హైదరాబాద్, జనవరి15 (నమస్తే తెలంగాణ): అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న గోదావరి-బనకచర్ల (జీబీ) లింక్‌పై అభ్యంతరాలను తెలుపుతూ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రికి, ఏపీ సీఎం చంద్రబాబుకు, గోదావరి, కృష్ణా రివర్ బోర్డులకు లేఖలే రాయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన నీటి వాటాల కోసం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ వద్ద బలమైన వాదనలు వినిపించాలని ఇరిగేషన్ శాఖ ఇంటర్‌స్టేట్ అధికారులను సీఎం ఆదేశించారు. గురువారం నుంచి ట్రిబ్యునల్ విచారణ జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ వెళ్లిన ఇంటర్‌స్టేట్ అధికారులతో ముఖ్యమంత్రి బుధవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ట్రిబ్యునల్‌కు నివేదించాల్సిన అంశాలపై సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఇరిగేషన్ ఉన్నతాధికారులు, న్యాయవాదులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా జలాల్లో జరిగిన అన్యాయాన్ని సహేతుకంగా ట్రిబ్యునల్‌కు వివరించాలని సూచించారు. బేసిన్‌లోని తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన నీటి వాటా కోసం బలమైన వాదనలు వినిపించాలని ఆదేశించారు.
ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాలను తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య పునఃపంపిణీ చేసే అంశంపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట గురువారం నుంచి వాదనలు కొనసాగనున్నాయి. సెక్షన్ 3 కింద కృష్ణా జలాలను పంపిణీచేయాలని కృష్ణా జల వివాద ట్రిబ్యునల్-2కి గత అక్టోబర్‌లోనే కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఉమ్మడి ఏపీకి కేటాయించిన జలాలను ఇరు రాష్ర్టాల మధ్య పునఃపంపిణీ చేయాలని, గోదావరి డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీల అంశాన్ని కూడా తేల్చాలని ట్రిబ్యునల్‌కు సిఫారసు చేసింది. నూతన మార్గదర్శకాల ప్రకారం.. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్-2 ఇప్పటికే విచారణ ప్రారంభించింది. ఇరు రాష్ర్టాల నుంచి స్టేట్మెంట్ ఆఫ్ కేస్ (ఎస్వోసీ)లను స్వీకరించింది. విచారణ అంశాల జాబితాను కూడా ట్రిబ్యునల్ ఖరారు చేసింది. గురువారం నుంచి ఆయా అంశాలవారీగా ట్రిబ్యునల్ విచారణ చేపట్టనున్నది.