హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ (Congress) పాలనలో తెలంగాణ (Telangna) రాష్ట్ర రాబడి తిరోగమనంలో పయనిస్తున్నది. రేవంత్రెడ్డి (Revanth Reddy) ముఖ్యమంత్రిగా పాలన పగ్గాలు చేపట్టి రెండేండ్లయినా.. రాష్ట్ర ఆదాయ వనరులు పెరగడం లేదు. బడ్జెట్ ప్రతిపాదనలకు అనుగుణంగా రాష్ట్ర ఖజానాకు నిధులు రావడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం గడిచిన ఏడు నెలల్లో ఆదాయ లక్ష్యం.. 41.16 శాతమే చేరింది. 2024-25లో ఇదే కాలానికి ఇంతకంటే తక్కువగా ఆదాయం సమకూరింది. ఇదే తొలి ఏడు నెలల కాలానికి కేసీఆర్ పాలనలో 2022-23లో 43.78 శాతం, 2023-24లో ఇదే కాలానికి 46.07 శాతం రెవెన్యూ రాబడులు వచ్చాయి. పెరిగిన బడ్జెట్ ప్రతిపాదనలకు అనుగుణంగా సొంత ఆదాయ వనరులైన పన్ను రాబడులు పెరగాల్సింది పోయి… తరిగిపోతున్నాయి. ఈ విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) తాజాగా విడుదల చేసిన అక్టోబర్ నెల రాష్ట్ర ఆదాయ- వ్యయాల రిపోర్టు వెల్లడించింది. కాగ్ గణాంకాల ప్రకారం.. సొంత ఆదాయ వనరులుగా పేర్కొనే జీఎస్టీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ల్యాండ్ రెవెన్యూ, వ్యాట్/సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, ఆదాయ పన్ను, వృత్తి పన్ను వంటి ఇతరాలు కూడా తగ్గాయి.
ప్రస్తుత (2025-26) ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ ఆదాయం రూ.2,29,720.62 కోట్లు వస్తుందని అంచనా వేయగా, అక్టోబర్ నాటికి రూ.94,555.97 కోట్లు అంటే 41.16 శాతమే వచ్చింది. అదే కేసీఆర్ పాలనలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ ఆదాయం రూ. 2,16,566.97 కోట్లు వస్తుందని ప్రతిపాదించగా, అక్టోబర్నాటికి రూ.99,775.12 కోట్లు అంటే 46.07 శాతం వచ్చింది. రాష్ర్టానికి వచ్చే మొత్తం ఆదాయం కూడా 2023-24లో అక్టోబర్ నాటికి 51.25 శాతం ఉంటే, ఇదే కాలానికి 2024-25లో 45.97 శాతం, 2025-26లో 50.95 మాత్రమే సమకూరింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా, సొంత ఆదాయ వనరులను పెంచుకోవడంలో విఫలమైంది. హైడ్రా, ఫ్యూచర్ సిటీ, మెట్రో రద్దు వంటి నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిపోవడంతోపాటు రాష్ట్ర సొంత ఆదాయాలు తగ్గిపోయాయి. కేసీఆర్ పదేండ్ల పాలనలో సొంత ఆదాయ రాబడిలో ముందువరుసలో ఉన్న తె లంగాణ.. కాంగ్రెస్ పాలనలో దిగజారిపోతున్నది.
సొంత ఆదాయాన్ని పెంచుకోవడంలో విఫలమైన రేవంత్రెడ్డి సర్కారు.. వ్యయ సర్దుబాటు కోసం భారీగా రుణ సమీకరణ చేస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో బడ్జెట్లో ప్రతిపాదించిన ఆదాయ లక్ష్యంలో 41.16 శాతానికి మాత్రమే చేరింది. కానీ, రుణ సమీకరణలో మాత్రం సుమారు 94 శాతానికి వచ్చింది. బడ్జెట్ ప్రకారం.. రాష్ట్ర అదాయ లక్ష్యంలో రూ.94,555.97 కోట్లు (41.16 శాతం) సమకూర్చుకున్నది. అలాగే అప్పుల లక్ష్యం రూ.54009.74 కోట్లుకాగా, అక్టోబర్ నాటికే రూ.50,541.22 కోట్లు అంటే 93.58 శాతం సాధించింది. గత ఏడాది ఇదే కాలానికి 71.30 శాతమే రుణ సమీకరణ చేసింది. అంటే దాదాపు 22 శాతానికిపైగా అప్పులు తీసుకున్నది. ఆదాయం, వ్యయం మధ్య అంతరాన్ని భర్తీ చేసేందుకు రేవంత్ సర్కారు అప్పులపై ఆధార పడుతున్నది.
