Godavarikhani | నేరవిభాగం, నవంబర్ 3 : ఓ సామాన్యుడిపై పోలీస్ అధికారి నోరుపారేసుకున్నాడు. నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతూ బాధితుడితో పాటు అతడి తల్లిని అవమానించేలా రోడ్డుపై నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. గోదావరికని ప్రధాన చౌరస్తాలోని హనుమాన్‌నగర్ చౌరస్తా మార్గంలో రోడ్డు వెడెల్పు కార్యక్రమంలో భాగంగా దుకాణాలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలోనే గణేశ్ మెకానిక్ షెడ్‌ను కూల్చేందుకు జేసీబీతో మున్సిపల్ అధికారులు వచ్చారు. దాంతో బాధితులు మున్సిపల్ అధికారులతో వాదనకు దిగారు. దాంతో అక్కడికి చేరుకున్న గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి అక్కడికి చేరుకున్నారు.
ఆ తర్వాత బాధితులు, సీఐకి మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో కోపోద్రిక్తుడైన సీఐ.. నియంత్రణ కోల్పోయి బూతుపురాణం లంకించుకున్నారు. ‘లా.. కొడుకా నేను యూనిఫాంలో ఎవ్వన్విరా నువ్వు’ అంటూ రోడ్డుపైనే బాధితుడు రేడియం శ్రీనివాస్‌ను దుర్భాషలాడుతూ చిందులు వేయడంతో పాటు చేయి చేసుకునేందుకు ప్రయత్నించాడు. అంతటితో ఆగకుండా బాధితుడిని పోలీస్‌స్టేషన్‌కు పట్టుకొని వెళ్లి రెండు గంటల పాటు అక్కడే ఉంచాడు. అయితే, ఈ ఘటనను పలువురు రహస్యంగా ఫోన్లో చిత్రీకరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాల వైరల్ అయ్యాయి. ఆ తర్వాత సీఐ బాధితుడితో రాజీపత్రం రాయించుకొని ఇంటికి పంపించాడు. మున్సిపల్ అధికారులకు రక్షణగా ఉండాల్సిన సీఐ.. దురుసుగా ప్రవర్తించడం ఏంటని పలువురు మండిపడ్డారు.
అయితే, సీఐ వ్యవహారం గోదావరిఖనిలో చర్చనీయాంశంగా మారుతున్నది. దాదాపు రెండేళ్లుగా సీఐగా కొనసాగుతున్న ఇంద్రసేనారెడ్డి ఇటీవల కల్యాణ్‌నగర్‌లో దుకాణాన్ని కోల్పోతున్న ఓ ప్రవాస మైనర్ బాలుడి చెంప చెల్లుమనిపించాడు. అలాగే, కొబ్బరికాయల దుకాణ విక్రయదారుడిపై చేయి చేసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఓ యువ న్యాయవాదిపై సైతం నోరుపారేసుకున్నారు. సీఐ ప్రవర్తనకు నిరసనగా జిల్లా న్యాయవాదులు మూడురోజులు విధులను బహిష్కరించారు. సీఐ ఇక్కడ ఎస్ఐగా పని చేసిన సమయంలోనూ ఓ కేసు నమోదు కావడం గమనార్హం. అయితే, ఈ ఘటనపై సీఐ ఇంద్రసేనారెడ్డి వివరణ ఇచ్చారు. తనను వ్యక్తిగతంగా రేడియం శ్రీనివాస్ విమర్శించడంతోనే తాను ‘దొంగనా కొడునా’ అని అన్న మాట వాస్తవమని.. ఇంతకంటే ఏమి అనలేదని, తాను ఎలాంటి బూతులు తిట్టలేదని చెప్పుకొచ్చారు.