హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : బడ్జెట్ పెంచకుండా, టీచర్ పోస్టులు భర్తీచేయకుండా స్కూళ్లను క్రమంగా నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే రాష్ట్రంలోని 1,441 బడులను జీరో ఎన్రోల్మెంట్ కారణంగా మూసివేసిన సర్కార్ మరో 640 పాఠశాలలను సైతం త్వరలోనే క్లోజ్ చేయాలని నిర్ణయించింది. మొత్తంగా ఈ విద్యాసంవత్సరంలోనే 2 వేలకు పైగా పాఠశాలలను సర్కార్ మూసివేయడమే కాకుండా ఆయా పాఠశాలల్లోని ఫర్నిచర్, సామగ్రిని సమీపంలోని అంగన్వాడీ కేంద్రాలు ఉపయోగించుకునేందుకు సైతం ఇప్పటికే విద్యాశాఖ అనుమతి ఇవ్వడం గమనార్హం. రాష్ట్రంలో 26వేల కు పైగా సర్కారు స్కూళ్లున్నాయి. 2024 -25 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో 2,081 జీరోఎన్రోల్మెంట్ పాఠశాలలు ఉన్నట్టు తేలగా, ప్రస్తుతానికి 1,441 స్కూళ్లను మూ సేయడంతో వాటిసంఖ్య 24,600కు పడిపోయింది.
ఇప్పుడు మిగిలిన 640 స్కూళ్లనూ క్లోజ్ చేస్తే ఆ సంఖ్య 24 వేలలోపే పరిమితం కానున్నది. కాగా, జీరోస్కూళ్లకు ఇప్పటికే టీచర్ల కేటాయింపు లేకపోవడం, పోస్టులను రద్దు చేయడం చూస్తుంటే కాం గ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక ప్రకారమే అంపశయ్య పై చేర్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తున్నది. చివరకు ఆయా పాఠశాలల్లోని సిబ్బందికి జీతాలను క్లెయిమ్ చేయడం లేదు. కాగా, విద్యార్థులు లేని 640 బడుల్లో 625 మంది టీచర్లు ఉండగా వారిని డిప్యుటేషన్‌పై ఇతర స్కూళ్లకు పంపించారు. టీచర్లు లేకపోవడం లో విద్యార్థులు రావడం లేదు కానీ, జీ తాలు మాత్రం పాతస్కూళ్ల నుంచే క్లెయిమ్ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో వీటిని క్లోజ్ చేయడం లాంఛనమే.
అపఖ్యాతి
దేశంలోజీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లు అ త్యధికంగా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ టాప్‌లో ఉండగా, తర్వాత పశ్చిమబెంగాల్ ఉన్నట్టు ఇటీవలే పార్లమెంట్లో కేంద్ర సర్కార్ ప్రకటించింది. పార్లమెంట్ సాక్షిగా జీరో ఎన్రోల్మెంట్లో అపఖ్యాతి పాలైన రాష్ట్రం దాన్నుంచి బయటపడేందుకు వాటిని మూసివేయాలని నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు విద్యాశాఖ మూసేసిన బడులను యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ (యూ డైస్) నివేదికలో చూపించొద్దని కూడా నిర్ణయించింది.
జిల్లాల వారీగా మూతబడిన బడుల వివరాలు
నల్లగొండ (315), మహబూబాబాద్ (167) వరంగల్ (135), రంగారెడ్డి (99), సూర్యాపేట (94) సిద్దిపేట (84) నాగర్‌కర్నూల్ (81), ఆదిలాబాద్ (42), భదాద్రి కొత్తగూడెం(14), హనుమకొండ (41), హైదరాబాద్ (20), జగిత్యాల (60), జనగామ (70), జయశంకర్భూపాలపల్లి (38), జోగుళాంబ గద్వాల (10), కామారెడ్డి (48), కరీంనగర్ (51), ఖమ్మం (65), కుమ్రం భీం ఆసిఫాబాద్ (65), మహబూబ్‌నగర్ (53), మంచిర్యాల(35),మెదక్ (27), మే డ్చల్ మల్కాజిగిరి (11), ములుగు (54), నారాయణపేట(37), నిర్మల్ (48), నిజామాబాద్(38), పెద్దపల్లి (33), రాజన్నసిరిసిల్ల(26), సంగారెడ్డి (56), వికారాబాద్ (66), వనపర్తి (33), యాదాద్రిభువనగిరి (65).
అప్పర్ ప్రైమరీ స్కూళ్లు కూడా
రాష్ట్రంలో అప్పర్ ప్రైమరీ స్కూళ్లు కూడా మూసే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఏకంగా 3,144 స్కూళ్లు కనుమరుగుకాబోతున్నాయి. ఈ స్కూళ్లను సమీపంలోని బడుల్లో విలీనం చేసే అంశంపై ఏడాది కిందట నిర్వహించిన విద్యాసంస్కరణల క్యాబినెట్ సమావేశంలో చర్చించి ఆ బడుల విలీనంపై నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఇటు 2వేల జీరో ఎన్రోల్మెంట్ బడులు, అటు అప్పర్ ప్రైమరీ స్కూళ్లు మొత్తంగా కలిపి 5 వేలకు పైగా పాఠశాలలు కాలగర్భంలో కలిసిపోనున్నాయి. ఇటీవలే తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ -2047లోను ఒకే ప్రాంగణంలోని స్కూళ్లను ఒకే గొడుగు కిందికి తెస్తామని సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే. అంటే ఒకే ప్రాంగణంలో ఉన్న ప్రాథమిక, ప్రాథమిక ఉన్నత పాఠశాలలను విలీనం చేస్తామని డైరెక్ట్‌గానే చెప్పారు. దీంతో మరికొన్ని స్కూళ్లు కనుమరుగుకానున్నాయి. మొత్తంగా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో సర్కారు స్కూళ్లను ఖతం పట్టించడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. సర్కారు బడులు మూసివేయబోమని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లపై కొన్ని ఎన్జీవోలు కోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు విచారణ జరపగా, అప్పట్లో విద్యాశాఖ స్పెషల్ సీఎస్‌గా ఉన్న రంజివ్ఆచార్య జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లను మూసివేయమని కోర్టుకు చెప్పడమే కాకుండా అఫిడవిట్ కూడా సమర్పించారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పాలనలో స్కూళ్ల మూసివేత జరగలే లేదని, ఇప్పుడు విరుద్ధంగా జరుగుతున్నదని పలువురు మండిపడుతున్నారు.
మూసివేయడం ఇదే తొలిసారి
గతంలో కేవలం రేషనలైజేషన్ ద్వారా మాత్రమే టీచర్లను సర్దుబాటు చేశారు. ఇదే విషయమై ఉపాధ్యాయ సంఘాలూ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఒకేసారి 1,441 స్కూళ్లను మూసివేయడం, కాంగ్రెస్ సర్కారు వచ్చాకే జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్ల సంఖ్య పెరిగిందని ఆందోళన వెలిబుచ్చుతున్నారు. కాగా, 2023 జనవరిలో స్కూళ్ల సంఖ్య 1,307 ఉండగా, 2024 నాటికి ఆ సంఖ్య 1,745కు చేరి తర్వాత 1,960కు పెరిగి 2024 -25 విద్యాసంవత్సరానికి ఆ సంఖ్య 2,081 అయ్యింది. అంటే రెండేండ్లలో జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లు 700లకు పైగా పెరిగాయి.