హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగ స్ఫూర్తికి, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. సోమవారం అసెంబ్లీలో కేంద్ర విద్యుత్తు బిల్లు-పర్యవసానాలపై లఘుచర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా తీసుకొస్తున్న ఈ బిల్లును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు సంస్థలను, నవరత్నాల్లాంటి పరిశ్రమలను సృష్టిస్తే.. నేడు కేం ద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వాటిని అమ్మేస్తున్నదని విమర్శించారు. ఎయిర్‌పోర్టులు, రైళ్లు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, ఎల్ఐసీ, ఇలా పబ్లిక్ సెక్టార్లను ఒక్కొక్కటిగా ప్రైవేటుపరం చేస్తున్నారని, ఒకరిద్దరు బడా పెట్టుబడిదారుల కోసం లాభాల్లో ఉన్న సంస్థలను తెగనమ్మేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. మరోవైపు సంక్షేమ పథకాలను రద్దు చేసేందుకు బీజేపీ సర్కారు కుట్ర పన్నుతున్నదని మండిపడ్డారు.
బీజేపీ అధికారంలో ఉన్న ఈ 8 ఏండ్లలో బడాబాబులు చేసిన 12 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను రద్దు చేసిందని, మరోవైపు దేశంలో తినడానికి తిండి లేని కోట్లాదిమంది ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడాన్ని మాత్రం మోదీ ప్రభుత్వం తప్పుపడుతున్నదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ‘మాట్లాడితే డబుల్ ఇంజిన్ అంటారు.. రా ష్ట్రంలో మీ పార్టీ ఉంటేనే అభివృద్ధా?.. లేదం టే లేదా? దేశంలో బహుళ పార్టీలు ఉండకూడదా?’ అని ఆయన ప్రశ్నించారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం అమలు చేయ డం లేదని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ లాంటి హామీలను నేటికీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పైగా యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్‌కు మంజూరు చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్టునూ మోదీ సర్కారు రద్దు చేసిందని చెప్పారు. తె లంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్న కేంద్రం.. రూ.6,576 కోట్ల బకాయిలను నెలరోజుల్లో చెల్లించాలంటూ ఆదేశాలివ్వడం ఎవరిని బెదిరించడానికని సీఎల్పీ నేత నిలదీశారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రాష్ర్టానికి వచ్చిన తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘రేషన్‌షాపుల వద్దకు వచ్చి మోదీ ఫొటో ఏదని ప్రశ్నించడం ఏమిటి? కలెక్టర్‌ను పట్టుకుని రాష్ట్రం, కేంద్రం ఎంతెంత ఇస్తున్నాయని అడుగుతారా? ఆయనకేం సంబంధం? రేషన్ పంపిణీ సక్రమంగా జరిగేలా చూడడమే ఆయ న విధి. ఆర్థికమంత్రికి ఆ మాత్రం తెలీదా? ఆ ప్రశ్న.. అన్ని రాష్ర్టాల సీఎస్‌లను పిలిచి సమావేశం పెట్టి.. కేంద్రం వాటా, రాష్ట్రం వాటా మాట్లాడాలి కానీ, కలెక్టర్‌ను ఇబ్బంది పెట్టడం ఏమిటి? పైగా మోదీ ఫొటో పెట్టకపోతే, మావాళ్లు వచ్చి పెడుతారని కేంద్ర ఆర్థికమంత్రి చెప్పారు. మీ వాళ్లు అంటే మీ పార్టీ కార్యకర్తలా? మీరు కేంద్రమంత్రిగా తనిఖీ చేశారా లేక పార్టీ నేతగా వచ్చారా?’ అని విక్రమార్క ప్రశ్నించారు.
గొప్పగా సెప్టెంబర్ 17 ఉత్సవాలు
1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ స్టేట్ ప్రజలకు స్వాతంత్య్రం వచ్చిందని, ఆరోజున వేడుకలు జరుపాలని భట్టి విక్రమార్క చెప్పా రు. ఈ వేడుకలను గౌరవంగా, గర్వకారణంగా జరుపుకోవాలి కానీ గాయపడేలా కాదని ఆయ న హితవు పలికారు. ఢిల్లీ పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలన్నారు.
కేంద్రం ప్రజలకు శత్రువులా మారింది: అహ్మద్ బలాల
కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలకు శత్రువుగా మారిందని ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాల అన్నారు. రైతులు, పేదలకు వ్యతిరేకంగా తీసుకువస్తున్న విద్యుత్తు బిల్లుకు వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాడాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యుత్తు రంగంలో అనేక మార్పులు వచ్చాయని, రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నారని చెప్పారు. దోబీఘాట్లకు, సెలూన్లకు 250 యూనిట్ల వరకు, దళితులకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నదని వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజావ్యతిరేక బిల్లుకు నిరసనగా తెలంగాణ తరహాలోనే దేశంలో అన్ని రాష్ట్రాలూ పోరాడాలని ఆయన కోరారు.