CM KCR | మంచిర్యాల : సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించుకున్నామని కేసీఆర్ గుర్తు చేశారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, దివాకర్ రావుకు మద్దతుగా ప్రసంగించారు.
సింగరేణి నిజాం కాలంలో 134 ఏండ్ల కింద ప్రారంభమైన కంపెనీ. మీ అందరికీ తెలుసు. 100 శాతం మన రాష్ట్రం కంకపెనీ. ఈ కాంగ్రెస్ దద్దమ్మలు రాజ్యం ఏలినప్పుడు వాళ్ల చేతకాక కేంద్రం వద్ద అప్పులు తెచ్చి, అవి తిరిగి చెల్లించడం చేతకాక 49 శాతం వాటా కేంద్రానికి అప్పగించారు. మొత్తం కాంగ్రెస్ పార్టీ యూనియన్లు, సీసీఐ యూనియన్లు అన్ని యూనియన్లు కూడబలుక్కొని డిపెండెంట్ ఉద్యోగాలకు మంగళం పాడారు. మీ అందరికీ తెలుసు ఆ విషయం. డిపెండెంట్ ఉద్యోగాలు ఊడగొట్టిందేవరు..? ఆ పార్టీ యూనియన్లు ఐటక్, ఇంటక్ అని తిరుగతరు కదా..? వాళ్లే ఊడగొట్టారు. మళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరించుకున్నాం. 15 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చుకున్నాం. ఎవరైనా ఉద్యోగం తీసుకోకపోతే వారికి 25 లక్షల రూపాయాలు ఇస్తున్నాం. సింగరేణి కార్మికులు ఇల్లు కట్టుకుంటే 10 లక్షలు వడ్డీ లేని రుణం ఇస్తున్నాం. ఇలా అనేక సదుపాయాలు చేశాం అని కేసీఆర్ తెలిపారు.
సింగరేణి కార్మికులు పాపం దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్టు ఉంటరు. వాళ్లకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయమని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి మోదీకి ఎప్పుడో పంపించాం. ఆ మోదీ చేస్తలేదు. ఇక ఉల్టా మీరు బంద్ పెట్టండి అని అంటున్నరు. ఆస్ట్రేలియా నుంచి మా ఆదానీ బొగ్గు తెస్తుండు దాన్ని కొనండంటూ జబర్దస్తీ చేస్తుండు. బీజేపీ పార్టీ గురించి ఆలోచించాలి. 157 మెడికల్ కాలేజీలు పెడితే ఈ దేశంలో, మనకు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదు. నవోదయ పాఠశాలలు ప్రతి జిల్లాకు పెట్టాలని పార్లమెంట్ పాస్ చేసిన చట్టం ఉంది. ఆ చట్టాన్ని కూడా మోదీ ఉల్లంఘించారు. నవోదయ పాఠశాల, మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు తెలగాణకు ఎందుకు వేయాలి. వాళ్లు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు. బీజేపీకి ఓటేస్తే మోరీలో పారేసినట్టే. ఆ ఓట్లు దివాకర్ రావుకు వేస్తే మంచి పనులు జరుగుతాయి. రాష్ట్రానికి ఏం చేశారని ఓట్లు అడుగుతున్నరు అని కేసీఆర్ నిలదీశారు.
మొన్ననే సింగరేణి కార్మికులకు బోనస్, దసరా లాభాల్లో వాటా కానీ.. రూ. 1000 కోట్లు పంచినం. ప్రతి కార్మికుడికి లక్షా 80 వేలు, 2 లక్షలు వచ్చాయి. గతంలో 18, 19 శాతం ఇచ్చేటోళ్లు లాభాల్లో, కానీ ఇవాళ మనం 32 శాతం వాటా ఇచ్చాం. కార్మికుల హక్కులు కాపాడుతున్నాం. ఇవన్నీ మీ దృష్టిలో ఉన్నాయి. దివాకర్ రావు సౌమ్యుడు. మర్యాదపూర్వకంగా ఉండే మనిషి, అరాకిరి పనులు చేసే వ్యక్తి కాదు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించండి అని కేసీఆర్ కోరారు.