CM KCR | నాగర్కర్నూల్ : రైతులు ఆగమాగం కావొద్దు.. మోసపోతే గోసపడుతాం.. అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ రాజ్యం వస్తే దళారీలదే రాజ్యం ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసు, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఇదే జిల్లా నుంచి వచ్చిన ఒక ప్రబుద్ధుడు.. ధరణిని బంగాళాఖాతంలో వేస్తానంటున్నారు అని కేసీఆర్ ధ్వజమెత్తారు. ధరణి రాకముందు అంతా లంచాలమయంగా ఉండేది. ధరణితో అధికారుల వద్ద ఉన్న అధికారాన్ని ప్రజలకు ఇచ్చాం. రెవెన్యూ రికార్డులు మార్చే అధికారం ఇప్పుడు సీఎంనైనా నాకు కూడా లేదు. ధరణి రాకతో పైరవీలు, లంచాలకు అడ్డుకట్ట పడింది. ధరణిని బంగాళాఖాతంలో వేస్తే మళ్లీ లంచాల రాజ్యం వస్తుంది. ధరణిని బంగాళాఖాతంలో వేస్తే రైతులను బంగాళాఖాతంలో వేసినట్టే. ధరణి ఉండాలా..? వద్దా..? మీరే చెప్పండి. గతంలో రైతుబంధు ఇవ్వాలని ఒక్క సీఎం కూడా భావించలేదు. ధరణి వల్ల 99 శాతం సమస్యలు పరిష్కారం అయ్యాయి. ధరణి వల్ల ఒక శాతం సమస్యలు ఉంటే ఉండొచ్చు. కాంగ్రెస్ రాజ్యంలో దళారీలదే భోజ్యం. కాంగ్రెస్ సర్కార్కు, బీఆర్ఎస్ సర్కార్కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ధరణి లేకపోతే ఎన్ని గొడవలు, హత్యలు జరిగేవో ఆలోచించండి. మళ్లీ రైతులను పోలీసు స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పేలా కాంగ్రెస్ కుట్ర చేస్తోంది అని కేసీఆర్ మండిపడ్డారు.
ఒక రైతు చనిపోతే కాంగ్రెస్ రాజ్యంలో ఆపద్భాందు కింద 50 వేలు ఇస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పేటోల్లు. కానీ అవి సమయానికి రాకపోయేవి. ఇవాళ ధరణి పుణ్యమా అని దరఖాస్తు పెట్టకుండానే, లంచం ఇవ్వకుండానే 5 లక్షలు వారి ఖాతాలో జమ అవుతున్నాయి. ధరణి లేకపోతే పైసలు రావు. వడ్లు అమ్ముతున్నరు. ప్రభుత్వం కొంటుంది. ధరణి కంప్యూటర్లో వివరాలు ఉన్నాయి కాబట్టి.. మీ బ్యాంకుల పైసలు వచ్చి పడుతున్నాయి. మళ్లీ చిట్టీలు వస్తే రెండు, మూడు నెలలు వారి ఇంటి చుట్టూ తిరగాల్సి ఉంటుంది. రైతులు మోసోవద్దు. ఈదుర్మార్గుల కాలంలో రైతుల గురించి ఆలోచించలేదు. రైతులకు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని ఆలోచించలేదు. మళ్లీ ఇవాళ వచ్చి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. అన్ని సౌకర్యాలు ఊడగొట్టుకుందామా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ మాటలను ఇక్కడే విని వదిలి పోవద్దు. గ్రామాల్లోకి వెళ్లిన తర్వాత చర్చ పెట్టండి. ఆగమాగం కావొద్దు. రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు.