KCR Press Meet – బండి సంజయ్.. ఊరికే మాట్లాడటం కాదు. నువ్వు మనిషివే అయితే.. నిజాయితీ ఉంటే వెంటనే ఢిల్లీ నుంచి ఆర్డర్స్ తీసుకొనిరా.. వరి ధాన్యం కొంటామని కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకురా.. అంటూ సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతు సోదరులు ఎవరూ రాష్ట్ర బీజేపీ నాయకుల మాటలు నమ్మొద్దంటూ హితువు పలికారు.
పంట పండించిన రైతులకు 10 రూపాయలు రావాలని మేము కొట్లాడుతున్నం. రైతును ముంచి రాజకీయం చేసి ఓట్లు రావాలని వాళ్లు కొట్లాడుతున్నరు. ఈ కుటిల నీతిని రైతాంగం గమనించాలి. ఏడేళ్ల నుంచి రైతుల కోసం ఎక్కడలేని సదుపాయం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అది నిజం కాదా. ఇంత అద్భుతంగా సృష్టించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అద్భుతమైన హైక్వాలిటీ పవర్ ఇస్తున్నం. చిల్లర రాజకీయాల కోసం మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నరు. 10 రూపాయల పని చేయని వాళ్లను పట్టించుకోవద్దు. కరీంనగర్ నుంచి ఎంపీ అయ్యాడు. ఏమైనా చేసిందా? అసలు ఈయన ఢిల్లీలో ఏం మాట్లాడుతడో ఎవ్వరికీ తెలియదు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతడు. తెలంగాణ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లేవని నోటీసులు ఇచ్చిన ఈ మనిషి.. ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది.. అంటూ సీఎం కేసీఆర్.. బండి సంజయ్‌పై మండిపడ్డారు.
బీజేపీ పాలనలో ఎక్కడైనా దళిత బంధు ఉందా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కళ్యాణ లక్ష్మి లాంటి స్కీమ్ ఉందా? పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నరు. ప్రజల మీద భారం మోపుతోందే మీరు. పెట్రోల్, డీజిల్ మీద ఉన్న అన్ని సెస్‌లను వెంటనే విత్‌డ్రా చేయండి. వెంటనే పెట్రోల్ ధర దానంతట అదే తగ్గుతుంది. రాజ్యాంగబద్ధంగా సెంట్రల్ ట్యాక్స్‌లో రాష్ట్రాలకు 41 శాతం స్టేట్ ట్యాక్స్ ఇవ్వాలి. కానీ.. రూపాయి ఇవ్వలేదు. మీ అడ్డందిడ్డం పనులను మేం చూస్తూ కూర్చోలేం. వ్యక్తిగతంగా నన్ను నిందించినా నేను ఏనాడూ పట్టించుకోలేదు కానీ.. రైతాంగం బతుకులతో చెలగాటం ఆడుతున్నారు కాబట్టి.. మీ మాటలు నమ్మితే రైతులు మునిగిపోతారు కాబట్టి.. నేను ఆవేదనతో మాట్లాడుతున్నా.. అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.