CM KCR | ఖమ్మం హెడ్ క్వార్టర్లో ఉన్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. నెల రోజుల్లోనే ఇండ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల గురించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ స్థలం లేకుంటే ప్రభుత్వమే భూమిని సేకరించి జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తుందని ప్రకటించారు. ఫొటో జర్నలిస్టులు, కెమెరా జర్నలిస్టలందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు.
ఖమ్మం సభలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ” రాజకీయాలు జరుగుతుంటాయి. గెలుపు ఓటములు సహజం. కానీ భారత దేశం , భారత సమాజం లక్ష్యం ఏంటి.. భారతదేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందా.. దారి తప్పిందా.. బిత్తరపోయి గత్తర పడుతుందా.. ఏం జరుగుతా ఉంది ఈ దేశంలో.. ఈ విషయం మీద నా అంతరాత్మ అనేక రకాలుగా కలిచి వేస్తా ఉంది. అందరూ సీరియస్‌గా ఆలోచించాలి” అని పిలుపునిచ్చారు.
దేశంలో ఎవరిని అడుక్కునే అవసరం లేనటువంటి, ఏ ప్రపంచ బ్యాంకు తీసుకునే అవసరం లేనటువంటి .. ఏ అమెరికా కాళ్లు మొక్కాల్సిన అవసరం లేనటువంటి.. ఏ విదేశీయుల సహాయం అవసరం లేనటువంటి.. సహజ సంపద ఈ దేశ ప్రజల సొత్తు అని కేసీఆర్ అన్నారు. దేశంలో లక్షల కోట్ల కోట్ల ఆస్తి ఉందని, ఇదంతా ఏమైతుంది అని ప్రశ్నించారు. దేశంలో సంపద లేకుంటే బిక్షం ఎత్తుకుంటే తప్పులేదు. కానీ ఉండి మనం ఎందుకు యాచకులం కావాలని ప్రశ్నించారు.