హనుమకొండ, ఆగస్టు 24: హనుమకొండలో బీజేపీ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ముట్టడి పేరుతో గూండాయిజానికి దిగారు. బీఆర్ఎస్ శ్రేణులను రెచ్చగొట్టి.. రాళ్లు, కట్టెలతో దాడి చేసి స్థానిక ఎస్సై సహా పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను గాయపర్చారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం.. హనుమకొండలో డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలన్న డిమాండ్‌తో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో బీజేపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు గురువారం హనుమకొండ బాలసముద్రంలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు.
ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా.. పోలీసులు క్యాంపు ఆఫీసు పరిసరాల్లో ముళ్లకంచెతోపాటు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా.. బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టారు. పోలీసులు వారిస్తున్నా వినకుండా ఘర్షణ వాతావరణం సృష్టించారు. రాళ్లు రువ్వుతూ, కట్టెలతో బీఆర్ఎస్ నాయకులపై దాడి చేశారు. బందోబస్తులో ఉన్న పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో బీజేపీ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగి.. హనుమకొండ ఎస్సై సతీశ్ సహా పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్‌రెడ్డితోపాటు పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.