హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా తడిసిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకున్నట్టు పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో 1.28 లక్షల టన్నుల తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్‌గా మార్చేందుకు ఆదేశాలు జారీచేశామని వెల్లడించారు. సోమవారం ధాన్యం కొనుగోలుపై నూతన సచివాలయంలో ఆయన తొలి సమీక్ష నిర్వహించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వేగంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులెవరూ ఆందోళన చెందొద్దని, తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. జోరు వానల్లోనూ వేగంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు 5 వేల కేంద్రాలను ప్రారంభించి 40 వేల మంది రైతుల నుంచి 7.51 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు వివరించారు.