హైదరాబాద్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన కడియం శ్రీహరిని ఏ పార్టీలో ఉన్నాడో అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అడగటం తప్పు ఎలా అవుతుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నిలదీశారు. తెలంగాణ భవన్లో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేస్తున్న అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సమాధానం చెప్పకుండా సభ నుంచి పారిపోయిందని ఆయన విమర్శించారు. ఇక కాంగ్రెస్ పార్టీ విప్‌లు మాట్లాడిన తీరు హాస్యాస్పదంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. ఇక నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల వీరేశం ఇసుక మొదలు భూముల వరకు అన్నీ దోచుకుంటూ అనేక దౌర్జన్యాలకు తెగబడుతున్నాడని మండిపడ్డారు.
వేముల తన సొంతూరులోనే మార్ట్గేజ్ దోపిడీ జరిగిందని పదవి కోసం ఆయన ఎంతకైనా దిగజారుతాడు అని ఆరోపించారు. ఏ గుర్తిం పూ లేని ఆయన్ను సమాజానికి పరిచయం చేసిన కేసీఆర్‌పైనే అవాకులు చెవాకులు పేలుతున్నాడంటూ చిరుమర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం పేదల గురించే మాట్లాడే వేముల, తిరిగి ఆ వర్గాలపైనే కేసులు పెట్టించాడని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పైనా, కేసీఆర్, హరీశ్‌రావుపైనా మాట్లాడుతుండడం వేములకు సిగ్గుగా అనిపించడం లేదా? అని సూటిగా ప్రశ్నించారు. మంత్రి పొంగులేటికి వేముల బినామీగా మారిపోయాడని ఆరోపించారు. దళిత కార్డు వాడుకొని, మంత్రులైన వారు కేసీఆర్ కట్టించిన అంబేద్కర్ విగ్రహానికి సంకెళ్లు వేస్తే ఎందుకు తీయించడం లేదని ప్రశ్నించారు. నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ హత్య కేసులో వేముల వీరేశంను సీఎం రేవంత్‌రెడ్డి ఏమన్నాడో అందరికీ తెలిసిందేనని లింగయ్య దుయ్యబట్టారు.