CM KCR | ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఆరె, మాలి కులస్తుల సంక్షేమం కోసం కృషి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని కోవా లక్ష్మీకి మద్దతుగా ప్రసంగించారు.
బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆసిఫాబాద్‌లో 47 వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చాం. వారందరికీ రైతుబందు ఇచ్చాం. రైతుబీమా కూడా పెట్టుకున్నాం. కాగజ్‌నగర్‌లో ఇద్దరు గిరిజనులు చనిపోతే రూ. 5 లక్షల చొప్పున బీమా అందిందని కోనేరు కోనప్ప చెప్పారు. ఆదివాసీ, లంబాడీ తండాలకు త్రీ ఫేజ్ కరెంట్ సదుపాయం కూడా కల్పిస్తున్నాం. ఇంకా మిగిలి ఉంటే అది కూడా పూర్తువుతుంది అని కేసీఆర్ పేర్కొన్నారు.
గిరిజనుల కోసం పోడు పట్టాలు ఇచ్చాం. ఈ నియోజకవర్గంలో ఆరె, మాలి కులస్తులు ఉన్నారు. ఆరె కులస్తులకు ఓబీసీ కావాలని అడుగుతున్నారు. అది రావడం లేదు. తప్పకుండా దాని గురించి ఫైట్ చేసి, వారి సంక్షేమాన్ని పట్టించుకుంటాం. మాలి కులస్తుల విషయంలో మేం తీర్మానం చేసి పంపించాం.. కానీ కేంద్రం పట్టించుకోవడం లేదు. మాలి కులస్తులు కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌లో ఉన్నారు. ప్రత్యేక డబ్బులు వెచ్చించి వారి సంక్షేమం కోసం కృషి చేస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వానికి కులం లేదు, మతం లేదు.. జాతి లేదు. అందర్నీ కలుపుకుపోతున్నాం అని కేసీఆర్ తెలిపారు.
మునపటి లాగా కల్తీ నీళ్లు తాగి మరణాలు లేవు. గిరిజనుల లభివృద్ధి చేసుకుంటున్నాం. గిరిజన బిడ్డల కోసం గురుకులాలు పెట్టుకున్నాం.. పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. ఎంబీబీఎస్, ఇంజినీరింగ్‌లో సీట్లు వస్తున్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి. కాంగ్రెస్‌కు అప్పగిస్తే రైతుబంధు రాంరాం.. పట్వారీలు, దళారీల రాజ్యం వస్తది. ఆగమైపోయే అవకాశం ఉంటుంది. అబివృద్ధి చెందుతున్న తెలంగాణ ఇదే విధంగా అబివృద్ధి చెందాలి కాబట్టే కోవా లక్ష్మీని భారీ మెజార్టీతో గెలిపించాలి. ఆత్రం సక్కుకు లభించే స్థానం లభిస్తుంది. ఇటీవల పార్టీలో చేరిన సరస్వతికి రాజకీయ భవిష్యత్ ఇస్తానని హామీ ఇస్తున్నా అని చెబుతూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.