ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 11, 2020 , 01:32:15

ఎన్నారైలకు అభయం

ఎన్నారైలకు అభయం

  • ఆధార్‌ లేనివారికి పాస్‌పోర్ట్‌ లింక్‌
  • ఆన్‌లైన్‌లో వివరాలు చూసుకొనే వీలు

హైదరాబాద్‌,నమస్తే తెలంగాణ: విదేశాల్లో స్థిరపడ్డ భారతీయుల(ఎన్నారై) భూములకు రాష్ట్ర సర్కారు పూర్తి భద్రత కల్పిస్తున్నది. ఎన్నారైల భూములవైపు పరాయి వ్యక్తి తొంగి చూసే వీల్లేకుండా ధరణి పోర్టల్‌లో వారి భూములను ప్రత్యేకంగా నమోదు చేయాలని నిర్ణయించింది. ఆధార్‌ కార్డులు లేని ఎన్నారైలకు ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా కార్డు, పాస్‌పోర్ట్‌ లింక్‌ చేసి ధరణిలో అప్‌డేట్‌ చేస్తున్నారు. దీనివల్ల తాసిల్దార్‌ డిజిటల్‌ సంతకం పూర్తయి, క్లియర్‌టైటిల్‌ రికార్డులున్న భూముల్లా పోర్టల్‌లో కనిపిస్తాయి. ఈ భూముల వివరాలను ఎక్కడినుంచైనా చూసుకోవచ్చు. సదరు భూ యజమాని అనుమతి లేకుండా ఆ భూమిని ఎవ్వరూ అమ్మలేరు. ఆ భూములు వివరాలన్నీ ధరణిలోకి చేరాక లావాదేవీలను రైట్‌రాయల్‌గా నిర్వహించుకొనే అవకాశం కలుగుతుంది. రిజిస్ట్రేషన్‌ చట్టం ప్రకారం ఎవరైనా ఎన్నారై రిజిస్ట్రార్‌ కార్యాలయానికి రాలేకపోతే తనకు సంబంధించిన మరో వ్యక్తికి అథంటికేషన్‌ ఇచ్చి లావాదేవీలు నిర్వహించుకొనే సదుపాయాన్ని ధరణిలో కల్పించారు.