హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేదర్ మహాశయుని దార్శనికత వల్లనే నేడు దళిత, గిరిజన, బహుజన వర్గాలతోపాటు సకల జనులకు ఆర్థిక, సామాజిక న్యాయం లభించిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. పేదల కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన ప్రపంచం గర్వించదగ్గ మేధావి బీఆర్ అంబేదర్ అని కొనియాడారు. తన దూరదృష్టితో అనేక చర్చల అనంతరం ప్రత్యేక రాష్ట్రాల కోసం రాజ్యాంగంలో ఆర్టికల్ 3ను పొందుపరిచారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి మార్గం సుగమం చేసిన తెలంగాణ బాంధవుడు, అందరివాడు అంబేదర్ అని సీఎం శ్లాఘించారు. హైదరాబాద్‌లో 125 అడుగుల ఎత్తు నిర్మించిన బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 14న ఆయన జయంతి సందర్భంగా ఆవిష్కరించనున్నారు.
ఈ కార్యక్రమ ఏర్పాట్లపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమం ప్రపంచమే అబ్బురపడేలా ఉండాలని సూచించారు. విగ్రహావిష్కరణ సందర్భంగా నిర్వహించే సభకు సకల ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దేశం గర్వించదగ్గ స్థాయిలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొంటున్న సందర్భంలో ఆవిషరణ సభ కూడా అంతే గొప్పగా, అంబేదర్ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ఉండాలని మంత్రులకు, అధికారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి అంబేదర్ ముని మనుమడు ప్రకాశ్ అంబేదర్ను మాత్రమే ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని నిర్ణయించారు. విగ్రహావిషరణ కార్యక్రమం, సభకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్‌రెడ్డితో కమిటీ ఏర్పాటుచేశారు.
సభకు 35,700 మంది
విగ్రహావిష్కరణ సభకు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి 300 మంది చొప్పున మొత్తం 35,700 మందిని ఆహ్వానించాలని ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ సూచించారు. ఇందుకోసం అవసరమైన 750 ఆర్టీసీ బస్సులను ముందుగానే బుక్ చేసుకోవాలని ఆదేశించారు. ‘విగ్రహావిషరణ తర్వాత రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అంబేదర్ అభిమానులు, సామాజిక వేత్తలు, సామాన్యులు కూడా విగ్రహ సందర్శన కోసం వస్తారు. ఈ సందర్భంగా నివాళులర్పించేందుకు విగ్రహ ప్రాంగణంలో పలు రకాల పుష్పాలను అందుబాటులో ఉంచాలి. ఎండాకాలం కావడంతో నీడకోసం టెంట్లు ఏర్పాటు చేయాలి. తాగునీరు, మజ్జిగ అందుబాటులో ఉంచాలి. ఈ ఏర్పాట్లన్నీ మరో నెలపాటు కొనసాగించాలి’ అని ఆదేశించారు.
ఈ సందర్భంగా సీఎం తాను 4 దశాబ్దాల క్రితమే దళిత, అణగారిన వర్గాల జీవితాలను అధ్యయనం చేయటానికి ‘సెంటర్ ఫర్ సబాల్టర్న్ స్టడీస్’ అనే అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటుచేసిన విషయాన్ని గుర్తు చేశారు. సమావేశంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, రసమయి బాలకిషన్, బాల సుమన్, విఠల్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, సీఎంవో కార్యదర్శులు భూపాల్‌రెడ్డి, స్మితా సబర్వాల్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెచ్ఎండీఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, సంక్షేమ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఈఎన్సీ గణపతిరెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ తదితరులు పాల్గొన్నారు.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే
అంబేదర్ విగ్రహం కలకాలం నిలిచేలా సాంకేతికంగా, తయారీ పరంగా పకడ్బందీ చర్యలు తీసుకోవడానికి రెండు సంవత్సరాలు పట్టిందని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. పలు దేశాలు, ప్రాంతాలు తిరిగి సమాచారాన్ని సేకరించి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే విగ్రహాన్ని రూపొందించడం తనకు అత్యంత సంతృప్తినిచ్చిందని చెప్పారు. ‘నేను ఊహించినదానికంటే అత్యద్భుతంగా విగ్రహ రూపం ఆవిషృతమైంది. ప్రసన్న వదనంతో నిలుచుని ఉన్న అంబేదరుడు ఒక తాత్విక జ్ఞానిగా సాక్షాత్కరిస్తున్నాడు’ అని తెలిపారు. విగ్రహ రూపశిల్పి రామ్ వంజీ సుతార్ కృషిని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సతరించాలని నిర్ణయించారు. ‘దేశం గర్వించదగ్గ రీతిలో అంబేదర్ మహా విగ్రహాన్ని మనం ఆవిషరించుకోబోతున్నం.
దళితులు, గిరిజనులు, బహుజనులు, భారతదేశ ప్రజలు మాత్రమే కాదు.. వివక్ష ఎదురయ్యే ప్రతిచోటా అంబేదర్ ఆశయం సాక్షాతారమవుతుంది. అంబేదర్ విశ్వ మానవుడు. వారికి మనం ఎంత చేసుకొన్నా తకువే. అత్యున్నత స్థాయిలో వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే వారి ఆశయాలను అనుసరించేందుకు నిత్యం స్ఫూర్తి పొందడమే’ అని సీఎం వ్యాఖ్యానించారు. అంబేదర్ ఆశయాల సాధన కోసం ప్రజా ప్రతినిధులు, యావత్ ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలన్న గొప్ప సంకల్పంతోనే రాష్ట్ర సచివాలయానికి ఆయన పేరు పెట్టామని తెలిపారు. ఇటువంటి చరిత్రాత్మక సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్న అన్ని జాగ్రత్తలతో పకడ్బందీగా పూర్తిచేయాలని ఆదేశించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే అతిథులు, ప్రజల సౌకర్యార్థం ఏర్పాట్లు చేయాలని సూచించారు.
సమావేశంలో తీసుకొన్న కీలక నిర్ణయాలు