KCR | స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, ఆగస్టు 21, (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఏది చేసినా ఒక సంచలనం.. ఆయనకు ఇంకెవ్వరూ సాటిరారు.. పోటీలో లేరు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడం మొదలుకొని రెండు పర్యాయాలు రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకొని మూడోసారి హ్యాట్రిక్ కొట్టే దిశగా వేస్తున్న అడుగులు, ఎత్తుగడలను అంచనా వేయలేక విపక్షాలు, ప్రత్యర్థులు గిలగిలా కొట్టుకొంటున్నారు. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల గడువు ఉన్నది. షెడ్యూల్ విడుదల కాలేదు. నోటిఫికేషన్ వెలువడలేదు. అయినా ప్రతిపక్ష పార్టీల ఊహకు కూడా అందకుండా ఒకేసారి మొత్తం అభ్యర్థులను ప్రకటించి దమ్మున్న నాయకుడని కేసీఆర్ నిరూపించుకొన్నారు. ఇందులో కేవలం ఏడుగురు సిట్టింగ్‌లను మార్చడం, 4 సీట్లు పెండింగ్‌లో పెట్టడం పెద్దగా పరిగణనలోకి రాదు. రెండు స్థానాల నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండంతో మార్పు ఆరు సీట్ల కిందనే లెక్కకు వస్తున్నది. ఒకేసారి రాష్ట్రం మొత్తానికి అభ్యర్థులను.. పైగా సిట్టింగ్‌లకు టికెట్లు ప్రకటించడం చిన్న విషయం కాదు. ఏ పార్టీ కూడా ఇంతటి సాహసం చేయలేదు.
జాతీయ పార్టీ బీజేపీ సైతం గుజరాత్లో 45 మంది, కర్ణాటకలో 24 మంది సిట్టింగ్‌లను మార్చిన విషయం తెలిసిందే. పదేండ్ల బీఆర్ఎస్ పాలన పట్ల, ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేశాయి. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ దాదాపు సిట్టింగ్‌లు అందరికీ తిరిగి టికెట్లు ప్రకటించి ప్రతిపక్షాలను కంగు తినిపించారు. తన పాలన పట్ల, తాను చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఇది ఒకరకంగా ప్రజల నుంచి సీఎం కేసీఆర్ రెఫరెండమ్ కోరడమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మూడో దఫా ఎన్నికల్లో కూడా ఇంతటి సాహసాన్ని మరే పార్టీ ఇంతవరకు చేసిన దాఖలాలు లేవు. గత ఎన్నికల్లో ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించి 88 సీట్లు గెలిచిన సీఎం కేసీఆర్, ఈసారి అంతకంటే ఎక్కువ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం విశేషం. తమకే అధికారం అని కలలు కంటున్న ప్రతిపక్ష పార్టీలకు కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు.
సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే సిట్టింగ్‌లు అందరికీ టిక్కెట్లు ఇవ్వాలని, గజ్వేల్ నుంచి పోటీ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ సిట్టింగ్‌లు అందరికీ టికెట్లు ప్రకటించడమే కాకుండా గజ్వేల్ నుంచి తిరిగి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో రేవంత్‌కు దిమ్మతిరిగిపోయింది. ఏమి మాట్లాడాలో అర్థం కాక గజ్వేల్, కామారెడ్డి రెండు సీట్ల నుంచి కేసీఆర్ పోటీ చేయడం ఓటమి భయం వల్లనేనంటూ రేవంత్ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కేసీఆర్ ఇచ్చిన స్ట్రోక్‌కు కుదేలవుతున్నారు.