CM KCR | కరీంనగర్ : రాబోయే కొద్ది రోజుల్లో తెలంగాణలో 24 గంటల పాటు నల్లా నీళ్లు ఉండే స్కీం ఏర్పాటు చేస్తున్నాం.. ఎప్పుడు తిప్పుకుంటే అప్పుడే నీళ్లు వచ్చేటట్టు, ఆ దిశగా పనులు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని గంగుల కమలాకర్‌కు మద్దతుగా ప్రసంగించారు.
గంగుల కమలాకర్ నేతృత్వంలో కరీంనగర్ పట్టణం ఎంతో సుందరంగా తయారైంది. కరీంనగర్ పట్టణం అని కాకుండా, కరీంనగర్ నరగం అని పిలవాలనిపిస్తోంది. గంగుల కమలాకర్ మొండి మనిషి, పట్టిన పట్టు విడవడు కాబట్టి వెంటపడి ఆ మానేరు రివర్ పంట్ర్ కట్టిస్తున్నాడు. కరీంనగర్లో చౌరస్తాలు, రోడ్లు, సందులు అద్భుతంగా తయారయ్యాయి. అద్దంలో చూపించిన స్పష్టమైన తేడా కనబడుతుంది. ప్రజల యెడల అభిమానం ఉండి, పని చేసే ప్రభుత్వం ఉంటే, అభివృద్ధి ఎలా ఉంటుందో దానికి కరీంనగర్ అభివృద్ధి నిదర్శనం అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఒకసారి మానేరు రివర్ ఫ్రంట్ పూర్తయితే కరీంనగర్ పట్టణం పర్యాటక ప్రాంతంగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సందర్శకులు వస్తున్నారు రూ. 410 కోట్లతో ముమ్మురంగా పనులు జరుగుతున్నాయి. మానేరు మునుపు ఎలా ఉండేనో ఆలోచించాలి. నెత్తి మీద డ్యాం ఉన్న కరీంనగర్‌కు నీళ్లు రాని పరిస్థితి. ఇవాళ ప్రతి రోజులు నీళ్లు వస్తున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో తెలంగాణలో 24 గంటల పాటు నల్లా నీళ్లు ఉండే స్కీం ఏర్పాటు చేస్తున్నాం. ఎప్పుడు తిప్పుకుంటే అప్పుడే వచ్చేటట్టు ఆ దిశగా పనులు జరుగుతున్నాయి. ఒక రూపాయికి నల్లా కనెక్షన్ ఎవడైనా ఇచ్చిండా..? ఇవాళ ఒకటే రూపాయికి నల్లా కనెక్షన్ ఇవ్వడంతో, మహిళలు బిందెలు పట్టుకుని బజారుకు రావడం లేదు. ఇవాళ బ్రహ్మాండంగా నీళ్లు వస్తున్నాయి. ఇది అభివృద్ధి కాదా..? ఇవన్నీ ఆలోచించాలి. ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకురావడానికి ఇవి తొలి అడుగులు అని కేసీఆర్ స్పష్టం చేశారు.