ఊట్కూర్, జూన్ 2 : ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ జెండాలను ఎగురవేశారు. మక్తల్, ఊట్కూర్, మాగనూరు, కృష్ణ టై రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణకు రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గులాబీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్ ఆమరణ దీక్షతో పాటు తెలంగాణ ప్రజల త్యాగాలు కీలకపాత్ర పోషించాయని అన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలన సాగించిందని, మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి అనేక సంక్షేమ అభివృద్ధి, కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తుందని హెచ్చరించారు. మక్తల్- నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని కమిషన్ల కోసమే చేపట్టినట్లు విమర్శించారు. ఊట్కూర్ పెద్ద చెరువులో షిల్టు తొలగించకుండా నీటి సామర్థ్యం ఎలా పెంచుతారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మూడున్నర టీఎంసీల సామర్థ్యం గల సంగంబండ రిజర్వాయర్ ను పక్కన పెట్టి ఒక టీఎంసీ సామర్థ్యం మాత్రమే ఉన్న భూత్పూర్ రిజర్వాయర్ నుండి 7 టీఎంసీల నీటిని లక్ష ఎకరాలకు ఎలా పారిస్తారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
మక్తల్ నుండి నారాయణ పేటకు ఫోర్ లైన్ రోడ్డు నిర్మాణం పచ్చి బూటకమని, ప్రజలను మభ్య పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి శిలాఫలకం ప్రారంభించారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని అధికార పార్టీని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవరీ మల్లప్ప, నరసింహ గౌడ్, చిన్న హనుమంతు, లక్ష్మారెడ్డి, మహిపాల్ రెడ్డి, శివరాజ్ రెడ్డి, రామ్ రెడ్డి , వెంకటేష్ గౌడ్, తరుణ్, అభిలాష్, వడ్ల మోనప్ప, గంగాధర్ చారి, కావలి సురేష్, భాస్కర్ రెడ్డి, మన్నే శేఖర్, చంద్రశేఖర్ గౌడ్, రామలింగం గౌడ్, సురేందర్ రెడ్డి, ఉబేదుర్ రహిమాన్, షేక్ షమీ, ఇర్షాద్, ఖాలిక్, జమాల్ తదితరులు పాల్గొన్నారు.