హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : ఈ సీజన్ ధాన్యం కొనుగోళ్లలో లక్ష్యం కొండంత ఉంటే.. పౌరసరఫరాల సంస్థ ఇప్పటి వరకు కొనుగోలు చేసింది కొసరంత మాత్రమే. 70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ ఇప్పటి వరకు 26 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. ఇది లక్ష్యంలో మూడో వంతు మాత్రమే కావడం గమనార్హం. ధాన్యం కొనుగోళ్లలో పౌరసరఫరాల సంస్థ నిర్లక్ష్యానికి ఈ అంకెలే నిదర్శనం. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్ల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వాస్తవానికి ఈ సీజన్లో 127 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వయంగా వెల్లడించారు. అయితే సివిల్‌సైప్లె శాఖ మాత్రం 70 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నది. అంటే ఇంకా 57 లక్షల టన్నుల ధాన్యం రైతులు ఎక్కడ అమ్ముకోవాలి, ఎలా అమ్ముకోవాలనేది ప్రశ్నార్థకం. ఇదిలా ఉంటే కనీసం పెట్టుకున్న లక్ష్యాన్ని అయినా చేరుతుందా? లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో మార్చి 20 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అంటే ఇప్పటికే నెలన్నర గడుస్తున్నది. మరో నెల మాత్రమే ధాన్యం కొనుగోలుకు అవకాశం ఉంది. గడిచిన నెలన్నరలో కొనుగోలు చేసింది 26 లక్షలే.. దీంతో లక్ష్యం చేరాలంటే మిగిలిన నెల రోజుల్లో 44 లక్షల టన్నులు కొనుగోలు చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో నెల రోజుల్లో ఇంత భారీ మొత్తంలో ధాన్యం కొనుగోలు సాధ్యమవుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ సీజన్లో పెట్టుకున్న లక్ష్యం నెరవేరడం కష్టమేననే అభిప్రాయాలు పౌరసరఫరాల సంస్థ అధికారుల్లోనే వ్యక్తమవుతున్నాయి.
ధాన్యం కొనుగోళ్లలో అడుగడుగునా నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచులు లేవు, ప్యాడీ క్లీనర్లు లేవు, ధాన్యం ఎత్తేందుకు హమాలీలు లేరు, రవాణా చేసేందుకు లారీలు లేవు.. ఇలా ధాన్యం కొనుగోళ్లలో అనేక సమస్యలు నెలకొన్నాయి. అయితే వీటి పరిష్కారానికి అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లను తగ్గించేందుకే అధికారులు కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో 127 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం 70 లక్షల టన్నులు కాగా, 80-90 లక్షల మధ్య వచ్చే అవకాశం ఉందని తెలిసింది. అయితే ఇంత భారీ మొత్తంలో ధాన్యం కొనుగోలు చేస్తే ప్రభుత్వంపై భారీగా ఆర్థిక భారం పడే ప్రమాదం ఉంది. సుమారు రూ.20 వేల కోట్ల నిధులు అవసరం. ఇంత భారీ మొత్తంలో వెచ్చించే పరిస్థితి లేకపోవడంతో కొనుగోళ్లలో కోత పెట్టేలా కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎం)లోని సబ్‌మార్కెట్ యార్డులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో వారం రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రధాన రోడ్డుపై బైఠాయించి వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చందర్‌గౌడ్ మాట్లాడుతూ వారం రోజలుగా కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటికైనా అధికారులు వెంటనే కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. -ఆత్మకూరు(ఎం)