అటు ఆదిలాబాద్, నిజామాబాద్.. కింద ఉన్న కోరుట్ల, జగిత్యాల, మెట్పల్లి, పెద్దపల్లి, చొప్పదండి వగైరా నియోజకవర్గాలకు నీళ్లు పరిమితం చేశాం. మరి కిందకు అంటే హుజురాబాద్, వరంగల్, డోర్నకల్, మహబూబాబాద్, తుంగతుర్తి, సూర్యాపేటకు నీళ్లు పారిస్తున్నదే కాళేశ్వరం ప్రాజెక్టు.. అది మీకు తెల్వదాయె. చెప్పెటోడు లేడాయె. అందుకే ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక వేళ కాళేశ్వరమే లేకపోతే మల్లన్నసాగర్ ఎక్కడిది? కొండపోచమ్మ ఎక్కడిది? రంగనాయకసాగర్ ఎక్కడిది? అన్నపూర్ణ ఎక్కడిది? వాటిల్లో నీళ్లు ఎక్కడివి? మెదక్ జిల్లాలో ఇవాళ 10 లక్షల ఎకరాలు అదనపు ఆయకట్టు ఎప్పుడస్తది అంటున్నరు. సిద్దిపేటల వచ్చింది అదనపు ఆయకట్టు కాదా? గజ్వేల్‌లో వచ్చింది అదనం కాదా?
తెలంగాణ రావడానికి 3 మూడు నెలల ముందు ఢిల్లీలో నా ఇంట్లో కూర్చున్నం. చెరువులనే మంచిగ చేసుకోవాలె. అవే మనకు అన్నం పెడతాయి. కాకతీయ రాజులు కట్టారు కాబట్టి, వారి పేరుమీద పెడ్తేనే బర్కత్ ఉంటదని అప్పుడే మిషన్ కాకతీయ పేరును ఖరారు చేశాం. చెరువుల పునరుద్ధరణతోనే తెలంగాణ పునర్నిర్మాణాన్ని ప్రారంభించాం. తెలంగాణ ప్రజల ఆర్తి ఎంతంటే.. మట్టిని సొంతంగా ట్రాక్టర్లు పెట్టుకుని తరలించుకుపోయారు. లక్షల ట్రాక్టర్ల మట్టిని తీసుకుని పోతే అటు పొలాలు సారవంతమైయ్యాయి. ఇటు చెరువుల్లో కంపలు పోయాయి.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇగ తెస్తున్నమని చెప్పి వరంగల్ పోయి నీళ్లు ఇడ్సిన్రు. సీఎం ఎట్లా కురవి పోయి హైదరాబాద్ వాపస్ వచ్చాడో, నీళ్లు కూడా అట్లనే వాపస్ పోయినవి. మళ్లా నీళ్లు రాలె. ఇప్పుడు ఎంత అద్భుతమైన జలధారలు? ఎక్కడివి అవి? కాళేశ్వరం పుణ్యమాని కరీంనగర్ జిల్లాలో నాలుగు సజీవ జలధారలు. అప్పర్ మానేరు ప్రాజెక్టు నుంచి పోయే అతిపెద్ద రివర్ మానేరు. వందలాది చెక్‌డ్యామ్‌లతో, అదేవిధంగా వరద కాలువ. ఒక రిజర్వాయర్‌గా ఒక పునరుజ్జీవంగా మార్చబడింది. ఒక సజీవ జలధారగా మారింది. కాకతీయ కాలువ నిండు గర్భిణి. 9 నుంచి 10 కాలువ ఒక సజీవ జలధార. అదే ఉత్తరాన గోదావరి.. యాది చేసుకుంటే దుఃఖమొస్తది. ఒకనాడు చిల్లర పైసలు వేద్దామంటే నీళ్లు ఎక్కడున్నయో వెతుక్కోవాల్సిన దుస్థితి. అనేక సందర్భాల్లో నేను చూసిన. మడుగునో, గుంటనో ఉంటే దాని దగ్గరికి వెళ్లి డబ్బులు వేసేవాళ్లం. ఇటీవల నేను మంచిర్యాల వెళ్లి వస్తూ బ్రిడ్జి మీద ఆగి చూస్తే కండ్ల ముందు సముద్రమంత గోదావరి. డబ్బులు వేశా. ఆనాడు ఎండిపోయి దుమ్ము కొట్టుకపోయిన గోదావరి, నేడు మోటరు పెట్టకుండా గోదావరికి రెండు దిక్కులా బోర్లు నీళ్లు కక్కుతున్నయ్. కరెంటు లేకుండా బోర్లు కక్కుతున్నయ్.
