Chandrababu Naidu | హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ ): ఆంధ్రప్రదేశ్ ఒకవైపు ఎడాపెడా ఎగువన, దిగువన కృష్ణా జలాలను ఇష్టారాజ్యంగా మళ్లించింది. ఇప్పటికీ యథేచ్ఛగా పెన్నా బేసిన్‌కు తరలిస్తున్నది. తాత్కాలిక కోటాకు మించి ఇప్పటికే జలాలను వినియోగించుకున్నది. కానీ ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు మాత్రం వృథా జలాలనే తరలిస్తున్నామని, సున్నితమైన అంశంపై రాజకీయాలు తగవంటూ చిలుక పలుకులు పలుకుతున్నారు. బేసిన్ చివరలో ఉన్నామని, వృథాగా పోయే జలాలను మళ్లిస్తున్నామంటూ బుకాయించడం గమనార్హం. ఈ ఏడాది కృష్ణా నుంచి 850 టీఎంసీలకుపైగా సముద్రంలో కలిశాయి. అవిపోను దాదాపు 1,010 టీఎంసీలు ఇరు రాష్ర్టాలు వినియోగించుకునేందుకు అందుబాటులోకి వచ్చాయి. తాత్కాలిక కోటా ప్రకారం అనుకున్న మేరకు జలాలను ఏపీ మళ్లించుకున్నది. అటు పెన్నా బేసిన్లో దాదాపు 350 టీఎంసీలను నిల్వ చేసుకున్నది. దిగువన పులిచింతల, ప్రకాశం బరాజ్‌లోనూ దాదాపు 50 టీఎంసీలకుపైగా నీటినిల్వలున్నాయి. అయినప్పటికీ ఇప్పటికీ ఉమ్మడి రిజర్వాయర్లలో జలాల్లో వాటా కోరుతున్నది.
ఇదెక్కడి అన్యాయమని, తెలంగాణ రైతాంగానికి తీరని నష్టం వాటిల్లుతుందని ప్రశ్నించగానే, ఇది సున్నితమైన అంశం అంటూ సన్నాయి నొక్కులు నొక్కతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నిరాటంకంగా జలదోపిడీకి పాల్పడి, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీయడమే గాక వాటిపై రాజకీయాలు తగవంటూ చంద్రబాబు చిలుకపలుకులు పలకడం ఇప్పుడు తెలంగాణ నీటిరంగ నిపుణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నది. ఈ ఏడాది ఏపీ చేసిన జలదోపిడీని గణాంకాలతో సహా మాజీ మంత్రి హరీశ్‌రావు బట్టబయలు చేశారు. తెలంగాణ రైతాంగం పక్షాన ఏపీని, ఇటు కాంగ్రెస్ సర్కారును సైతం నిలదీశారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తే ఊరుకునేది లేదని తేగేసి చెప్పారు. ఈ అంశంపై ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు స్పందిస్తూ.. నీరు వంటి సున్నితమైన అంశాలపై రాజకీయలు చేయడం సరికాదంటూ మాట్లాడటం గమనార్హం. తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ర్టాలు కూడా గోదావరి జలాలను ఉపయోగించుకోవాలని, కృష్ణా జలాల విషయంలోనే కొంత సమస్య ఉన్నదని చంద్రబాబు వివరించారు.
కోటా మేరకే ఏపీ జలాలను ఉపయోగించుకుంటున్నదని వెల్లడించారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నది. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీయం, రైతాంగానికి తాగునీరు, సాగునీరు లేకుండా చేయడం సున్నితమైన అంశం కాదా? జలదోపిడీని ప్రశ్నించవద్దా? అంటూ నీటిరంగనిపుణులు మండిపడుతున్నారు. ప్రాజెక్టులన్నీ నిండి పొంగిపొర్లుతున్న సమయంలో నీటిని మళ్లించవచ్చని, కానీ ప్రస్తుతం కృష్ణాలో ప్రవాహాలేవీ లేని సమయంలోనూ ఇష్టారాజ్యంగా నీటిని మళ్లిస్తూ, మరోవైపు వృథా జలాలు అంటూ మాట్లాడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. జలదోపిడీకి పాల్పడుతూ, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తూ, ఆ అన్యాయాన్ని నిలదీస్తే రాజకీయాలు తగవంటూ సుద్దులు చెప్పడమే విడ్డూరంగా మారిందని నీటిరంగనిపుణులు విమర్శిస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాలను ప్రశ్నించవద్దా? అన్యాయం చేస్తున్నా చూస్తూ ఊరుకోవాలా? ఏపీ జలదోపిడీకి హారతులు పట్టాలా? అని తెలంగాణ నీటిరంగ నిపుణులు నిలదీస్తున్నారు.