Congress | హైదరాబాద్, నవంబర్29(నమస్తే తెలంగాణ): ఖమ్మం జిల్లాలో అసలు కాంగ్రెస్, వలస కాంగ్రెస్ బ్యాచ్‌ల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందని, వీరి గొడవలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి మూలనపడిందని పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆందోళన చెందుతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవరూ ఊహించని విధంగా ఒక్క ఖమ్మం జిల్లాకే మూడు మంత్రి పదవులు దక్కాయి. ముగ్గురూ కలిసి జిల్లాను గొప్పగా అభివృద్ధి చేస్తారని ప్రజలు భావించారు. అయితే, అభివృద్ధి మాట అటుంచి, నేతల మధ్య సర్దుబాటు చేయలేనంత అంతరం ఏర్పడిందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముగ్గురు మంత్రులు మూడు ప్రాంతాలపై దృష్టి పెట్టి తలా ఓ పని చేపట్టినా జిల్లా ఇప్పటికే కండ్లు చెదిరే స్థాయిలో అభివృద్ధి చెంది ఉండేదని చెప్తున్నారు. మంత్రులకు క్యాంపు కార్యాలయాలపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 99 శాతం పూర్తి చేసిన సీతారామ ప్రాజెక్టుకు పైపై మెరుగులు దిద్ది 100 శాతం పూర్తి చేసినట్టు చెప్పుకుంటున్నారని, ఇది తప్పితే చెప్పుకునేందుకు ఏమీ లేదని విమర్శిస్తున్నారు. వలస కాంగ్రెస్ నేతలు.. వలస కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు, అసలు కాంగ్రెస్ నేత.. అసలు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు మాత్రమే అపాయిమెంట్స్ ఇస్తున్నారని, ఉమ్మడిగా కలిపి ఫ్లెక్సీలు కూడా వేసుకునే పరిస్థితి లేకుండా పోయిందని అంటున్నారు. ఖమ్మం పట్టణంలో ముగ్గురు మంత్రులు మూడు క్యాంపులు పెట్టుకొని వ్యవహారాలు చక్కదిద్దుకుంటున్నారని, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ఆరోపిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో చిన్నా పెద్దా నామినేటెడ్ పదవులు 125 నుంచి 150 వరకు ఉన్నాయి. ముగ్గురు నేతల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ఇవి భర్తీ కావడం లేదు. దీంతో దిగువశ్రేణి నాయకత్వంలో ఆవేదన కనిపిస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో భద్రాచలం రామయ్య ఆలయాన్ని ప్రత్యేక అధికారితోనే అభివృద్ధి చేసి, దేవాలయ కార్యకలాపాలు నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దేవస్థానానికి ప్రత్యేక బోర్డు నియమిస్తామని హామీ ఇచ్చారు. దీంతో నేతలు చైర్మన్ పదవి మీద, బోర్డు సభ్యుల పదవుల మీద ఆశలు పెట్టుకున్నారు. భద్రాచలంతో పాటు మరో 16 దేవస్థానాలు ఉన్నాయి. వీటికి కూడా ఇప్పటి వరకు పాలక బోర్డులు లేవు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. వీటిలో ఖమ్మం మార్కెట్ అతి పెద్దది.
మార్కెట్ కమిటీల పాలక మండళ్ల కార్యవర్గాన్ని నియమిస్తారని మూడు నెలలుగా ప్రచారం జరుగుతున్నది. కానీ ఇప్పటి వరకు అడుగు ముందుకు పడలేదని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మూడు నియోజకవర్గాలకు పరిమితమైన సుడా( స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ)ను కాంగ్రెస్ ప్రభుత్వం 5 నియోజకవర్గాలకు విస్తరించింది. సుడా ఛైర్మన్ పదవి మీద పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆశలు పెట్టుకున్నది. కీలకమైన భద్రాచలం ట్రస్టు బోర్డు, సుడా, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను మగ్గురు మంత్రులు తమ బంధుగణానికి ఇవ్వాలని పట్టుబడుతుండటంతో ఇవి వాయిదా పడుతూ వస్తున్నాయని జిల్లా నాయకత్వం ఆవేదన వ్యక్తం చేస్తున్నది. పార్టీ జెండాలు మోసి, వారిని గెలిపించేందుకు తాము కావాలని కానీ, పదవుల పంపకాలకు వచ్చేసరికి బంధువులకు కట్టబెట్టాలని చూస్తున్నారని పార్టీ సీనియర్ కార్యకర్త ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లాలో నేతల మధ్య గ్రూప్ రాజకీయాలు మొదటి నుంచి ఉన్నాయని, అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీని గెలిపించామని కార్యకర్తలు చెప్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 10 నియోజక వర్గాలు ఉంటే 9 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీని గెలపించామని అంటున్నారు. ముగ్గురు మంత్రులూ వారి బంధువులకు, రక్త సంబంధికులేకే అధికార పెత్తనాన్ని అప్పగించారని ఖమ్మం పట్టణానికి చెందిన దిగువ శ్రేణి నాయకుడు ‘నమస్తే తెలంగాణ’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, అధికారులు విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ముగ్గురు మంత్రులు జిల్లాలో ఉన్నప్పుడు ఎవరి ప్రొటోకాల్ ప్రకారం విధులు నిర్వర్తించాలో తెలియడం లేదని తలలు పట్టుకుంటున్నారు.