ఎన్ని బరాజ్‌లు.. సీతమ్మసాగర్ అయితున్నది. ఇప్పటికే 65 శాతం పూర్తయింది. సీతమ్మసాగర్ 35, సమ్మక్క 6, లక్ష్మి, సరస్వతి, పార్వతి, కాంగ్రెస్ పడావు పెట్టిన ఎల్లంపల్లి, మిడ్‌మానేరు కంప్లీట్ చేశాం. సదర్మాట్ వద్ద కూడా కొత్త బరాజ్‌ను కట్టినం. దాని ద్వారా బ్రహ్మాండమైన నీళ్లు వచ్చే పరిస్థితి. 9 ఏండ్ల కింద దుమ్ము మాత్రమే కనబడిన గోదావరిలో నేడు 250 కిలోమీటర్ల మేర సజల సుజల గోదావరి. 100 టీఎంసీల నీళ్లు ఇవాళ జల కొడుతున్నయి. వాళ్లు సొంతంగా చూశారో లేదో తెల్వదు. పోతమంటే చెప్పండి ఎమ్మెల్యేను ఇచ్చి పంపుత. ఇన్ని పైసలు వేసి పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసినం కాంగ్రెస్, టీడీపీ హయాంలో గెలుకుడు, ఆడ పెట్టుడు. ఒక్క ప్రాజెక్టు పూర్తి కాదు. దశాబ్దాలు గడుస్తయి. మేం వచ్చిన తరువాత సత్వర చర్యలు తీసుకుని మూలకు పడ్డ మిడ్‌మానేరును, ఎల్లంపల్లిని, కల్వకుర్తిని, బీమా, నెట్టెంపాడు, దేవాదుల లిఫ్ట్‌ను పూర్తి చేసినం. పాకాల చెరువుకు జీవం పోశాం. దేవాదులకు పాకాల లింక్ చేసినం. ఇపుడు బ్రహ్మాండంగా లిఫ్ట్ పోస్తున్నది. నాడు ఒక పంట పండితేనే ఎక్కువ అన్నట్టు ఉంటుండె. ఇప్పుడు రెండు పంటలు పడుతున్నయ్. పాకాల ఆయకట్టుకు ఢోకా లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన కృషి ఇది. మాట్లాడితే కమీషన్ అంటరు. కొందరికి ఎంత చెప్పినా అర్థం కాదు. వాళ్ల ఖర్మ. కాకతీయ రాజులు ఇచ్చిన చెరువులే మన పర్కోలేషన్ ట్యాంకులు. నీళ్లు పారించేటియే కాదు.. భూగర్భ జలాలను కూడా పెంచేటివే. మొదల చెరువులను నింపాలనే చెబుతుంటా. పారకం ద్వారా పారేది పారకం ద్వారా పరుతది. బోర్ల ద్వారా పారేది బోర్ల ద్వారా పారుతది. ఇది బహుముఖ వ్యూహం.
కొన్ని పత్రికలు విషం కక్కుతున్నయ్ కాళేశ్వరం వృథా అంటూ ఎవడో ఒకడు, వెకిలిపేపరోడు రాస్తడు. ఏమైంది? మొన్న నీళ్లు పోసినం. అవగాహన లేక ఇష్టారీతిన మాట్లాడుతున్నరు. ఒక పిచ్చి పేపరోడు రాస్తున్నడు.. పూర్తిగా నిలువెల్లా విషం పెట్టుకున్న పేపర్లు ఉన్నయ్. రకరకాలుగా వ్యతిరేకిస్తరు. ఒక పిచ్చి మేధావి ఉన్నడు. ఈక తెల్వదు. తోక తెల్వదు. ఈ ప్రాంతం మనిషి కాదు. కాళేశ్వరం వేస్టు అంటడు. మరి ఏది బెస్టు? విషయాన్ని అర్థం చేసుకోవాలంటే బుర్ర కావాలె. ప్రతి ప్రభుత్వానికి కొన్ని ప్రాథమ్యాలు ఉంటయ్.
కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం చెప్పుల లైన్లు, పోలీస్స్టేషన్ల ఎరువుల బస్తాలు, లాఠీచార్జీలు.. కాంగ్రెస్ వస్తే మళ్లా అదే పరిస్థితి వస్తుంది. మళ్ల కాంగ్రెస్ వస్తే కరెంటు గోల్మాల్, రైతుబంధుకు రాంరాం, దళితబంధుకు జై భీం.. ఇగపో. కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే 467 కేసులు వేసిన్రు. అడుగు తీసి అడుగు వేస్తే కేసు. ఇదే కాంగ్రెస్ నేత శ్రీధర్‌బాబు పెద్దపల్లి కలెక్టరేట్లో వీరంగం చేశారు. అనేక కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరకు సచ్చిపోయినోళ్ల పేరు మీద కూడా కేసులు వేశారు. ఇవాళ అద్భుతమైన పనిచేశాం. తత్ఫలితంగానే ఖమ్మంలో చేపట్టిన సీతారామ, మహబూబ్‌నగర్‌లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, జహీరాబాద్, నారాయణఖేడ్‌లో సంగమేశ్వర, బసవేశ్వర, జుక్కల్‌లో నాగమడుగు అతి త్వరలోనే పూర్తి కానున్నాయి. మేమే పూర్తి చేస్తాం. ప్రజలు తప్పకుండా మమ్మల్నే గెలిపిస్తారు. మేమే వెళ్లి వాటిన్నింటినీ ప్రారంభిస్తాం అని సీఎం కేసీఆర్ వివరించారు.