ఇవాళ సంగారెడ్డి జిల్లా కళకళలాడుతున్నది
చరిత్రలో నిలిచేలా సంగమేశ్వర, బసవేశ్వర శంకుస్థాపన
సీఎం కేసీఆర్ దయతో మిషన్‌భగీరథ నీళ్లు ఇచ్చుకొన్నాం
ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు
సిద్దిపేట, ఫిబ్రవరి 21 : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన సంగారెడ్డి జిల్లా చరత్రలోనే చిరస్థాయిలో నిలిచిపోయే ఒక అద్భుతమైన కార్యక్రమమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంజీరా నీళ్లు గోదావరిలో కలవడం అనేది ప్రకృతి సృష్టించిన అద్భుతమని మంత్రి అన్నారు. మన సీఎం కేసీఆర్ ఇవ్వాళ గోదావరి నీళ్లను వెనక్కి మళ్లించి మంజీరాలో కలిపే ఒక మహాద్భుతాన్ని మనకు కల్పించారన్నారు. ఎక్కడో కింద ప్రవహిస్తున్న గోదావరి జలాలను మేడిగడ్డ నుంచి మల్లన్నసాగర్‌కు, అక్కడి నుంచి సింగూరు ప్రాజెక్టుకు అక్కడి నుంచి జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, జోగిపేటకు అందించిన ఒక మహత్తర కార్యక్రమాన్ని సీఎం మనకు అందించారని మంత్రి హరీశ్‌రావు అన్నారు.
కేసీఆర్ ఎక్కడ కాలు పెడితే అక్కడ సస్యశ్యామలం
రామాయణంలో రాముడు కాలు పెడితే రాయి అహల్య అయిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇవ్వాళ సీఎం కేసీఆర్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ అంతా సస్యశ్యామలం అవుతుందన్నది నేటి చరిత్ర చెప్తున్నదని తెలిపారు. ఇవ్వాళ కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను ఏడేండ్లలోనే తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని కొనియాడారు. ‘సీఎం సార్‌తో ఒక సామెత గుర్తు చేద్దామనుకుంటున్నా.. నేను గతంలో నారాయణఖేడ్‌లో పనిచేసినప్పుడు అక్కడ వారు మనూరు మండలం బోరంచకు పిల్లనియ్యద్దు, హద్దునూర్కు ఎద్దునియ్యద్దు. బోరంచకు పిల్లనిస్తే నీళ్లు మోయపెడుతరు, నా బిడ్డను కష్టపెడుతరని చెప్పి ఎవ్వరు కూడా ఇక్కడికి పిల్లను ఆ రోజుల్లో ఇయ్యలేదు. న్యాల్కల్ మండలంలోని హద్దూనూరకు ఎద్దునిస్తే దానికి గాసం దొరకదని, తాగడానికి నీళ్లు దొరకయి. ఆ ఎద్దు గోస పడ్తదని చెప్పి ఎద్దునియ్యడానికి ఎనుక ముందైనటువంటి రోజులు ఉన్నయి. ఇవ్వాళ సీఎం కేసీఆర్ దయతో మిషన్ భగీరథ పథకంతో ప్రతి గడప గడపకూ వచ్చాయి. ఇవ్వాళ బోరంచకు పిల్లనియ్యడానికి ముందుకొస్తున్నరు. బసవేశ్వర, సంగమేశ్వర పథకంతో రేపు హద్దునూరుకు ఎద్దునిచ్చే కాలం కూడా త్వరలోనే రాబోతున్నది’ అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.