హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ర్టాల సరిహద్దులు పోలింగ్ తేదీకి ముందే మూసివేయాలని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ ఆదేశించారు. గురువారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ర్టాల సీఎస్‌లు, డీజీపీలతో వర్చువల్‌గా మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలపై అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులను ఆయన సూచించారు. ఎన్నికలు జరుగనున్న రాష్ర్టాల్లో ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ తెలంగాణలో జరుగబోయే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని, శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో నిఘా పెంచామని, దీని ఫలితంగా రూ.385 కోట్ల మేర నగదు జప్తు చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 17 సరిహద్దు జిల్లాల్లో 166 సరిహద్దు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సరిహద్దు రాష్ర్టాలతో సమన్వయం కోసం డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. 28వ తేదీ నుంచి పోలింగ్ జరిగే 30వ తేదీ వరకు రాష్ట్రంలో డ్రైడేగా ప్రకటించినట్టు చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా ప్రశాంతంగా ఉన్నాయని, సాధారణ నేర కార్యకలాపాలు కూడా తగ్గుముఖం పట్టాయని డీజీపీ అంజనీకుమార్ వివరించారు. ఈ వీసీలో తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్, ఎక్సైజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్‌శర్మ, అదనపు సీఈవో లోకేశ్ కుమార్, జాయింట్ సీఈవో సర్ఫరాజ్ అహ్మద్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్, హోం ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్, అదనపు డీజీ మహేశ్ భగవత్, జీఏడీ సెక్రటరీ వీ శేషాద్రి, సీఆర్పీఎఫ్ ఐజీ చారు సిన్హా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.