Ar Rahman | ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మరోసారి స్పందిస్తూ వివరణ ఇచ్చారు. తాజాగా ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనకు ఈ కాంట్రవర్సీపై ప్రశ్న ఎదురవగా మొదట మాట్లాడేందుకు నిరాకరించినప్పటికీ చివరికి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆ సంఘటనను మర్చిపోయి తాను జీవితంలో ముందుకు సాగిపోతున్నానని రెహమాన్ స్పష్టం చేశారు. జీవితంలో ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేలా ముందుగానే సిద్ధంగా ఉండాలని, కొన్ని విషయాల నుంచి త్వరగా బయటపడటం మంచిదని ఆయన పేర్కొన్నారు. “మనమేమిటో తెలిసినవారికి ప్రత్యేకంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ చెప్పినా వాళ్లు వినరు” అంటూ నవ్వుతూ చెప్పిన ఆయన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.
ఇదే విషయంపై ఇంతకుముందు కూడా స్పందించిన రెహమాన్, కొన్ని సందర్భాల్లో ఒకరి ఉద్దేశాలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని, ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని తెలిపారు. భారతదేశం తనకు గొప్ప స్పూర్తి అని, ఇండియానే తన ఇల్లు మరియు గురువని పేర్కొంటూ భారతీయుడిగా ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. సంగీతం అనేది దేశ సంస్కృతిని అనుసంధానించే ఒక పవిత్రమైన మార్గమని, దాన్ని ఎల్లప్పుడూ గౌరవంగా చూస్తానని సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా వెల్లడించారు. కాగా ఇటీవల ‘బీబీసీ ఏషియన్ నెట్వర్క్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మతపరమైన కోణం కారణంగా బాలీవుడ్లో అవకాశాలు తగ్గి ఉండొచ్చని, హిందీ సినీ పరిశ్రమలో నిర్ణయాధికారాలు క్రియేటివిటీ లేని వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయని ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా వాటిని తప్పుబట్టారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. అయితే తాజా ఇంటర్వ్యూలో రెహమాన్ ఇచ్చిన వివరణతో ఈ వివాదం కొంత శాంతించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.