కారేపల్లి, మార్చి 1: కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తున్నదని కారేపల్లి అఖిలపక్ష నాయకులు విమర్శించారు. గూడు కోల్పోయిన పేదలకు అండగా నిలుస్తున్న విపక్ష నేతలపై కేసులు పెట్టడం, వారిని భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్గమని అన్నారు. ఖమ్మం భూదాన్ భూముల్లో పేదల ఇండ్ల కూల్చివేతలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులదే బాధ్యత అని స్పష్టంచేశారు. భూదాన్ భూముల్లో పేదల ఇండ్ల కూల్చివేతలను నిరసిస్తూ ఆదివారం ఖమ్మం జిల్లా కారేపల్లిలో అఖిలపక్ష నాయకులు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. రెకాడితేగానీ డొకాడని పేదల కష్టార్జితాన్ని నేలమట్టం చేయడం దారుణమని అన్నారు.